Share News

పిల్లల చెవిలో నూనె వేయడం మంచిదేనా?

ABN , Publish Date - Jan 29 , 2026 | 03:38 PM

చెవి నొప్పి వచ్చినప్పుడు చెవిలో నూనె వేయడం చాలా మందికి సాధారణ అలవాటు. అయితే, చెవిలో నూనె వేయడం వల్ల నిజంగా నొప్పి తగ్గుతుందా? లేక ఇన్ఫెక్షన్ మరింత పెరుగుతుందా? పిల్లల చెవి ఆరోగ్యంపై దీని ప్రభావం ఏంటో తెలుసుకుందాం..

పిల్లల చెవిలో నూనె వేయడం మంచిదేనా?
Oil in Ears

ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు చెవి నొప్పి వచ్చినప్పుడు చెవిలో నూనె వేస్తుంటారు. ఇది పాతకాలం నుంచి వస్తున్న అలవాటు. కానీ ఇది నిజంగా మంచిదేనా? లేక పిల్లల ఆరోగ్యానికి హానికరమా? అనే విషయం చాలా మందికి తెలీదు. పిల్లలకు చెవి నొప్పి వచ్చినప్పుడు ఆవాల నూనె లేదా ఇతర నూనెలను చెవిలో వేయడం చాలా సాధారణం. కొందరు చెవిలో మైనం (వాక్స్) పేరుకుపోయినప్పుడు కూడా నూనె వేస్తారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం.. ఈ అలవాటు సమస్యను తగ్గించడం కంటే మరింత పెంచే అవకాశం ఉంది.


చెవిలో నూనె వేయడం ఎందుకు ప్రమాదకరం?

ఆరోగ్య నిపుణుల ప్రకారం, పిల్లలకు చెవి నొప్పి రావడానికి ప్రధాన కారణం ఇన్ఫెక్షన్ లేదా ఇతర సమస్యలు. అలాంటి సమయంలో చెవిలో నూనె వేస్తే ఇన్ఫెక్షన్ తగ్గదు. పైగా బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో నొప్పి, వాపు, మంట వంటి సమస్యలు పెరుగుతాయి. చెవి నుంచి చీము లేదా నీరు వస్తుంటే.. చెవిలో నూనె వేయడం మరింత ప్రమాదకరం. జలుబు లేదా జ్వరం సమయంలో కూడా చెవి నొప్పి రావచ్చు. అప్పుడు ఇంటి చిట్కాలు ప్రయత్నించకుండా ముందుగా వైద్యుడిని సంప్రదించాలి.


చెవి నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి?

  • పిల్లలకు చెవి నొప్పి ఉంటే తప్పనిసరిగా ENT వైద్యుడిని సంప్రదించాలి. స్వయంగా మందులు లేదా ఇంటి నివారణలు చేయడం వల్ల సమస్య మరింత ఎక్కువ కావొచ్చు.

  • చెవిని శుభ్రం చేసే క్రమంలో ఇయర్‌బడ్‌ను జాగ్రత్తగా ఉపయోగించాలి.

  • ఇయర్‌బడ్‌ను చెవిలో చాలా లోతుగా పెట్టకూడదు.

  • వైద్యుడి సూచన లేకుండా చెవిలో డ్రాప్స్ వేయకూడదు.

  • పిల్లలు తరచూ చెవిని పట్టుకోవడం, ఏడవడం చేస్తే వెంటనే గమనించాలి.

  • స్నానం చేయించేటప్పుడు చెవిలోకి నీరు లేదా సబ్బు వెళ్లకుండా చూసుకోవాలి.

  • చల్లని వాతావరణంలో చెవులను వెచ్చగా ఉంచాలి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Jan 29 , 2026 | 05:59 PM