Antibiotic course: యాంటీబయాటిక్స్ మందులను కోర్సు పూర్తి కాకుండానే ఆపేస్తున్నారా? రిస్క్‌లో పడ్డట్టే..
ABN , Publish Date - Oct 27 , 2025 | 01:46 PM
యాంటీబయాటిక్స్‌ను వైద్యులు సూచించినన్ని రోజుల మేర కచ్చితంగా వాడాలి. ఇంతకంటే తక్కువ సమయం పాటు వాడి మందులను పక్కన బెడితే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: యాంటీబయాటిక్స్‌తో మానవాళికి ఎంత మేలు జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మందుల వినియోగంతో ఎన్నో ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లను జయించగలుగుతున్నాము. అయితే, ఈ ఔషధాల విషయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఆరోగ్యం కాస్త మెరుగ్గా అనిపించగానే మందులు వేసుకోవడం మానేస్తారు. డాక్టర్ చెప్పినన్ని రోజుల పాటు యాంటీబయాటిక్స్ వేసుకోరు. ఇలా చేస్తే ప్రమాదాన్ని ఆహ్వానించినట్టు అవుతుందని నిపుణులు చెబుతున్నారు (Antibiotic Resistance).
యాంటీబయాటిక్స్‌ను ఏయే డోసేజీలో ఎంత కాలం పాటు వాడాలనే అంశాన్ని వైద్యులు ఇన్ఫెక్షన్‌ల స్థాయిని బట్టి నిర్ణయిస్తారు. ఇలాంటప్పుడు డాక్టర్లు సూచించిన సమయానికంటే ముందు మందులను ఆపేస్తే సూక్ష్మక్రిములు మళ్లీ బలం పుంజుకుని ఇన్ఫెక్షన్ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. అలా కాకుండా డాక్టర్ సూచించినన్ని రోజులూ యాంటీబయాటిక్స్‌ను వాడితే శరీరంలో నుంచి ఇన్‌ఫెక్షన్ పూర్తిగా తొలగిపోతుంది. ఈ మందులను తట్టుకునే శక్తి (యాంటీబయాటిక్ రెసిస్టెన్స్) బ్యాక్టీరియాలో అభివృద్ధి చెందకుండా ఉంటుంది.
డాక్టర్‌ల సూచనలను పాటించకుండా యాంటీబయాటిక్స్‌ను ఇష్టారీతిన వాడితే వ్యాధి కారక క్రిముల్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అభివృద్ధి చెందుతుంది. ఎలాంటి మందులను వాడినా తట్టుకుని శరీరంలో ఇన్‌ఫెక్షన్‌ను కలుగజేసే స్థాయికి బ్యాక్టీరియా శక్తిమంతమవుతాయి. అంతిమంగా ఈ రెసిస్టెన్స్ అంతటా వ్యాపించి ప్రజారోగ్య సమస్యగా మారే ప్రమాదం ఎక్కువవుతుంది.
ఇలాంటి సమస్యలేవీ రాకుండా ఉండాలంటే వైద్యుల సూచనల మేరకు పూర్తిస్థాయిలో యాంటీబయాటిక్స్‌ను వాడాలి. అతిగా ఈ ఔషధాలను వాడటం లేదా తక్కువ సమయానికే వీటి వాడకాన్ని ముగించడం వంటివి అస్సలు చేయకూడదని వైద్యులు మరీ మరీ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
కాంటాక్ట్ లేన్స్‌ను వాడతారా? ఈ పొరపాట్లతో చూపునకు ముప్పు
ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఈ తెల్లని ఫుడ్స్ జోలికి మాత్రం వెళ్లొద్దు!