Dark Patches on Neck: మెడ వెనకవైపు చర్మం నల్లగా ఉందా? రిస్క్‌లో పడ్డట్టే..
ABN , Publish Date - Jan 17 , 2026 | 10:25 PM
మెడ వెనుకవైపు చర్మం, పొట్టపై చర్మం ముడతలు పడ్డ చోట నల్లగా ఉండటాన్ని వైద్యుల పరిభాషలో అకాంథోసిస్ నైగ్రికాన్స్ అని అంటారు. ఇది ఇన్సులీన్ రెసిస్టెన్స్‌కు తొలి సంకేతాల్లో ఒకటని వైద్యులు చెబుతున్నారు. ఇన్సులీన్ రెసిస్టెన్స్ చివరకు డయాబెటిస్‌కు దారి తీస్తుందని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కొందరిలో మెడ వెనుకవైపు చర్మం నల్లగా కనిపిస్తుంటుంది. ఉదరంపై చర్మం ముడతలు పడ్డ చోట, మోచేయి వెనక వైపు కూడా ఒక్కోసారి ఇలా నల్లగా మారుతుంది. అపరిశుభ్రత వల్ల ఇలా జరుగుతుందని చాలా మంది అనుకుంటారు. అయితే, అంతర్లీనంగా ఉన్న సమస్యలకు ఈ మార్పు తొలి సంకేతమని వైద్యులు హెచ్చరిస్తున్నారు (Acanthosis Nigricans Insulin Resistance).
మెడ వెనకవైపు ఉన్న చర్మం, పొట్టపై చర్మం ముడతలు పడ్డ చోట నల్లగా మారడాన్ని వైద్య పరిభాషలో అకాంథోసిస్ నైగ్రికాన్స్ అని అంటారు. సాధారణంగా దీనితో ఎలాంటి ఇబ్బందీ ఉండనప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇది ఇన్సులీన్ రెసిస్టెన్స్‌కు తొలి సంకేతమని చెబుతున్నారు.
వైద్యులు చెప్పేదాని ప్రకారం, ఇన్సులీన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు శరీరం ఇన్సులీన్ ఉత్పత్తిని మరింతగా పెంచుతుంది. ఇది చర్మంలోని కణాలను పరిమితికి మించి ప్రేరేపించి నల్లని మచ్చలు కలిగించే పిగ్మెంటేషన్‌కు దారి తీస్తుంది. ఇన్సులీన్ రెసిస్టెన్స్ చివరకు డయాబెటిస్‌కు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, మెడ వెనకవైపు, ఉదరంపై ఉన్న చర్మం నల్లగా మారుతున్న సందర్భాల్లో వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఏమిటీ ఇన్సులీన్ రెసిస్టెన్స్..
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులీన్‌కు శరీరం పూర్తిస్థాయిలో స్పందించకపోతే ఇన్సులీన్ రెసిస్టెన్స్ మొదలైనట్టని వైద్యులు వివరిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో పాంక్రియాటిక్ గ్రంథి ఇన్సులీన్ ఉత్పత్తిని మరింతగా పెంచుతుంది. పెరిగిన ఇన్సులీన్ వల్ల మెడ వెనకవైపు, ఇతర భాగాల్లోని చర్మం నల్లబడుతుంది. ఇలాంటప్పుడు వెంటనే వైద్యులను సంప్రదిస్తే తగు జాగ్రత్తలు తీసుకునే వీలు చిక్కుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిన బ్లడ్ టెస్టులు
గుండె ఆరోగ్యం కాపాడుకోవాలంటే.. లైఫ్‌లో ఈ మార్పులు తప్పనిసరి!