Nail Changes Health Signs: గోళ్లలో కనిపించే ఈ మార్పులు ప్రాణాంతక వ్యాధులకు సంకేతాలా?
ABN , Publish Date - Jan 19 , 2026 | 01:56 PM
గోళ్లలో వచ్చే మార్పులు శరీరంలోని అంతర్గత సమస్యలను ముందుగానే తెలియజేస్తాయి. చిన్న మార్పులను నిర్లక్ష్యం చేస్తే.. అవి భవిష్యత్తులో తీవ్రమైన అనారోగ్యాలకు దారితీసే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా చాలా మంది గోళ్లను కేవలం సౌందర్య పరంగా మాత్రమే చూసుకుంటారు. కానీ వైద్య శాస్త్రం ప్రకారం.. గోళ్లు మన ఆరోగ్యానికి అద్దంలాంటివి. గోళ్ల రంగు, ఆకారం, దృఢత్వంలో వచ్చే మార్పులు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అంతర్గత అవయవాల ఆరోగ్యాన్నీ సూచిస్తాయి. రక్త ప్రసరణ లోపించడం, పోషకాహార లోపం లేదా తీవ్రమైన అనారోగ్యాలు వంటివి గోళ్లను బలహీనంగా మార్చుతాయి.
గోళ్ల రంగులో మార్పులు..
గోళ్లు పసుపు రంగులోకి మారడం సాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇది థైరాయిడ్ సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు లేదా కాలేయ సమస్యలకూ సంకేతం కావచ్చు.
గోళ్లపై తెల్లని మచ్చలు కనిపించడం సాధారణంగా చిన్న గాయాలు లేదా ఖనిజ లోపం వల్ల వస్తాయి. కానీ గోళ్లు పూర్తిగా తెల్లగా మారితే.. అది మూత్రపిండాల వైఫల్యం లేదా తీవ్రమైన కాలేయ సమస్యలకు హెచ్చరికగా ఉండవచ్చు.
గోళ్లు, వేళ్ల చివర్లు పైకి వంగి మందంగా మారితే దానిని నెయిల్ క్లబ్బింగ్ అంటారు. ఇది శరీరంలో ఆక్సిజన్ లోపం, గుండె జబ్బులు లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు.
గోళ్లపై గీతలు..
గోళ్లపై నీలం లేదా నలుపు గీతలు కనిపిస్తే.. అవి మెలనోమా(చర్మ క్యాన్సర్)కు సంకేతంగా ఉండే అవకాశముంది. గోళ్లు తరచూ విరగడం, బలహీనంగా మారుతున్నాయంటే థైరాయిడ్ సమస్యలు లేదా విటమిన్ B7 లోపం వల్ల కూడా జరగవచ్చు. నిలువు గీతలు వయస్సు పెరగడం వల్ల సాధారణంగా కనిపించవచ్చు. కానీ అకస్మాత్తుగా మార్పులు వస్తే వైద్యుడిని సంప్రదించడం అవసరం.
గోళ్లు ఎందుకు మెరుస్తాయి?
కొంతమందికి గోళ్లు ఎక్కువగా మెరుస్తూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం కెరాటిన్ ప్రోటీన్ పరిమాణం. అధిక వేడి, చలి, నీరు లేదా గాలికి ఎక్కువగా గురైతే గోళ్లలో అసాధారణ మెరుపులు లేదా మార్పులు ఉంటాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల లోపం కూడా గోళ్ల సమస్యలకు కారణమవుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో వాల్‌నట్స్, బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిపుణుల సూచనలు
గోళ్లలో వచ్చే మార్పులు శరీరంలోని అంతర్గత సమస్యలను ముందుగానే తెలియజేస్తాయి. చిన్న మార్పులను నిర్లక్ష్యం చేస్తే.. అవి భవిష్యత్తులో తీవ్రమైన అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉంది.
మీ గోళ్ల రంగు, ఆకారం లేదా నిర్మాణంలో అకస్మాత్తుగా మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ముందస్తు నిర్ధారణతో పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News