Share News

మధుమేహ ఔషధం

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:51 PM

అమెరికా ఈ ప్రపంచానికి ఇచ్చిన ద్రవ్యాల్లో మొక్కజొన్న, మిరపకారం, బొప్పాయి, జామ వంటి పండ్లతో పాటు టమాటా, పొటాటో వంటి శాకాలున్నాయి.

మధుమేహ ఔషధం

అమెరికా ఈ ప్రపంచానికి ఇచ్చిన ద్రవ్యాల్లో మొక్కజొన్న, మిరపకారం, బొప్పాయి, జామ వంటి పండ్లతో పాటు టమాటా, పొటాటో వంటి శాకాలున్నాయి.

ఇటలీ వాడైన క్రిస్టోఫర్‌ కొలంబస్‌ విజయనగర సామ్రాజ్య వైభవం గురించి విని, స్పెయిన్‌ రాజుగారి వాణిజ్య ప్రయోజనాల కోసం భారతదేశానికి బయల్దేరి, దారి తప్పి అమెరికా చేరిన తరువాత, స్పెయిన్‌ వాళ్లు ఆ ఖండాన్ని గాలించి ఈ ద్రవ్యాలతో పాటు పొగాకుని కూడా కనుగొని, ప్రపంచమంతటికీ వ్యాప్తి చేశారు. కృష్ణదేవరాయలకు సమకాలికుడైన కొలంబస్‌ ప్రయాణం ప్రపంచ ఆహార చరిత్ర దిశనే మార్చింది.

అమెరికాలో ఉల్లిపాయ రంగులో ఉండే ‘సస్టాబెక్రీ జామ’ను 17వ శతాబ్దంలో మెక్సికో నుంచి డచ్‌ వాళ్లు మొదట మలేసియాకి తెచ్చి సాగు చేయిస్తే, అది లేత పసుపు రంగులో పండింది. మలయాభాషలో దాన్ని ‘జంబూ బటూ’ అన్నారు. ఆ తరువాత వాళ్లు పాలకొల్లు వంటి తెలుగు ప్రాంతాల్లో రైతుల ద్వారా సాగుచేయించారు. ‘జంబూ బటూ’ కాలక్రమంలో తెలుగులో ‘జామ’య్యింది.


నిమ్మ, నారింజలాంటి పుల్లని పండ్లలోనే సాధారణంగా ‘సి’ విటమిన్‌ ఎక్కువగా ఉంటుందని, పుల్లగా ఉంటేనే ‘సి’ విటమిన్‌ ఉన్నట్టనీ అనుకుంటాం. కానీ, 100 గ్రాముల జామపండులో సుమారు 80 మి.గ్రా. విటమిన్‌ ‘సి’ ఉంటుంది. ఇది నిమ్మకంటే ఎక్కువ. ఎర్రని గుజ్జు ఉండే జామపండులో ‘ఏ’ విటమిన్‌ అధికం. సూక్ష్మజీవుల్ని నాశనం చేసే ఫ్లేవ నాయిడ్స్‌ కూడా జామలో అధికం. పొటాషియం, రాగి, మ్యాంగనీస్‌ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. తక్కువ క్యాలరీలు కలిగిన జామ, మధుమేహం కలవారు, స్థూలకాయులు తప్పక తినదగినది. యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల విషదోషాలు హరించడంలో సాయపడుతుంది.


పేగులలోని కండరాలను రిలాక్స్‌ చేసేగుణం జామకుంది. పీచు పదార్థం (డైటరీ ఫైబర్‌) ఎక్కువగా ఉండటం వల్ల విరేచనం బాగా జరిగి, కడుపునొప్పి తగ్గుతుంది. రోజూ ఒక కప్పు జామ జ్యూస్‌ తాగితే పేగులు బలసంప న్నమవుతాయి. విరేచనం సాఫీగా జరుగుతుంది.

జామపండు జ్యూస్‌ తీసి, వాముపొడి కలిపి తాగితే రుచికరంగా ఉండటమే కాక జీర్ణశక్తిని పెంచుతుంది. జామ గుజ్జులో వాముపొడి కలిపి ఎండించి మురబ్బా తయారు చేస్తారు. ఆకలిని పెంచడంలో, జీర్ణశక్తిని కాపాడటంలో దీనికి మించిన ఔషధం లేదు. జామ్‌, జెల్లీలు, క్యాండీల తయారీకి జామపళ్ళు అధికంగా తరలిపోవటాన మార్కెట్లో ఇవి ఖరీదైన పండ్లయ్యాయి.


book8.2.jpgజామపండు ఎంత ప్రముఖమైనదో జామా కులకూ అంత ఔషధ ప్రయోజనాలున్నాయి. జామాకులు శుభ్రం చేసి, ఎండించి, మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరచుకోండి. గ్లాసు నీళ్ళలో చెంచాడు పొడిని కలిపి మరిగించి తాగితే నీళ్ల విరేచనాలు, రక్తవిరేచనాలు వాం తులు, వికారం, గొంతు పుండ్లు, జీర్ణకోశ వ్యాధులు, తల తిరుగుడు (వెర్టిగో) వీటన్నిం టినీ తగ్గిస్తుంది. గ్యాస్ట్రిటిస్‌, పేగుపూత, నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి తగ్గుతాయి.


పళ్ల నుంచి రక్తం కారటం ఆగుతుంది. జామాకుల పొడితో పళ్లు తోముకోవచ్చు. తమలపాకు, లేత జామాకు కలిపితింటే జీర్ణకోశాన్ని బలపరుస్తుంది. జామాకుల కషాయంతో పుళ్ళు కడుగుతారు. యాంటీ సెప్టిక్‌ గుణాలున్నాయి వీటికి. కిడ్నీని బలసంపన్నం చేస్తాయి.

షుగరు వ్యాధి అదుపులో జామాకుల ప్రయోజనం గురించి విశేషమైన పరిశోధనలు సాగుతున్నాయి. మెదడు వ్యాధులు, రక్తపోటు, రక్తంలో చక్కెర, రక్తస్రావం, గుండె జబ్బులు, దగ్గు జలుబు, ఆయాసాన్ని, కఫాన్ని తగ్గించే గుణం ఉంది కాబట్టి జామాకులను సద్వి నియోగం చేసుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే మధుమేహానికి పరంధామ జామ.

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


ఈ వార్తలు కూడా చదవండి:

‘నేనే రాజు.. నేనే మంత్రి..’ అదే నిజమా..!

గుమ్మడి నర్సయ్యకు గౌరవ డాక్టరేట్‌

Read Latest Telangana News and National News

Updated Date - Feb 15 , 2026 | 12:53 PM