ఇంగువతో ప్రయోజనం ఏమిటి?
ABN , Publish Date - Jan 25 , 2026 | 01:32 PM
ఏడాది పొడుగునా లభించినా గోబీ పువ్వు (క్యాలీఫ్లవర్) శీతాకాలంలో తాజాగా, చౌకగా లభిస్తుంది. క్యాలీఫ్లవర్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. ఇందులో విటమిన్ సి మంచి మోతాదులో ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
వంటకాల్లో కొద్దిగా వాడే ఇంగువ ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుంది? దీన్ని ఎక్కువగా వాడితే ప్రమాదమా?
- కల్యాణి, ముంబయి
ఫెరులా అసాఫోటిడా అనే మొక్క వేళ్ళ దగ్గర తీసే జిగురు నుండి ఇంగువ తయారవుతుంది. దీనిని వంటకాల్లో మితంగా వాడడం ఆరోగ్యానికి ప్రయోజనకరం. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి ఉబ్బరం, గ్యాస్, అజీర్తిని తగ్గిస్తుంది. పప్పులు లాంటివి అరిగేందుకు, కష్టమైన ఆహారాలను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఇంగువలో ఉన్న యాంటీ- ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-వైరల్ పదార్థాలు శ్వాసకోశ సమస్యలు, నొప్పులు, రక్తపోటు, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటాయి.
అదనంగా, యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబియల్ గుణాల కారణంగా శరీర రోగనిరోధకశక్తి మెరుగుపడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను ఎదుర్కొనేందుకు కూడా ఉపయోగపడుతుంది. అయినప్పటికీ, ఇంగువను తగిన మోతాదులో మాత్రమే వాడాలి, ఎక్కువగా తీసుకుంటే పేగు సమస్యలు, తలనొప్పి, వికారం లాంటి సమస్యలు తలెత్తవచ్చు, ముఖ్యంగా గర్భిణులు లేదా ఇతర అనారోగ్య సమస్యలున్నవారు వైద్య సలహా తీసుకోవాలి.
చలికాలంలో నిలువ పచ్చళ్లు నోటికి చాలా రుచిగా అనిపిస్తాయి. ఎండాకాలంలో అయితే అవి వేడి చేస్తాయేమో అన్న భయం ఉంటుంది. అలాంటప్పుడు చలికాలంలో రోజూ నిలువ పచ్చళ్లు తినడం పరవాలేదా?
- సహజ, హైదరాబాద్
చలికాలంలో నిలువ పచ్చళ్లు లేదా ఊరగాయలు నోటికి చాలా రుచిగా అనిపించడం సహజమే. కొన్ని రకాల కాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఊరగాయలు పెడతారు. ఊరగాయల్లో ఉప్పు, నూనె, కారంతో పాటుగా అల్లం, వెల్లుల్లి, ఆవపిండి, మెంతిపిండి వంటివి కూడా కలుపుతారు. సాధారణంగా ఆయా కాయల్లో ఉండే పోషకవిలువలలో మొత్తం కాకపోయినా కొంతైన ఊరగాయల్లో కూడా ఉంటాయి. కొద్ది మోతాదులో ఊరగాయలు తీసుకుంటే వాటిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు మనకందటమే కాక జీర్ణాశయ ఆరోగ్యానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. కానీ, అధిక మొత్తంలో ఉప్పు, కారం ఉండడం వల్ల ఊరగాయలు ఎక్కువగా అన్నంలో కలుపుకు తినాల్సిన అవసరం ఉంటుంది.
దీనివల్ల అవసరానికి మించి అన్నం తింటాం. అంతే కాకుండా ఊరగాయ ఎక్కువ తినేవారు మామూలు కాయగూరలు, ఆకుకూరలు మొదలైనవి తక్కువ తినడం వల్ల ఆరోగ్యానికి ఇబ్బంది. అధిక రక్తపోటు ఉన్న వారు ఊరగాయలకు దూరంగా ఉండడం ఉత్తమం. ఊర గాయలకు ప్రత్యామ్నాయంగా చట్నీలు లేదా రోటి పచ్చళ్ళ విషయానికొస్తే, ఉప్పు, కారం తక్కువగా వేసి తక్కువ నూనెతో తాలింపు వేసినవైతే రోటి పచ్చళ్ళు కూడా కూరల్లాగే ఆరోగ్యకరమైనవి. అయితే తినే మోతాదును నియంత్రించు కోకపోతే అన్నం అధికంగా తీసుకొనే అవకాశం ఉంది. ఈ ఊరగాయలు, చట్నీలను అన్నంతో తినడం కాకుండా కూరల తోనో, పప్పుతోనో, పెరుగులోనో నంజుకుని తింటే, అన్నం అధికంగా తీసుకొనే పని తప్పుతుంది. కొన్ని రకాల చట్నీలైతే చపాతీల్లోనూ, జామ్ బదులుగా బ్రెడ్ పైన రాసి శాండ్విచ్ చేసుకోడానికి వాడుకోవచ్చు.
గోబీ పువ్వుల సీజన్ నడుస్తోంది. గోబీలో ఉన్న పోషక విలువల గురించి తెలియజేయండి?
- కిరణ్, వరంగల్
ఏడాది పొడుగునా లభించినా గోబీ పువ్వు (క్యాలీఫ్లవర్) శీతాకాలంలో తాజాగా, చౌకగా లభిస్తుంది. క్యాలీఫ్లవర్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. ఇందులో విటమిన్ సి మంచి మోతాదులో ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గోబీలో ఉన్నయాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వాపును తగ్గించి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫోలేట్, విటమిన్ బి6 వంటి పోషకాలు నరాల ఆరోగ్యానికి సహాయపడతాయి. తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు నియంత్రణకు గోబీ మంచి ఎంపిక.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా గోబీ తినేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు, కానీ బాగా వండిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. పచ్చి గోబీని తినకపోవడం మంచిది. క్యాలీఫ్లవర్లో క్యాలరీలు చాలా తక్కువ ఉండడం వల్ల బరువు నియంత్రణలో ఉంచేందుకు ఇది చక్కటి ఆహారం. వీలున్నంతవరకు ఆవిరిపై ఉడికించి లేదా తక్కువ నూనె వేసి వండిన కూరగానే గోబీ తీసుకోవడం మంచిది. డీప్ ఫ్రై చేసిన క్యాలీఫ్లవర్ 65, మంచూరియా, బజ్జి లాంటివి రుచిగా ఉన్నా, ఆరోగ్యప్రయోజనాలు ఉండవు.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.com కు పంపవచ్చు)
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News