Share News

కఠిన రోగాల ఆటకట్టు

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:28 PM

అటికమామిడి అని కొన్ని ప్రాంతాల్లో గలిజే రుగా పిలుస్తారు. పునర్నవ అంటే ఇప్పుడం దరికీ తెలిసిన పేరు.

కఠిన రోగాల ఆటకట్టు
Punarnava, health

అటికమామిడి అని కొన్ని ప్రాంతాల్లో గలిజే రుగా పిలుస్తారు. పునర్నవ అంటే ఇప్పుడం దరికీ తెలిసిన పేరు. చుట్టుముట్టే రోగాలపైన అటికమామిడి ఒక చిటికెలో చేయదగిన చికిత్సగా ఉపయోగించే ఆహార ద్రవ్యం కూడా!

పునర్నవ అనే పేరులోనే శరీరానికి పునర్యవ్వనాన్ని అందిస్తుందనే ఖ్యాతి రాసి పెట్టి ఉంది. కోల్పోయిన శరీర ధాతువులకు ప్రాణ ప్రతిష్ఠ చేసే అమృత హృదయం దీనిది.లివరు, స్పీల్న్‌, పాంక్రియాజ్‌, కిడ్నీలకు ఇది రక్షణ చక్రం. ఊరంతా చుట్టబెట్టే కామెర్లు, కళ్లకలకలు, చివరకు కరోనా వంటి మహమ్మారుల దాడి నుంచి కూడా ఇది దేహానికి రక్షణ కవచంలా నిలుస్తుంది. దీని స్పర్శ తగిలితే చాలు కామెర్ల వ్యాధి తగ్గుతుందని గలిజేరు తీగని 3-4 పేటలుగా చుట్టి మెడలో హారంలా వేసుకుంటారు. ఇలా గళానికి చేరు (నగ)లా ధరిస్తారని గలిజేరనే పేరొచ్చిందంటారు.


గలిజేరాకులు, కాండం, వేళ్లు అన్నీ వగరు, చిరుచేదుల కలబోతగా ఉంటాయి. పొడికూర, పప్పు, పచ్చడి ఇలా పాలకూరతో వండుకునేవన్నీ గలిజేరుతోనూ వండుకోవచ్చు. ములగాకుతోనో చింతచిగురుతోనో కలిపి కార ప్పొడి తయారు చేసుకోవచ్చు. గోంగూర నిలవపచ్చడికి అనుసరించే పద్ధతిలోనే గలిజేరుతోనూ నిలవ పచ్చడి పెట్టుకోవచ్చు. పాలక్‌ పకోడి, మసాలా వడ లాంటివి గలిజేరు ఆకులతోనూ వండుకోవచ్చు. కీళ్లవాతంలో వచ్చే వాపులు, నొప్పుల్ని కరిగిస్తుంది కూడా!

గుండె జబ్బులున్నవారికి గుండె బలాన్ని స్తుంది. నివారించడంలో, రక్త ధాతువును, ఇతర ధాతువులను కూడా పెంచి పోషిస్తుంది. క్షయ, ఎయిడ్స్‌ వంటి క్షీణ వ్యాధుల్లో సైతం ఇది అండగా నిలుస్తుంది.


దీని ఆకుల్లో పీచు ఎక్కువ కాబట్టి ఇది షుగరు, స్థూలకాయం ఉన్నవారికి మేలుచేసే ద్రవ్యం. వాళ్లు తరచూ తాజా గలిజేరు పప్పు లేదా పొడి కూర లాంటివి వండుకుని తినటం మంచిది. కొందరైతే ఉదయాన్నే ఈ ఆకుల ముద్దని నీళ్లలో వేసి మరిగించి చిక్కని కషాయాన్ని తాగుతారు. మలబద్ధకాన్ని జయించాలంటే ఇది మంచి ఉపాయం. మొలల వ్యాధిని దూరం చేసి, జీర్ణకోశాన్ని ప్రక్షాళన చేస్తుంది. దేహంలో చేరిన అనవసరపు నీటిని బయటకు పంపి, ఉబ్బును తగ్గిస్తుంది.

మన పూర్వీకులు ఈ ఆకులను మినప్పప్పు, సుగంధ ద్రవ్యాలతో కలిపి రుబ్బి, వడియాలుగా పెట్టుకునేవాళ్లు. ఈ వడియాలను నూనెలో వేగించకుండా కూరల్లోనూ పులుసుల్లోనూ కలిపి ఉడికించేవాళ్లు.


లేత గలిజేరు ఆకులను తెచ్చి, శుభ్రంగా కడిగి సన్నగా తరిగి వాటికి కాసినన్ని లేత కాకర ఆకుల్ని, కొద్దిగా శొంఠి పొడిని చేర్చి నీళ్లు పోసి ఉడికించాలి. ఇది గలిజేరు శుద్ధి ప్రక్రియ. ఉడికిన తరువాత కాకరాకుల అవసరం లేదు, తీసేయవచ్చు. ఉడికిన ఈ గలిజేరు ఆకుల్ని ఒక బాండీలోకి తీసుకుని, తగినంత ఉప్పు, కోరుకున్న సుగంధ ద్రవ్యాలు చేర్చి, కమ్మని నెయ్యి వేసి దోరగా వేగించాలి. వేడి కాస్త తగ్గాక, చిటికెడు పచ్చకర్పూరం చల్లితే ఆ కూర పరిమళం ఇల్లంతా గుబాళిస్తుంది.

ఉడికించిన గలిజేరు ఆకులు వేడి చెయ్యకుండా ఉంటాయి. ఈ ఆకులతో పప్పు, పచ్చడి ఇలా వంటకాలన్నీ వండుకోవచ్చు.


ఆకుకూరలంటే కేవలం తోటకూర, పాలకూర, గోంగూరలే కావు! అంతకన్నా ఎన్నో రెట్లు ఔషధ విలువలున్న అమృతం లాంటి మొక్కలు మన చుట్టూనే పెరుగుతున్నాయి. గలిజేరుతో పాటు గుంటగలగర, ఉత్తరేణి, కొండపిండి, చెంచలి, గంగపావిలి, గజపల్లేరు వంటి మొక్కలు రోడ్డు పక్కన, పొలం గట్ల మీద మన కోసం ఎదురుచూస్తుంటాయి.

ఇది కామెర్లలో దివ్య ఔషధం. పునర్నవారి షట, పునర్నవాది మండూరం లాంటి అనేక ఆయుర్వేద ఔషధాలు రక్తహీనతను తగ్గించి, కాలేయాన్ని బలసంపన్నం చేసేవిగా ప్రసిద్ధం. రసాయనాలు పురుగుమందుల విషపు వలయం నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే... ప్రకృతి ఉచితంగా ప్రసాదించే ఇలాంటి ప్రత్యామ్నాయ ద్రవ్యాలపై మనసు పెట్టక తప్పదు.

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


ఈ వార్తలు కూడా చదవండి:

వాన నీటి కచేరీ

స్కూలు పుస్తకంలో తన కథే ఓ పాఠంగా..!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 26 , 2026 | 01:51 PM