Share News

డీక్యాఫ్‌ పానీయాలతో లాభం ఎంత?

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:28 AM

కాఫీ, టీ రెండూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఇష్టమైన పానీయాలు. వీటిల్లో ఉండే కెఫిన్‌ శరీరానికి శక్తిని అందించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. ఉత్సాహంగా పనిచేసుకోవడానికీ ఉపయోగపడుతుంది.

డీక్యాఫ్‌ పానీయాలతో లాభం ఎంత?

డీక్యాఫ్‌ కాఫీ, డీక్యాఫ్‌ టీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

- రచన, విశాఖపట్నం

కాఫీ, టీ రెండూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఇష్టమైన పానీయాలు. వీటిల్లో ఉండే కెఫిన్‌ శరీరానికి శక్తిని అందించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. ఉత్సాహంగా పనిచేసుకోవడానికీ ఉపయోగపడుతుంది. డీకాఫ్‌ కాఫీ, టీలలో ఈ కెఫిన్‌ అనే పదార్థం ఉండదు లేదా చాలా మితంగా ఉంటుంది. పాలు, ఎటువంటి తీపి పదార్థాలు చేర్చనటువంటి బ్లాక్‌ కాఫీ, బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణం ఉంటుంది. బ్లాక్‌ కాఫీ, గ్రీన్‌ టీ తాగడం వల్ల టైప్‌ 2 డయాబెటీస్‌, పార్కిన్సన్‌, అల్జిమర్స్‌ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. పాలు, చక్కెరతో కలిపి కాఫీ లేదా టీలు తాగినప్పుడు క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా చేరతాయి. ఎక్కువసార్లు తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది. డీక్యాఫ్‌ పానీయాల్లో కెఫిన్‌ తప్ప మిగిలిన అన్ని పదార్థాలు మామూలు కాఫీ, టీల లాగానే ఉంటాయి. కెఫిన్‌ లేకపోవడం వల్ల నిద్రకు ఇబ్బంది కలిగించే లక్షణం కూడా డీక్యాఫ్‌ పానీయాలకు ఉండదు. కాబట్టి నిద్రా సమయానికి రెండు మూడు గంటల ముందు తీసుకున్నా ఇబ్బంది ఉండదు.


పెరుగు, మజ్జిగతో పాటు ప్రోబయాటిక్స్‌ ఉన్న ఇతర ఆహార పదార్థాలు ఏవి? అసలు అలాంటివి ఉన్నాయా?

- మేఘ, హైదరాబాద్‌

book6.2.jpgమన శరీరం పైన, లోపల కొన్ని ట్రిలియన్ల (లక్షల కోట్లు) సూక్ష్మజీవులు ఉంటాయి. శరీరంలో ఉండే మంచి బ్యాక్టీరియా, కొన్ని రకాల ఈస్ట్‌లను ప్రోబయాటిక్స్‌ అంటారు. ఈ ప్రోబయా టిక్స్‌ మనం వివిధ రకాల ఆహార పదార్థాల నుంచి పొందవచ్చు. మంచి బ్యాక్టీరియా రోగనిరోధకతకు తోడ్పడుతూ ఆరోగ్యాన్ని కాపాడు తుంది. అంతే కాకుండా శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంలో మంచి బ్యాక్టీరియా సహాయపడ తాయి. అలాగే అనారోగ్యాన్ని కలిగించే చెడు బ్యాక్టీరియాను అదుపు చేస్తాయి, కొన్ని రకాల విటమిన్లను తయారు చేస్తాయి, మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా హానికారక సూక్ష్మజీవులు జీర్ణవ్యవస్థలోనికి ప్రవేశించకుండా రక్షణను అందిస్తాయి. లాక్టోబాసిలస్‌, బైఫెడో బ్యాక్టీ రియా అనే మంచి బ్యాక్టీరియా సక్కారోమైసెస్‌ బులార్డీ అనే ఈస్టులు ప్రోబయాటిక్‌ ఆహార పదార్థాలలో ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో తయారుచేసిన పెరుగు, మజ్జిగ, నిల్వ ఉంచే ఊరగాయ పచ్చళ్ళు మొదలైన పులియబెట్టిన ఆహారపదార్ధాలలో సాధారణంగా ఈ రకమైన సూక్ష్మజీవులు ఉంటాయి. షాపుల్లో మీసో, కొంబుచ, కిమ్చి మొద లైన జాపనీస్‌, కొరియన్‌ ప్రోబయాటిక్‌ ఆహారం కూడా లభిస్తున్నాయి. ఈ మధ్య సప్లిమెంట్ల రూపంలో కూడా ప్రోబయాటిక్స్‌ మార్కెట్లో లభిస్తున్నాయి.


ఎర్ర కంది పప్పు అందరూ తినవచ్చా? వీటిలో ఎటువంటి పోషకాలు ఉంటాయి?

- కాథరీన్‌, నెల్లూరు

కందిపప్పు, ఎర్ర కందిపప్పు (మసూర్‌ దాల్‌), శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు మొదలైనవన్నీ పప్పుధాన్యాలు. వీటినే లెంటిల్స్‌ అంటారు. ప్రతీ పప్పుకూ తనదైన ప్రత్యేక పోషక విలువలు ఉంటాయి. అనేక రకాల పోషకాలను పొందేందుకు పప్పు ధాన్యాలు చవకైన మార్గం. అధిక భాగం ప్రోటీన్లను కలిగి ఉండి, మాంసాహా రానికి చక్కని ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ఐరన్‌, జింక్‌, మెగ్నీషియం, పొటాషియం మొద లైన ఖనిజాలే కాక వివిధ రకాల బీ విటమిన్లు కూడా పప్పుల్లో అధికం. శక్తినిచ్చి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి అవసరమయ్యే కాంప్లెక్‌ కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థాలు కూడా పప్పుల్లో ఉంటాయి.


ప్రతిరోజూ పప్పు ధాన్యా లను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండెజబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది. 100 గ్రాముల ఉడికించిన పప్పుల్లో 110-120 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. రోజుకు 200 గ్రాముల వరకూ ఉడికించిన లేదా వండిన పప్పులను తీసుకోవచ్చు. పరిమిత మోతా దులో, ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా పప్పులు తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. శక్తినిచ్చే పిండి పదార్థాలు, ప్రొటీన్లు ఉండడం వల్ల అవసరానికి మించి లేదా ఎక్కువ నూనెతో వండిన పప్పులను తీసుకుంటే మాత్రం బరువు పెరిగే అవకాశం ఉంది. ఎర్ర కందిపప్పు మామూలు కంది పప్పు కన్నా త్వరగా ఉడుకుతుంది, తేలికగా అరుగుతుంది కూడా.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను sunday.aj@gmail.comకు పంపవచ్చు)


ఈ వార్తలు కూడా చదవండి.

ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

కుప్పానికి ప్రగతి కళ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 01 , 2026 | 11:28 AM