Health: అతిగా ఆహారం.. ఆరోగ్యానికి చేటు
ABN , Publish Date - Jan 04 , 2026 | 07:40 AM
అతిగా ఆహారం.. ఆరోగ్యానికి చేటు అని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారం ఎక్కువగా తీసుకుంటే జీర్ణకోశానికి సంబంధించిన గ్యాస్ట్రో ఎంటరైటీస్, నాన్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇబ్బందులు ఎక్కువగా వస్తాయని తెలుపుతున్నారు.
- ఆలస్యంగా తింటే మరింత ముప్పు
- స్పైసీ ఫుడ్‌తో సమస్యలు ఎన్నో..
హైదరాబాద్ సిటీ: కాస్తా సమయం దొరికితే చాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని అనుకుంటాం. ఏదైనా మంచి హోటల్‌కు వెళ్లి స్పైసీ ఫుడ్, నాన్ వెజ్ బిర్యానీ ఆరగిద్దామని ప్లాన్ చేసుకుంటాం. అంతేనా.. దాంతో పాటు కేక్‌లు, స్వీట్లు, కూల్‌డ్రింక్‌లు ఇలా పలు రకాల ఆహార పదార్థాలను లాగించేస్తాం. అయితే ఆహారం అతిగా తీసుకుంటే ప్రమాదమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తీసుకునే ఆహారం ఆరోగ్యానికి చేటు చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
జబ్బులు ఇలా..
ఆహారం ఎక్కువగా తీసుకుంటే జీర్ణకోశానికి సంబంధించిన గ్యాస్ట్రో ఎంటరైటీస్, నాన్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి. ఆహారం కలుషితమైతే అక్యుట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ కు దారితీస్తుంది. దీని వల్ల వాంతులు, విరోచనాలు రావడమే కాక కాలేయం పనితీరు దెబ్బతింటుంది. దీంతో హైపటైటిస్-ఎ, హైపటైటిస్-సి, వైరల్ ఫీవర్ వంటివి దరిచేరుతాయి. అలాగే దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తాయి. అంతేకాక ఫ్యాటీ లివర్, అధిక బరువు సమస్యలు దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతాయి.

తీసుకున్న ఆహారం ఖర్చు కావాలి
మనం ఎన్ని కేలరీల ఆహారం తీసుకున్నప్పటికీ ఆ మొత్తం ఖర్చు కావాలి. అప్పుడే బరువు పెరగకుండా ఉంటుంది. చాలామంది వ్యాయామం చేయకపోవడం వల్ల తీసుకున్న ఆహారం కేలరీల రూపంలో ఖర్చు కావడం లేదు. ఒక వ్యక్తికి సాధారణంగా రోజుకు 2వేల నుంచి 2,500 కేలరీల ఆహారం తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు.
మిత ఆహారంతోనే మేలు
మిత ఆహారమే మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొత్త సంవత్సరం కదా.. అని ఎక్కువగా ఆహారం, అల్కాహాల్ తీసుకోవద్దు. ఆయిల్ తక్కువ ఉన్న ఆహారమే తీసుకోవాలి. సరిగ్గా ఉడకని ఆహారం తీసుకోవద్దు. అల్కాహాల్, స్పైసీ ఆహారం తీసుకుంటే మంచినీళ్లు, కొబ్బరినీళ్లు తప్పని సరిగా తీసుకోవాలి. చలికాలంలో ముక్కు నుంచి నీరు కారుతుందో లేదో గమనించాలి. దీని వల్ల బ్యాక్టీరియా వెనకకు వెళ్లి మెదడుకు ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది. గుండె, మధుమేహం, శ్వాసకోశసంబంధిత వ్యాధులున్న వారు జాగ్రత్తగా ఉండాలి. బయటకు వస్తే స్వెటర్లు, తల, ముఖం కవర్ అయ్యేలా మాస్కులు ధరించాలి.
- డాక్టర్ కిరణ్ పెద్ది, గ్యాస్ట్రో
ఎంటరాలజిస్టు, యశోద ఆస్పత్రి
ఈ వార్తలు కూడా చదవండి..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తెలుగు రాష్ట్రాల్లో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు
Read Latest Telangana News and National News