చేతులు, భుజాలలో నిరంతర నొప్పి ఏ వ్యాధి లక్షణం?
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:18 PM
చేతులు లేదా భుజాల్లో తరచూ నొప్పి రావడం చాలా మందికి సాధారణ సమస్యలాగా అనిపిస్తుంది. కానీ ఈ నొప్పి ఎక్కువ రోజులు కొనసాగితే మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఎక్కువసేపు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ వాడటం, తప్పు భంగిమలో కూర్చోవడం, బరువులు ఎత్తడం, ఆకస్మికంగా ఎక్కువ శ్రమ చేయడం వల్ల చెయ్యి, భుజం నొప్పి రావచ్చు. కానీ ఈ నొప్పి తరచూ వస్తుంటే లేదా తగ్గకుండా ఉంటే అది జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం. చాలా మంది ఈ నొప్పిని పట్టించుకోకుండా నొప్పి మందులు వేసుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల అసలు కారణం బయటపడదు, సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఈ నొప్పికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.
సర్వైకల్ స్పాండిలైటిస్: మెడలోని నరాలపై ఒత్తిడి పడితే ఆ నొప్పి భుజాలు, చేతుల వరకు వ్యాపిస్తుంది.
ఆర్థరైటిస్(కీళ్ల వాపు): కీళ్లలో వాపు, గట్టిదనం ఉండటం వల్ల నిరంతర నొప్పి వస్తుంది.
ఫ్రోజన్ షోల్డర్: భుజం కదలిక తగ్గిపోవడం, తీవ్రమైన నొప్పి రావడం జరుగుతుంది.
నరాల సమస్యలు: చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మంట, కండరాల బలహీనత, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
గుండె సమస్యలు: కొన్ని సందర్భాల్లో గుండెకు సంబంధించిన సమస్యలు ఎడమ చేయి, భుజంలో నొప్పిగా కనిపించవచ్చు. దీనిని అసలు తేలికగా తీసుకోకూడదు.
చేతులు, భుజాల్లో నొప్పితో పాటు కనిపించే ఇతర లక్షణాలు:
మెడ లేదా వెన్నులో గట్టిదనం
చేతుల్లో తిమ్మిరి లేదా జలదరింపు
బలహీనంగా అనిపించడం
వాపు రావడం
చేతిని లేదా భుజాన్ని కదిలించడంలో ఇబ్బంది
కొన్నిసార్లు తలనొప్పి, తల తిరగడం, అలసట
నరాలకు సంబంధించిన సమస్యలుంటే వేళ్లలో జలదరింపు ఎక్కువగా ఉంటుంది. కీళ్ల వాపు సమస్యల్లో కీళ్లు ఎర్రగా, వెచ్చగా కూడా అనిపించవచ్చు.
చెయ్యి లేదా భుజం నొప్పి కొన్ని రోజుల్లో తగ్గకపోతే, నొప్పి రోజురోజుకీ ఎక్కువవుతుంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. నొప్పితో పాటు తిమ్మిరి, బలహీనత, వాపు లేదా ఛాతీ నొప్పి ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పదే పదే నొప్పి మందులు వాడటం సరైన పరిష్కారం కాదు. సకాలంలో వైద్యులను సంప్రదించి అసలు కారణం తెలుసుకుని సరైన చికిత్స తీసుకోవాలి. తద్వారా పెద్ద సమస్యలు రాకుండా నివారించవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News