Share News

BP-Heart Attack Risk: బీపీ ఏ మేరకు పెరిగితే హార్ట్ ఎటాక్ ముప్పు మొదలవుతుందంటే..

ABN , Publish Date - Nov 03 , 2025 | 10:57 AM

హార్ట్‌ఎటాక్‌కు దారి తీసే అధిక రక్తపోటు విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీపీ ఓ లిమిట్‌ను దాటితే హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుందని చెబుతున్నారు. మరి ఈ లిమిట్ ఏంటంటే..

BP-Heart Attack Risk: బీపీ ఏ మేరకు పెరిగితే హార్ట్ ఎటాక్ ముప్పు మొదలవుతుందంటే..
High BP - Heart Attack Risk

ఇంటర్నెట్ డెస్క్: అధిక రక్తపోటుతో గుండె పోటు ముప్పు ఉందన్న విషయం దాదాపుగా అందరికీ తెలుసు. బీపీ ఓ లిమిట్ దాటితే మాత్రం ముప్పు మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. గుండె పోటు కేసులు పెరుగుతున్న నేటి జమానాలో అధిక రక్తపోటు గురించి కొన్ని ముఖ్య విషయాల గురించి ప్రతి ఒక్కరికీ తెలిసుండాలని చెబుతున్నారు (Hypertension).

రక్తసరఫరా నిలిచిపోయినప్పుడు గుండె పోటు వస్తుంది. రక్త సరఫరా లేక గుండె కణజాలం మృతి చెందుతుంది. గుండె పోటుకు ప్రధాన కారణాల్లో అధిక రక్తపోటు ఒకటి. బీపీ పెరిగినప్పుడు హార్ట్ ఎటాక్ ముప్పు కూడా అదే స్థాయిలో పెరుగుతుంది (High BP - Heart Attack Risk).


రక్తపోటు పెరిగినప్పుడు రక్తనాళాల గోడలపై ఒత్తిడి పెరిగి అవి పాడవుతాయి. ఇలాంటి సందర్భాల్లో రక్త సరఫరాకు ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా గుండె కండరాలకు ఆక్సిజన్, పోషకాలు పూర్తిస్థాయిలో అందవు. దీంతో గుండె కణజాలం మృతి చెంది హార్ట్ ఎటాక్ (Heart Attack) వస్తుంది. నిపుణులు చెప్పే దాని ప్రకారం, 120/80 రక్తపోటును సాధారణ స్థాయిగా పరిగణిస్తారు.

సిస్టోలిక్ ఒత్తిడి 139కి డయాస్టోలిక్ రీడింగ్ 89కి చేరిందంటే ప్రీ హైపర్ టెన్షన్‌గా భావించాలి. అంటే.. ఇది అధికరక్తపోటుకు ముందు దశ అన్నమాట. సిస్టోలిక్ బీపీ 140-159 మధ్య, డయాస్టోలిక్ బీపీ 90-99 మధ్య ఉంటే మొదటి దశ హైపర్ టెన్షన్‌గా, 160/100 లేదా ఆపైన ఉంటే రెండో దశ హైపర్ టెన్షన్‌గా భావిస్తారు. నిపుణులు చెప్పేదాని ప్రకారం, సాధారణ రక్తపోటు స్థాయి కంటే బీపీ కాస్త ఎగుడుదిగుడు అయినా పెద్ద ప్రమాదం ఉండదు. కానీ 140/90 స్థాయిని దాటుతోందంటే హార్ట్ ఎటాక్ ముప్పు ఎదుర్కోవాల్సి ఉంటుంది.


ఇక బీపీ ఉన్న వాళ్లు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఛాతిలో నొప్పి లేదా మండుతున్నట్టు ఉండటం, వీపులో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రెండు చేతుల్లో నొప్పులు, అతిగా చెమటలు పట్టడం, కడుపులో తిప్పినట్టు ఉండటం వంటివి ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. బీపీ నియంత్రణకు ఔషధాలతో పాటు జీవన శైలిలో మార్పులు చేసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. మంచి ఆరోగ్యంతో సంపూర్ణ ఆయుర్దాయాన్ని ఆస్వాదించొచ్చు.


ఇవి కూడా చదవండి

యాంటీబయాటిక్స్ మందులను కోర్సు పూర్తి కాకుండానే ఆపేస్తున్నారా? రిస్క్‌లో పడ్డట్టే..

కాంటాక్ట్ లేన్స్‌ను వాడతారా? ఈ పొరపాట్లతో చూపునకు ముప్పు

Read Latest and Health News

Updated Date - Nov 03 , 2025 | 11:53 AM