‘నేనే రాజు.. నేనే మంత్రి..’ అదే నిజమా..!
ABN , Publish Date - Feb 15 , 2026 | 02:09 AM
‘ఓరి పొట్టోడా! నీకు ఉంటుందీ’... అని రాజకీయ ప్రత్యర్థులు చులకనగా మాట్లాడితే మాట్లాడి ఉండవచ్చుగాక! ‘నేను పొట్టివాడిని అయితే అయి ఉండవచ్చునుగానీ గట్టివాడిని’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన...
‘ఓరి పొట్టోడా! నీకు ఉంటుందీ’... అని రాజకీయ ప్రత్యర్థులు చులకనగా మాట్లాడితే మాట్లాడి ఉండవచ్చుగాక! ‘నేను పొట్టివాడిని అయితే అయి ఉండవచ్చునుగానీ గట్టివాడిని’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన నాయకత్వంలో జరుగుతున్న ప్రతి ఎన్నికలో రుజువు చేసుకుంటున్నారు. తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లోనూ తన సత్తా చాటుకుంది కాంగ్రెస్ పార్టీ. స్థానిక ఎన్నికలు ఎక్కడ జరిగినా అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడం సహజం! సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రామాణికం కాదు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, వైసీపీలు ఘన విజయం సాధించాయి. రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, తెలుగుదేశం కోలుకుంటాయా? అన్న సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు వెలిబుచ్చారు. కాలం గిర్రున తిరిగి సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు చతికిలపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వెల్లడైన మునిసిపల్ ఎన్నికల ఫలితాలు మూడేళ్ల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రతిఫలిస్తాయని భావించలేం! అయితే అదే సమయంలో ఈ ఫలితాలను తేలికగా తీసిపారేయకూడదు. ‘అధికారంలో ఉండి కూడా 90శాతం స్థానాలను గెలుచుకోలేకపోతే అదొక గెలుపా?’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేలికగా తీసిపారేసి ఉండవచ్చును గానీ, కాంగ్రెస్ గెలుపునకు ప్రాధాన్యం ఉంది. ఐదేళ్ల క్రితం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్‌ఎస్ అధికారంలో ఉంది. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏడాది తర్వాత మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. అయినా బీఆర్‌ఎస్ 90శాతం స్థానాలను గెలుచుకోలేదు. మొత్తం 120 మునిసిపాలిటీలకుగాను 81 బీఆర్‌ఎస్ గెలుచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 116 మునిసిపాలిటీలకుగాను 74 మునిసిపాలిటీలను కైవసం చేసుకుంది. అప్పట్లో ఏడాది తర్వాత ఎన్నికలు జరగగా, ఇప్పుడు రెండేళ్ల తర్వాత జరగడం విశేషం. ప్రభుత్వాలు ఏర్పడిన రెండున్నరేళ్ల తర్వాత జరిగే స్థానిక ఎన్నికలు, ఉపఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత ఉంటే అది ప్రతిబింబిస్తుంది. ప్రథమార్ధంలో పాలకపక్షానికి ఉండే అనుకూలతలు క్రమంగా కరిగిపోతూ ఉంటాయి. ఈ కారణంగానే అనేక సందర్భాలలో ద్వితీయార్ధంలో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో తాజా మునిసిపల్ ఎన్నికలను చూడాలి.
పట్టు నిలుపుకొంటూ...
రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వ్యాపించిన తరుణంలో ఈ మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వంపై కొంత కాలంగా విరుచుకుపడుతోంది. రేవంత్‌రెడ్డి సర్కార్ పనైపోయినట్టేనని ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ నాయకులు అది నిజమని కూడా నమ్ముతున్నారు. ఈ ప్రచారానికి తోడు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినందున మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై సందేహాలు నెలకొన్నాయి. అయితే రాజకీయ పండితుల అంచనాకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించింది. కేటీఆర్ వంటి వారి కంటికి ఈ ఫలితాలు ఆనకపోయి ఉండవచ్చుగానీ, కాంగ్రెస్ వంటి పార్టీ ఈ స్థాయి ఫలితాలు సాధించడం విశేషం. కాంగ్రెస్ అంటేనే అసమ్మతి గుర్తుకు వస్తుంది. ఆ పార్టీలో ఎవరికి వారే ముఖ్యమంత్రి స్థాయి నాయకులమని భావిస్తారు. ఏక నాయకత్వాన్ని అంగీకరించరు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే తీసుకుందాం! కాంగ్రెస్ పార్టీలో ఆయన జూనియర్ అని పలువురు వ్యాఖ్యానించడాన్ని చూస్తున్నాం. కాంగ్రెస్‌లో సీనియర్లం అని భావిస్తున్న వాళ్లు రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని బేషరతుగా అంగీకరిస్తున్నారని చెప్పలేని పరిస్థితి. లాటరీ తగిలినట్టు రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కిందని భావిస్తున్నారుగానీ ఆయనలో నాయకత్వ పటిమ ఉందని అంగీకరించే స్థితిలో వారు లేరు. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కనిపిస్తోంది. అయితే, రేవంత్‌రెడ్డి మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ పార్టీలో, ప్రభుత్వంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ వస్తున్నారు. పార్టీపై తనకు పట్టు లేదన్న అభిప్రాయాలను మనసుకు తీసుకోకుండా సందర్భం వచ్చినప్పుడు మాత్రం తనకున్న పట్టు ఏమిటో నిరూపించుకుంటున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో మంత్రులందరికీ జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించి సమన్వయం చేసుకొని సత్ఫలితాలను సాధించారు. కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని పలువురు భావిస్తున్న వేళ... అందులో నిజం లేదని రుజువు చేస్తూ వస్తున్నారు.
ఉత్తర దక్షిణాల్లో ‘హస్త’వాసి
ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అన్న తేడా లేకుండా దాదాపు అన్ని జిల్లాల్లోనూ మంచి ఫలితాలను సాధించేలా రేవంత్‌రెడ్డి వ్యూహ రచన చేశారు. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్ బలంగా ఉన్నాయన్న అభిప్రాయం ఇప్పటిదాకా ఉండింది. అయితే, మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ఈ అంచనాలను పటాపంచలు చేశాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో బీఆర్‌ఎస్ బలంగా ఉన్నట్టు కనిపించేది. ఈ ఎన్నికల ఫలితాలతో అందులో కూడా నిజం లేదని తేలిపోయింది. బీఆర్‌ఎస్ ఉమ్మడి మెదక్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోనే ప్రభావం చూపగలిగింది. ‘తెలంగాణలో నేనే రాజు – నేనే మంత్రి’ అని రేవంత్‌రెడ్డి ప్రకటించిన రెండో రోజే వెలువడిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి మాటల్లో నిజం లేకపోలేదన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. తనకంటే ఎంతో మంది సీనియర్లున్న కాంగ్రెస్‌ను ఏక తాటిపై నడిపించడంలోనూ రేవంత్‌రెడ్డి కృతకృత్యులయ్యారు. కాంగ్రెస్ సీనియర్లు కూడా తన నాయకత్వాన్ని అంగీకరించక తప్పని పరిస్థితిని కల్పిస్తూ వస్తున్నారు. రాజకీయాల్లో పార్టీలకైనా, నాయకులకైనా ఎన్నికల ఫలితాలే గీటురాయి. మొన్న పంచాయతీ ఎన్నికలు, నిన్న మునిసిపల్ ఎన్నికల్లో 60 శాతంపైగా స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా తన నాయకత్వ విషయంలో ఎదురవుతున్న ఆటంకాలను ఆయన అధిగమిస్తూ వచ్చారు. ఈ ఫలితాలతో పాటు తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ముఖ్యమంత్రిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నట్టుగా ఉంది.
కాంగ్రెస్‌లో కొత్త లెక్క...
2029లో జరిగే ఎన్నికల తర్వాత కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని... పదిన్నరేళ్లు సీఎంగా పనిచేసి రికార్డు సృష్టిస్తానని రేవంత్‌రెడ్డి తాజాగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి ఇలాంటి ప్రకటనలు విరుద్ధం. అధిష్ఠానం ఎవరిని నిర్ణయిస్తే వారే ముఖ్యమంత్రి అని ప్రకటించడం కాంగ్రెస్ ఆనవాయితీ. దీనికి భిన్నంగా, గతంలో ఏ కాంగ్రెస్ నాయకుడూ సాహసించని విధంగా వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే ముఖ్యమంత్రి అని రేవంత్‌రెడ్డి ప్రకటించుకున్నారు. ఆయన చేసిన ఈ ప్రకటన కొంతమంది కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడకపోవచ్చుగానీ... మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో నిరసన వ్యక్తం చేయలేని అసహాయ స్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఒక్కరే బయటపడ్డారు. కాంగ్రెస్ రాజకీయాలను గమనించే వారికి మాత్రం రేవంత్‌రెడ్డి తాజా వ్యాఖ్యలు ఆశ్చర్యపరచక మానవు. ‘‘ఆయన తెలంగాణకు మాత్రమే నేనే రాజు – నేనే మంత్రి అన్నట్టుగా లేదు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయనే రాజు ఆయనే మంత్రి అన్నట్టుగా ఉంది’’ అని ఒక ప్రముఖుడు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో రేవంత్‌రెడ్డిది దూకుడు స్వభావం. ఆ దూకుడే ఆయనకు ఇప్పటివరకూ కలసి వచ్చింది. పిన్న వయసులోనే ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే ఇల్లు అలకగానే పండుగ కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినంత మాత్రాన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని భావించడానికి లేదు. ఈ ఫలితాలు ప్రభుత్వంలో, పార్టీలో రేవంత్‌రెడ్డి స్థానం మరింత పటిష్ఠమవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకో మూడేళ్ల వ్యవధి ఉంది. 2029లో జమిలి ఎన్నికలు వస్తాయని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అది నిజమైతే బీఆర్‌ఎస్‌కు మైనస్ అవుతుంది. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోగలిగితే పదేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా ఉండాలన్న తన లక్ష్యాన్ని రేవంత్‌రెడ్డి నెరవేర్చుకోవచ్చు.
దిద్దుబాట పట్టాలి...
మునిసిపల్ ఎన్నికల ఫలితాలను పక్కనపెట్టి నిష్పాక్షికంగా గమనిస్తే ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన విరుగుడు చర్యలు అనేకం ఉన్నాయి. ముందుగా ప్రభుత్వంలో సమన్వయం, జవాబుదారీతనం పెంపొందించాలి. అదే సమయంలో ప్రభుత్వంలో వివిధ స్థాయిల్లో అవినీతి పెచ్చరిల్లుతోంది. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని తగ్గించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. మంత్రుల తీరు కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటోంది. ఈ అంశంపై కూడా ముఖ్యమంత్రి దృష్టి సారించాలి. తెలుగు ప్రజలు చాలా కాలంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడికి అలవాటుపడి ఉన్నారు. ఈ కారణంగానే బహు నాయకత్వం వింతగా కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనను ప్రజలు చూశారు. అప్పుడు అధికారం అంతా ఆయన చుట్టూనే కేంద్రీకృతం అయి ఉండేది. ప్రభుత్వం అంటే కేసీఆర్ – కేసీఆర్ అంటే ప్రభుత్వం అన్న అభిప్రాయం ఏర్పడింది. అది వాంఛనీయమా? కాదా? అన్నది పక్కనపెడితే, అదుపులేని స్వేచ్ఛ కూడా మంచిది కాదు. ఏ ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్ అన్నట్టుగా ఉండాలి. ఇప్పుడు తెలంగాణలో అటువంటి అభిప్రాయం లేదు. కొంతమంది మంత్రులు సమాంతర వ్యవస్థలను నడుపుతున్నారన్న అభిప్రాయం ఉంది. మంత్రులకు వారి శాఖల విషయంలో స్వేచ్ఛ ఉండాలిగానీ, అది అపరిమితం కాకూడదు. ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకోలేనంత స్వేచ్ఛ మంత్రులకు వాంఛనీయం కాదు. మంత్రులెవరైనా ముఖ్యమంత్రి అధికారానికి లోబడే పనిచేయాలి. ఇలాంటి లోపాలను సరిదిద్దుకోగలిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా రేవంత్‌రెడ్డి నాయత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు. అయితే రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. ఒక్క సంఘటన చాలు రాజకీయ సమీకరణాలను మార్చివేయడానికి!

ప్రతిపక్షాల పరిస్థితి ఇదీ...
ఇప్పుడు భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల విషయానికి వద్దాం! రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కేసీఆర్‌కు ఇంకా మంచి రోజులు వచ్చినట్టు లేవు. రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం తమదే అని బీఆర్‌ఎస్ నాయకులు తలపోస్తూ వచ్చారు. ఈ భావన బలపడి, ఆ పార్టీకి చెందిన కేటీఆర్, హరీశ్‌రావు వంటి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇటీవలి కాలంలో ఆత్మవిశ్వాసం కాస్తా అతివిశ్వాసంగా మారింది. నిజానికి రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ చెప్పుకోదగిన ఫలితాలను సాధించలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటే తమకు లెక్కలేదని చెప్పడానికే బీఆర్‌ఎస్ నాయకులు ప్రయత్నించారు తప్ప తమకు దూరమైన ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేయలేదు. కేసీఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణను టచ్ చేసినట్టేనని భ్రమిస్తూ కాలం గడుపుతున్నారు. కేసీఆర్‌ను కాళేశ్వరం, టెలిఫోన్ ట్యాపింగ్ కేసులలో విచారణకు పిలిపించడం జరిగింది. కేసీఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణను టచ్ చేసినట్టే... అనే మాటలే నిజమైతే ఈ విచారణ తర్వాత ప్రజల్లో ఆయనపై సానుభూతి పెల్లుబికి మునిసిపల్ ఎన్నికల్లో ఎంతో కొంత అది ప్రతిఫలించాలి కదా? అదేమీ జరగలేదు! ఉమ్మడి మెదక్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలు లేకపోతే బీఆర్‌ఎస్ పరిస్థితి మరీ అన్యాయంగా ఉండేది. హరీశ్‌రావు పుణ్యమా అని ఉమ్మడి మెదక్ జిల్లాలో కొన్ని మునిసిపాలిటీలను గెలుచుకోగలిగారు. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉండటంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించి ఉండటం వంటి కారణాల వల్ల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. ఫలితంగా ఈ జిల్లాలో కొన్ని మునిసిపాలిటీలను బీఆర్‌ఎస్ గెలుచుకోగలిగింది. ఉద్యమ సమయంలో బలంగా కనిపించిన నిజామాబాద్ వంటి జిల్లాలో బీఆర్‌ఎస్ నానాటికీ బలహీనపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీఆర్‌ఎస్ నాయకులు తక్షణం ఆత్మవిమర్శ చేసుకొని విరుగుడు చర్యలు తీసుకోని పక్షంలో పార్టీ మనుగడకే ముప్పు రావొచ్చు. మునిసిపాలిటీలతో పోల్చితే నగరపాలక సంస్థల్లో బీఆర్‌ఎస్ పనితీరు మరీ పేలవంగా ఉంది. పట్టణాల్లో బీజేపీ, గ్రామాల్లో కాంగ్రెస్ మరింతగా బలపడితే బీఆర్‌ఎస్ పరిస్థితి ఏమిటి? పట్టణ ప్రాంత ప్రజల్లో కేసీఆర్ కుటుంబంపై ఏర్పడిన వ్యతిరేకత ఇంకా తొలగిపోలేదా? అన్న అనుమానం కలుగుతోంది. కేవలం అహంకారం కారణంగానే గత ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారని ఆయన కుమార్తె కవిత రెండు రోజుల క్రితం విమర్శించారు. అధికారం తలకెక్కి అహంకారంతో వ్యవహరిస్తూ, ప్రశ్నించిన వారిపై కత్తి దూశారని కవిత చేసిన విమర్శలను తేలికగా తీసుకోవడానికి లేదు. బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్న కవితను కూడా వారు ఇప్పుడు తెలంగాణ ద్రోహి అంటారేమో తెలియదు. మునిసిపల్ ఎన్నికల్లో తమకు ఓటు వేయని ప్రజలను కూడా తెలంగాణ ద్రోహులు అని నిందిస్తారా? ఆత్మవంచన, పరనింద ఎల్లకాలం చెల్లుబాటుకావని బీఆర్‌ఎస్ నాయకులు గ్రహించాలి. తెలంగాణను పాలించమని ప్రజలు అధికారం ఇస్తే... ఏకంగా దేశాన్ని ఏలాలని కలలు కని, తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చుకొని, చేతిలో ఉన్న డబ్బును కేసీఆర్ పోగొట్టుకోగా, సోషల్ మీడియాను మాత్రమే నమ్ముకొని కేటీఆర్ కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. తాను ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియాలో పనిచేసేవారు పెడుతున్న వీడియోలు, పోస్టులు చూసుకుంటూ అదే నిజమని నమ్ముతూ కేటీఆర్ భ్రమల్లో బతుకుతున్నారు. తమ లోపాలను ఎత్తిచూపే వారిని తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేస్తూ ఆత్మవంచనకు పాల్పడుతూ కాలక్షేపం చేస్తే ప్రయోజనం ఉండదు. రక్తం పంచుకుపుట్టిన కవిత మాటలనైనా కేసీఆర్ సీరియస్‌గా తీసుకుంటే ఆయనకే మంచిది. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించినందుకుగాను కేసీఆర్ కుటుంబాన్ని తొమ్మిదిన్నరేళ్లపాటు తెలంగాణ సమాజం ఆదరించి అధికారం కట్టబెట్టింది. అధికారంతోపాటు వచ్చిన సంపద అదనం! తెలంగాణ తెచ్చినందుకు ఇంకేమి చేయాలి? దేశానికి స్వాతంత్య్ర సాధనలో నాయకత్వం వహించిన మహాత్మాగాంధీ కుటుంబానికి దేశం ఏమిచ్చింది? స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్వదేశీ శక్తుల చేతిలో ప్రాణాలు వదిలిన గాంధీ కుటుంబీకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? తనదైన పంథాలో స్వాతంత్య్ర పోరాటం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఆ కుటుంబాల పరిస్థితి చూస్తే కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ సమాజం చాలా ఎక్కువే చేసింది. రుణం తీర్చుకుంది. ఇప్పటికైనా కేసీఆర్ కుటుంబం నేల మీదకు దిగివస్తే వారికే మంచిది. లేని పక్షంలో ఇలాంటి ఎన్నికల ఫలితాలే వస్తూ ఉంటాయి. పార్టీ పరిస్థితి మరింత దిగజారినా ఆశ్చర్యపోవాల్సింది లేదు.
బీజేపీ: బలపడే అవకాశమున్నా!
ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విషయానికి వద్దాం! తెలంగాణలో మరింతగా బలపడే అవకాశం ఉన్నప్పటికీ, కారణం తెలియదుగానీ ఆ పార్టీ అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో తెలంగాణలో ఆ పార్టీ మరింత బలపడి ఉండాల్సింది. అలా ఎందుకు జరగడం లేదో ఆత్మపరిశీలన చేసుకోవాలి. బీఆర్‌ఎస్ నాయకులు ఒక దశలో తమ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి లేదా పొత్తు పెట్టుకోవడానికి ప్రతిపాదించారు. అయినా ఆ ప్రతిపాదనలను బీజేపీ అగ్ర నాయకత్వం తిరస్కరించింది. తెలంగాణలో సొంతంగానే అధికారంలోకి రావాలన్నది ఆ పార్టీ అధినాయకత్వం ఆకాంక్ష. అలాంటప్పుడు అందుకు తగిన వ్యూహాలను రూపొందించుకోవాలి కదా? బలమైన నాయకులను ప్రోత్సహించినప్పుడే తెలంగాణలో బలపడగలమని బీజేపీ అగ్ర నాయకత్వం గుర్తించాలి. కరీంనగర్, నిజామాబాద్ నగర పాలక సంస్థల్లో బలంగా ప్రభావం చూపగలిగారంటే అక్కడ బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి వారు ఉండటమే కారణం. గట్టి నాయకులు ఉన్నచోట బీజేపీ ప్రభావం చూపగలుగుతోంది. 2029లో జమిలి ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. అదే జరిగితే... బీజేపీకి అనుకూలించే అంశం అవుతుంది. జమిలి ఎన్నికల వల్ల జాతీయ పార్టీలకు అదనపు ప్రయోజనం ఉంటుంది. తెలంగాణ ప్రజల్లో కూడా ప్రధాని మోదీకి మంచి ఆదరణ ఉంది. ఈ కారణంగానే గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎనిమిది సీట్లు లభించాయి. 2029లో నిజంగానే జమిలి ఎన్నికలు వస్తే జాతీయ రాజకీయాల ప్రభావంతో శాసనసభ ఎన్నికల్లో కూడా బీజేపీ లాభపడవచ్చు. అయితే ఇప్పటినుంచే అందుకు తగిన వ్యూహరచన చేసుకోవాలి. జమిలి ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌కు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. లోక్‌సభ ఎన్నికలు కూడా ఉంటాయి కనుక ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల మీద కూడా పడి బీఆర్‌ఎస్ నష్టపోవచ్చు. ఇప్పుడు వెలువడిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా తెలంగాణ రాజకీయాలు ఉంటాయని మాత్రం చెప్పవచ్చు. కేసీఆర్ అండ్ కో ఈ ముప్పును ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి. కారణం తెలియదుగానీ కేసీఆర్ కుటుంబంపై బీజేపీ అగ్ర నాయకత్వానికి సదభిప్రాయం లేదు. ఈ కారణంగానే పొత్తు పెట్టుకుందామని బీఆర్‌ఎస్ నాయకులు స్వయంగా ప్రతిపాదించినా ‘కుదరదు’ అని బీజేపీ అగ్ర నాయకత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి తాను నిలదొక్కుకొని పార్టీని పటిష్ఠం చేయడానికి కేసీఆర్ ఎటువంటి వ్యూహాలు రచించుకుంటారో వేచిచూడాలి. కోల్పోయిన ప్రజాభిమానం చూరగొనే ప్రయత్నం చేయకుండా తెలంగాణ సెంటిమెంటును మాత్రమే కేసీఆర్ అండ్ కో ఇంకా నమ్ముకుంటూ కాలక్షేపం చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. తెలుసుకోవలసింది కేసీఆర్ అండ్ కో మాత్రమే!
ఆర్కే
ఈ వార్తలు కూడా చదవండి:
ఆస్పత్రి నుంచి మహిళ అదృశ్యం.. వారం రోజులు గడిచినప్పటికీ
దారుణం.. బావను చంపేసిన బామ్మర్దులు..