Essential Blood Tests: 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిన బ్లడ్ టెస్టులు
ABN , Publish Date - Nov 03 , 2025 | 03:05 PM
40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయించుకోవాల్సిన బ్లడ్ టెస్టులు కొన్ని ఉన్నాయి. ఇవి చేయించుకుంటే ప్రాణాంతక వ్యాధులను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: 40 ఏళ్ల వయసు జీవితంలో ఓ కీలక మైలురాయి. బరువు బాధ్యతలు ఎక్కువయ్యే ఈ వయసులో శరీరం పలు మార్పులకు లోనవుతుంది. ఈ వయసులో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే వార్ధక్యంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, 40 ఏళ్ల వయసొచ్చిన వారు ముందుజాగ్రత్తగా కొన్ని టెస్టులను తప్పనిసరిగా చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు (Essential Medical Tests for People Over 40 Years of Age).
లిపిడ్ ప్రొఫైల్
ఈ టెస్టుతో శరీరంలో హెచ్‌డీఎల్ (మంచి) కొలెస్టెరాల్, ఎల్‌డీఎల్ (చెడు) కొలెస్టెరాల్‌తో పాటు ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వులు ఎంత స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. వీటి స్థాయి పెరిగితే హైబీపీ, గుండె పోటు, స్ట్రోక్ వచ్చే ముప్పు పెరుగుతుంది. ఈ టెస్టులతో ముందుగానే కొలెస్టెరాల్ స్థాయిలను గుర్తిస్తే అనారోగ్యం ముప్పును తప్పించుకోవచ్చు.
కిడ్నీ ఫంక్షన్ టెస్టులు
కిడ్నీ సమస్యలు చాలా వరకూ సైలెంట్‌గా మొదలవుతాయి. రోగ లక్షణాలు బయటపడే సరికి చాలా ఆలస్యం అయిపోతుంది. కాబట్టి ఈ సమస్యలను ముందుగానే కనుగొనేందుకు కిడ్నీ ఫంక్షన్ టెస్టులు చేయించుకోవాలి. 40 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా సీరమ్ క్రియాటినైన్ టెస్టు చేయించుకోవాలి. వృద్ధులు, బీపీ సమస్య ఉన్న వారికి ఈ టెస్టు తప్పనిసరి.
హెచ్‌బీఏ1సీ
టెస్టుకు ముందు మూడు నెలల కాలంలో రక్తంలో సగటు చక్కెర స్థాయిలు ఏ మేరకు ఉన్నాయో హెచ్‌బీఏ1సీ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ టెస్టుతో డయాబెటిస్ ముప్పును ముందుగానే గుర్తించొచ్చు. తద్వారా కళ్లు, నాడీ సంబంధిత సమస్యలు దరిచేరకుండా జాగ్రత్త పడొచ్చు.
బీపీ పరీక్ష
ఆరోగ్యాన్ని దెబ్బతీసే సమస్యల్లో డయాబెటిస్‌తో పాటు అధిక రక్తపోటు ప్రధానమైనది. బీపీ నియంత్రణలో ఉంటే గుండె జబ్బులు, స్ట్రోక్, వాస్క్యులార్ డిమెన్షియా వంటి సమస్యలు దరిచేరవు. కాబట్టి, క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకుంటూ రక్తపోటు అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ టెస్టులను 40 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉంటే రోగం ముదరకముందే గుర్తించే అవకాశం ఉంటుందని వైద్యులు మరీ మరీ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
బీపీ ఏ మేరకు పెరిగితే హార్ట్ ఎటాక్ ముప్పు మొదలవుతుందంటే..
యాంటీబయాటిక్స్ మందులను కోర్సు పూర్తి కాకుండానే ఆపేస్తున్నారా? రిస్క్‌లో పడ్డట్టే..