Share News

శీతాకాలంలో సైనస్ సమస్యలు ఎందుకు పెరుగుతాయి?

ABN , Publish Date - Jan 24 , 2026 | 05:02 PM

శీతాకాలంలో సైనస్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే సైనసిటిస్‌కు కారణం ఏమిటి? ఈ సమస్యను నివారించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

శీతాకాలంలో సైనస్ సమస్యలు ఎందుకు పెరుగుతాయి?
Sinus Problems in Winter

ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలం వచ్చిందంటే చాలు.. జలుబు, దగ్గు లాగానే చాలా మందిని సైనస్ సమస్యలూ వేధిస్తాయి. కొందరు దీనిని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇది చెవి ఇన్ఫెక్షన్లు వంటి పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి శీతాకాలంలో సైనసైటిస్ ఎందుకు వస్తుంది? దాన్ని ఎలా నివారించాలి అనే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం.


సైనసైటిస్ ఎందుకు వస్తుంది?

సైనసైటిస్(Sinusitis) ప్రధానంగా వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, సైనస్ మార్గాలలో వాపు లేదా అడ్డంకుల వల్ల వస్తుంది. జలుబు, ఫ్లూ, నాసికా పాలిప్స్, దంత సమస్యలు, ధూమపానం వంటి కారణాల వల్ల సైనస్‌లు(ముక్కులో ఉండే గాలి గదులు) వాచి, శ్లేష్మం పేరుకుపోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది.

శీతాకాలంలో వాతావరణం చల్లగా, పొడిగా ఉంటుంది. దీనివల్ల ముక్కులోని లోపలి(శ్లేష్మ) పొర) పొడిబారుతుంది. అప్పుడు సైనస్ గదుల్లో శ్లేష్మం సరిగా బయటకు రావడం కష్టమవుతుంది. ఫలితంగా ముక్కు దిబ్బడ, తలనొప్పి, ముఖం చుట్టూ నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవే సైనసైటిస్ లక్షణాలు.


ఇంకా జలుబు, ఫ్లూ వల్ల శరీర రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అప్పుడు చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. సైనస్ సమస్యను పట్టించుకోకుండా వదిలేస్తే, అది చెవి ఇన్ఫెక్షన్‌గా మారే ప్రమాదమూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ముక్కులో శ్లేష్మం ఎక్కువగా పేరుకుపోతుంది. అది పొరలా మారి నాసికా మార్గాలను మూసేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో చికిత్స ఆలస్యమైతే పరిస్థితులు శస్త్రచికిత్సకూ దారితీసే అవకాశముంది.


ఈ సమస్య ఎవరికీ ఎక్కువగా వస్తుంది?

  • తరచూ సైనస్ సమస్యలతో బాధపడేవారు

  • అలర్జీలు ఉన్నవారు

  • ఉబ్బసం(ఆస్తమా) ఉన్నవారు

  • తరచూ జలుబు వచ్చే వారు

  • పొగతాగే అలవాటు ఉన్నవారు

సైనస్ సమస్యలు రాకుండా ఉండాలంటే?

  • చల్లని గాలి వీస్తున్నప్పుడు బయటకు వెళ్తే ముక్కు, చెవులను కప్పుకోండి.

  • శరీరంలో శ్లేష్మం పలుచగా ఉండేందుకు రోజూ ఎక్కువగా నీరు తాగండి.

  • దుమ్ము, పొగ, అలర్జీ కలిగించే పదార్థాలకు దూరంగా ఉండండి.

  • ముక్కు దిబ్బడ, చెవి నొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కొన్ని రోజులు కొనసాగితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Jan 24 , 2026 | 05:35 PM