Body Heat: వేడి చేసిందా.. ఈ ఫుడ్స్ ట్రై చేయండి..
ABN , Publish Date - Jan 10 , 2026 | 03:14 PM
సాధారణంగా మన ఒంట్లో ఉండాల్సిన ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉంటే వేడి చేసిందని అంటారు. శరీరంలో వేడి అనేది వేరు వేరు కారణాల వల్ల పెరుతుంటుంది. అయితే..
మనకు బాగా వేడి (Body Heat) చేసినప్పుడు చికాకు, అధిక ఒత్తిడి, నీరసంగా అనిపిస్తుంటుంది. బాగా ఎండకు తిరిగినప్పుడు, అధికంగా స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు శరీరంలో వేడి ఉత్పన్నమవుతుంది. మనం తీసుకునే ఆహారం వల్ల కూడా శరీరంలో అధిక వేడి కలగొచ్చు. వేడి చేసిందని అనిపించనప్పుడు చాలా వరకు మిత ఆహారం తీసుకోవడం మంచిది. అంతేకాదు మసాలా ఫుడ్, కాఫీ, టీ మానివేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. అయితే, మరికొన్ని ఆహార పదార్థాలు శరీరంలో వేడిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
వేడి చేసినప్పుడు నీటి శాతం అధికంగా ఉండే పండ్లు ఎక్కువగా తీసుకుంటే చాలా వరకు శరీర వేడిని తగ్గించవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో దొరికే పుచ్చకాయ(Watermelon)లో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని తక్షణమే చల్లపరుస్తుంది.
కర్బూజ (Kharbuja) సీజనల్‌గా దొరికే పండు. ఇది దోస జాతికి చెందిన తీపి పండు. దీనిలో నీరు, విటమిన్లు, బీటాకెరోటిన్ అధికంగా ఉండటం వల్ల శరీరానికి చల్లదనాన్ని, శక్తిని ఇస్తుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
శరీరంలో వేడి అనిపించినప్పుడు రోజూ రెండు, మూడు ఖర్జూరా (Dates Fruit )లను తీసుకొని శుభ్రమైన నీటిలో రాత్రి మొత్తం నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే ఒంట్లో వేడి ఇట్టే మాయం అవుతుంది.
నిమ్మకాయ ఎక్కువగా వంటల్లో, పానియాల్లో ఉపయోగించే పుల్లని పండు. ఇందులో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఓ గ్లాస్ చల్లని నిమ్మరసం తాగితే ఒంట్లో వేడి ఇట్టే మాయం అవుతుంది. ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి, కిడ్నీ రాళ్లను కరిగించడానికి సహాయపడుతుంది.
కీరదోస (Cucumber): నీటి శాతం అధికంగా ఉండే కూరగాయ కీరదోస. ఇది శరీరాన్ని చల్లబరచడానికి, హైడ్రేట్ చేయడానికి, బరువు తగ్గించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి, బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇందులో విటమన్ కె, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.
పుదీనా(Mint): ఇది ఒక సుగంధభరితమైన ఆకుకూర. జీర్ణక్రియ మెరుగుపరచడం, కడుపు ఉబ్బరం, వికారం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. నోటి దుర్వాసను తొలగిస్తుంది. పుదీనా నీటిలో నానపెట్టుకుని తాగితే శరీరం చల్లబడుతుంది.
మజ్జిగ (Buttermilk): శరీరంలో అధిక వేడిని ఇట్టే తొలగించే ద్రవపదార్థాల్లో ఒకటి మజ్జిగ. ఏ సీజన్ లో అయినా సరే వేడి అనిపిస్తే వెంటనే మజ్జిగ తాగాలని సలహా ఇస్తుంటారు. ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని తాగితే చాలా మంచిది.
కొబ్బరి నీళ్లు (Coconut Water): లేత కొబ్బరికాయ లోపల స్వచ్ఛమైన పోషకాలతో నిండిన సహజ పానియం ఉంటుంది. ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేసి వేడి, అలసటను తగ్గిస్తుంది.
సబ్జా గింజలు(Sabja Seeds): గ్లాసు నీళ్లలో నానబెట్టి, కాస్త చక్కర వేసుకొని కలిపి తాగితే శరీరం చల్లబడుతుంది. పరగడుపున సబ్జా గింజలతోపాటు తులసి విత్తనాలు, తుక్మారియా విత్తనాలు కలిపి నానబెట్టుకొని తాగితే ఒంట్లో వేడి తగ్గడమే కాదు.. రోజు మొత్తం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.
Also Read:
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ విభజనపై కసరత్తు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఇప్పటివరకు ఎంతమంది దర్శించుకున్నారంటే..
For More Latest News