పదే పదే యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? జాగ్రత్త..
ABN , Publish Date - Feb 20 , 2026 | 03:10 PM
ఈ రోజుల్లో చిన్న అరోగ్య సమస్యకు కూడా యాంటీబయాటిక్స్ వాడే అలవాటు పెరుగుతోంది. తరచుగా వాడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు యాంటీబయాటిక్స్ తరచుగా వాడటం ప్రమాదకరం. పదే పదే యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఉపయోగించే మందులు. అయితే జలుబు, జ్వరం లేదా గొంతు నొప్పి వచ్చినప్పుడు కూడా వైద్యుల సలహా లేకుండా కొందరు ఈ మందులను వాడుతుంటారు. అలా చేయడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యు నిపుణులు చెబుతున్నారు.
యాంటీబయాటిక్స్ వల్ల ప్రేగులపై ప్రభావం
మన పేగుల్లో ట్రిలియన్ల కొద్దీ సూక్ష్మజీవులు నివసిస్తాయి. వీటిలో వేలాది రకాల మంచి బ్యాక్టీరియా(ప్రోబయోటిక్స్) ఉంటాయి. ఇవి ఆహారం జీర్ణయ్యేందుకు, శరీరానికి పోషకాలను అందించేందుకు, రోగనిరోధక శక్తి బలంగా ఉండటానికి సాయపడతాయి. అయితే.. పదే పదే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది. దీంతో మంచి, చెడు బ్యాక్టీరియా మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. ఈ పరిస్థితిని మైక్రోబయోమ్ అసమతుల్యత అంటారు. దీనివల్ల జీర్ణక్రియ సరిగా జరగదు, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీర్ఘకాలం యాంటీబయాటిక్స్ వాడితే శరీరం అవసరమైన పోషకాలను సరిగ్గా గ్రహించలేకపోతుంది. దీని వల్ల బలహీనత, తరచుగా అనారోగ్యం, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
లక్షణాలు..
యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు, గ్యాస్ సమస్య, ఉబ్బరం, వికారం, ఆకలి తగ్గడం, అలసట, తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తే పేగు ఆరోగ్యం దెబ్బతిన్నట్టు భావించవచ్చు.
జాగ్రత్తలు
వైద్యుడి సలహా మేరకే యాంటీబయాటిక్స్ వాడాలి.
పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్ ఆహారాలు తీసుకోవాలి.
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
ఎక్కువగా నీరు తాగాలి.
అవసరం లేకుండా మందులు వాడకూడదు.
పేగుల ఆరోగ్యం.. శరీరం మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. అందుకే యాంటీబయాటిక్స్‌ను అవసరమైనప్పుడు మాత్రమే, వైద్యుల సలహాతో వాడటం మంచిది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?
పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
అధిక బరువు సమస్యకు ఈ ఆహారంతో చెక్ పెట్టండి!
For More Latest News