పుట్టగొడుగులు తింటే అలర్జీ వస్తుందా?
ABN , Publish Date - Jan 24 , 2026 | 03:37 PM
పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివే. కానీ అవి అందరికీ సరిపోవు. కొంతమంది పుట్టగొడుగులు తిన్న తర్వాత అలర్జీ సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఎందుకిలా జరుగుతుంది? పుట్టగొడుగులు ఎవరు తినకూడదు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి కాలంలో ఆరోగ్యకరమైన ఆహారంగా పుట్టగొడుగులకు ఆదరణ పెరిగింది. ఇవి తేలికగా జీర్ణమవుతాయి, రుచిగా ఉంటాయి. ప్రోటీన్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. సూప్, కూర, పిజ్జా, సలాడ్... ఇలా ఎన్నో రకాలుగా పుట్టగొడుగులను వంటల్లో వాడుతారు. అయినా కొంతమంది మాత్రం పుట్టగొడుగులు తింటే అలర్జీ వస్తుందని చెబుతుంటారు. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరు పుట్టగొడుగులకు దూరంగా ఉండాలనే వివరాలను పరిశీలిస్తే...
పుట్టగొడుగులు తింటే అలెర్జీ వస్తుందా?
ఫుడ్ అలర్జీ ఉన్నవారు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు, చర్మం చాలా సున్నితంగా ఉండేవారికి పుట్టగొడుగుల వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పుట్టగొడుగుల్లో ఉండే కొన్ని ప్రోటీన్లు ఫంగస్ అలర్జీలతో సంబంధం కలిగి ఉంటాయి. సున్నితమైన వ్యక్తులు పుట్టగొడుగులు తిన్నప్పుడు, వారి శరీర రోగనిరోధక వ్యవస్థ.. వాటిని హానికరమైనవిగా భావిస్తుంది. అప్పుడు హిస్టామిన్ వంటి రసాయనాలు విడుదలవుతాయి. దీని వల్ల దురద, చర్మంపై దద్దుర్లు, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి.
పండించిన పుట్టగొడుగులు, అడవుల్లో దొరికే పుట్టగొడుగులు రెండూ అలర్జీకి కారణమయ్యే ప్రోటీన్లను కలిగి ఉంటాయి. అయితే అడవి పుట్టగొడుగుల్లో ఇవి ఎక్కువగా ఉండే అవకాశముంటుంది. అలాగే ఫుడ్ అలర్జీ ఉన్నవారు పుట్టగొడుగులు తింటే అలర్జీ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.
వీళ్లు పుట్టగొడుగులు తినకూడదు?
పుట్టగొడుగులు లేదా ఇతర ఫంగస్ పదార్థాలకు అలర్జీ ఉన్నవారు వీటిని పూర్తి దూరంగా ఉంచాలి. లేకపోతే చర్మ దద్దుర్లు, దురద, వాపు, శ్వాస సమస్యలు రావచ్చు.
మధుమేహం ఉన్నవారు లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో పుట్టగొడుగులు.. ఇన్ఫెక్షన్‌లు లేదా అలర్జీ సమస్యలను పెంచవచ్చు.
గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యలు ఉన్నవారు పుట్టగొడుగులు ఎక్కువగా తింటే ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
గర్భధారణ సమయంలో లేదా పాలిచ్చే సమయంలో పుట్టగొడుగులు తినకుండా ఉండటం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News