ఈ ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదు: కేటీఆర్
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:45 PM
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందించారు. 30 మున్సిపాలిటీలకు పైగా సులువుగా గెలుస్తామని అనుకున్నామని, కానీ కొంత తగ్గిందని అన్నారు..
హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎక్స్‌అఫీషియో ఓట్ల నమోదు విషయంలో సీఎస్, రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ 30 మున్సిపాలిటీలకు పైగా సులువుగా గెలుచుకుంటుందని అనుకున్నప్పటికీ, కొంత తగ్గిందని కేటీఆర్ అన్నారు. హంగ్ వచ్చిన ప్రాంతాల్లో కూడా పరిస్థితి తమకు అనుకూలంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదని ఆయన పేర్కొన్నారు.
కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో మినహాయించి బీజేపీ ప్రభావం ఎక్కడా అంతగా లేదని కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టే పొత్తులు ఉంటాయని తెలిపారు. ఈ ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫలితాలే దీనికి స్పష్టమైన ఉదాహరణ అని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నుంచి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గణనీయంగా మెరుగుపడిందని కేటీఆర్ తెలిపారు.
ఫార్ములా కేసులో ఏమీ లేదని ఏసీబీ అధికారులే చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఫార్ములా-ఈ, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు ఐదుసార్లు విచారణకు పిలిచారని, మళ్లీ పిలిస్తే వెళ్తానని చెప్పారు. ప్రభుత్వం అరెస్టు చేయాలనుకుంటే అరెస్ట్ అవుతానని ఆయన వ్యాఖ్యానించారు. సింగరేణి కార్మికులకు స్పష్టమైన సందేశం ఇవ్వాలనే ఆలోచనతోనే కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తామని చెప్పినట్లు కేటీఆర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్‌ఈసీ క్లారిటీ
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయంటే.?
Read Latest Telangana News And Telugu News