Heart Health Tips: మీ గుండె బలంగా ఉందో లేదో ఇలా తెలుసుకోండి..
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:38 PM
ఇటీవలి కాలంలో యువతలో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యంపై అవగాహన చాలా అవసరం. అయితే.. మీ గుండె బలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక సులభమైన మార్గం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మనిషి శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది శరీరమంతా రక్తాన్ని పంప్ చేసి, కణాలకు ఆక్సిజన్, పోషకాలు అందజేస్తుంది. అలాగే కార్బన్ డయాక్సైడ్ వంటి వ్యర్థాలను ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. గుండె నిరంతరం పనిచేసే అవయవం కావడంతో దాని ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.
ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతలో కూడా హార్ట్ ఎటాక్ కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. నడుస్తున్న సమయంలో, నృత్యం చేస్తుండగా లేదా రోజువారీ పనులు చేస్తుండగానే కొందరు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యంపై అవగాహన చాలా అవసరం. అయితే.. మీ గుండె బలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక సులభమైన మార్గం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రెస్టింగ్ హార్ట్ రేట్(RHR)..
చాలా మంది గుండె ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి కొలెస్ట్రాల్, బీపీ పరీక్షలు చేయించుకుంటారు. మరికొందరు ఈసీజీ, ట్రెడ్‌మిల్ టెస్టులు కూడా చేస్తుంటారు. అయితే నిపుణుల ప్రకారం, రెస్టింగ్ హార్ట్ రేట్(Resting Heart Rate – RHR) విశ్రాంతి హృదయ స్పందన రేటు తెలుసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని సులభంగా అంచనా వేయవచ్చు.
విశ్రాంతి హృదయ స్పందన రేటు..
విశ్రాంతి హృదయ స్పందన రేటు అంటే.. మీరు ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలిపే కొలత. ఇది గుండె ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో చెప్పే ముఖ్యమైన సూచిక అని వైద్యులు చెబుతున్నారు.
హృదయ స్పందన రేటు ఎంత ఉండాలి?
సాధారణంగా పెద్దలకు నిమిషానికి 60 నుంచి 80 బీట్స్ మధ్య హృదయ స్పందన రేటు ఉంటే అది ఆరోగ్యకరమైనదిగా భావించవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారు లేదా అథ్లెట్లు అయితే వారి హృదయ స్పందన నిమిషానికి 40 నుంచి 50 బీట్స్ వరకు ఉండవచ్చు.
సరళంగా చెప్పాలంటే.. వ్యాయామం చేయని వ్యక్తి గుండె శరీరానికి కావాల్సిన రక్తాన్ని పంప్ చేయడానికి ఎక్కువ సార్లు కొట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఫిట్‌నెస్ ఉన్న వ్యక్తుల గుండె తక్కువ బీట్స్‌తోనే అదే పనిని చేస్తుంది. దీని అర్థం వారి గుండె బలంగా, సమర్థవంతంగా పనిచేస్తోందన్న మాట.
విశ్రాంతి సమయంలోనూ హృదయ స్పందన ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణాలు:
నిద్రలేమి: తగినంత నిద్ర లేకపోతే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
డీహైడ్రేషన్: శరీరానికి అవసరమైనంత నీరు తాగకపోతే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.
దీర్ఘకాలిక ఒత్తిడి: మానసిక ఒత్తిడి హృదయ స్పందన రేటును పెంచుతుంది.
టీ, కాఫీ అధికంగా తీసుకోవడం: ఎక్కువగా కెఫిన్ తీసుకుంటే హృదయ స్పందన వేగంగా మారుతుంది.
ఇతర ఆరోగ్య సమస్యలు: మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఉన్నవారిలో ఈ రేటు ఎక్కువగా ఉంటుంది.
వైద్యుల సూచన..
మీ విశ్రాంతి హృదయ స్పందన రేటును తరచూ గమనించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని ముందుగానే అర్థం చేసుకోవచ్చు. హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, అవసరమైతే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. చిన్న జాగ్రత్తలు భవిష్యత్తులో పెద్ద సమస్యలను నివారించగలవని నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News