చలికాలంలో రోగనిరోధక శక్తి పెంచేందుకు బెస్ట్ ఫుడ్ ఇదే..
ABN , Publish Date - Nov 15 , 2026 | 01:28 PM
శీతాకాలంలో ప్రజలు తరచూ రోగాల బారిన పడుతుంటారు. ఈ సమయంలో రోగనిరోధక శక్తీ తగ్గుతుంది. అయితే, దీనిని పెంచుకునేందుకు చిలకడదుంప ఎంతగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలం వచ్చిందంటే చాలు ఒక్కసారిగా మారిన వాతావరణంలో ప్రజలు అనేక రోగాల బారిన పడుతుంటారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి వేధిస్తుంటాయి. ఈ సమయంలో రోగనిరోధక శక్తీ తగ్గుతుంది. అయితే, చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు చిలకడదుంప (Sweet Potato) ఎంతగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తక్కువ ధరలో లభిస్తూ, శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుందని పేర్కొంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని చెబుతున్నారు.
రోగనిరోధక శక్తిని పెంచేందుకు..
చిలగడదుంపలో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. శరీరం దీనిని విటమిన్-ఏగా మార్చుకుంటుంది. విటమిన్-ఏ రోగనిరోధక వ్యవస్థ సాధారణంగా పనిచేయడానికి ఎంతో అవసరం. అంతేకాకుండా కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
జీర్ణవ్యవస్థకు మేలు..
ఈ దుంపలో ఉండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది. అలాగే, మలబద్ధకం సమస్యను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. కాబట్టి సరైన మోతాదులో చిలగడదుంపను ఆహారంలో భాగంగా చేసుకోవడం ఉత్తమం.
గుండె ఆరోగ్యానికి ఉపయోగకరం..
చిలకడదుంపలో పీచు పదార్థంతో పాటు పొటాషియం కూడా ఉంటుంది. ఇది శరీరంలో రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది. పీచు పదార్థం ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో తోడ్పడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడతాయి.
శరీరానికి స్థిరమైన శక్తి..
దీనిలో సహజ కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థం ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. పీచు కారణంగా జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుంది. దీని వల్ల అతిగా తినాలనే కోరిక నుంచి బయటపడొచ్చు. ఊబకాయం సమస్య ఉన్నవారు దీనిని తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపించవచ్చు.
ఎలా తింటే మంచిది?
చలికాలంలో కాల్చిన చిలకడదుంప తినడం మంచిది. దీనికి కొద్దిగా నిమ్మరసం, చాట్ మసాలా జోడించి తినవచ్చు. అలాగే కూరలు, సలాడ్లు, చాట్ రూపంలోనూ తీసుకోవచ్చు. అయితే ఎక్కువ మసాలాలు, ఉప్పు జోడించకుండా తీసుకోవడం మంచిది.
ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
మధుమేహం ఉన్నవారు చిలగడదుంపను తినేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇందులో కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపవచ్చు. అలాగే, డైట్ చేసేవారు, జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు అందుకు అనుగుణంగా తీసుకోవాలి. అవసరమైతే వైద్యులు లేదా డైటీషియన్ల సలహా తీసుకోవాలి.
కాగా, ఒక్క చిలకడదుంప తినడం వల్లే రోగనిరోధక శక్తి పెరగదు. సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరమని గుర్తుంచుకోవాలి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి
హెచ్ విటమిన్ చేసే మాయ ఏమిటి?