ఆస్పత్రి నుంచి మహిళ అదృశ్యం.. వారం రోజులు గడిచినప్పటికీ
ABN , Publish Date - Feb 14 , 2026 | 04:09 PM
కంటి ఆపరేషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళ కనిపించకుండా పోయింది. అనంతమ్మ అనే మహిళ ఆస్పత్రి నుంచి అదృశ్యమైంది. వారం రోజులైనా కూడా ఆమె ఆచూకీ ఇంకా లభించలేదు.
హైదరాబాద్, ఫిబ్రవరి 14: హైదరాబాద్‌లోని బాచుపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి మహిళ అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం, కిష్టాపూర్ గ్రామానికి చెందిన పల్లె అనంతమ్మ (56) గత వారం రోజుల క్రితం ఈ హాస్పిటల్ నుంచి కనిపించకుండా పోయింది. ఇప్పటి వరకు ఆమె ఆచూకీ లభించలేదు. జనవరి 29న కిష్టాపూర్ గ్రామంలో సదరు హాస్పిటల్ సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించారు.
ఉచిత చికిత్స పేరుతో జనవరి 30న కంటి ఆపరేషన్ కోసం గ్రామస్తులను బస్సులో బాచుపల్లి హాస్పిటల్‌కు తరలించారు. కిష్టాపూర్ నుంచి 10 నుండి 15 మంది వెళ్లగా.. అంతా తిరిగి వచ్చారు. కానీ అనంతమ్మ మాత్రం తిరిగి రాలేదు. హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనలో ఈ నెల 5వ తేదీన అనంతమ్మ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్లినట్లు తెలిసింది. హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే.. ఆమె బయటకు వెళ్లి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
అయితే వారం రోజులు గడిచినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మా అమ్మ మాకు కావాలి’ అంటూ హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ‘మా అమ్మను ఎలా తీసుకొచ్చారో అలాగే అప్పగించాలి’ అని అనంతమ్మ కొడుకు డిమాండ్ చేస్తున్నాడు. మహిళ ఆచూకీ లభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేట్టారు.
ఇవి కూడా చదవండి..
మున్సిపల్ జోష్.. రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్..!
ఈ ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదు: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News