Hyderabad: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ విభజనపై కసరత్తు
ABN , Publish Date - Jan 09 , 2026 | 07:45 AM
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ విభజనపై కసరత్తు జరుగుతోంది. 3 జోన్లు, 22 పోలీస్ స్టేషన్‌లతో పరిధి ఏర్పాటు చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. కొత్త జోన్‌లకు డీసీపీల నియామకం పూర్తయింది.
- 3 జోన్లు, 22 పోలీస్ స్టేషన్‌లతో పరిధులు
- కొత్త జోన్‌లకు పూర్తయిన డీసీపీల నియామకం
- త్వరలో ఏడీసీపీ, ఏసీపీల కేటాయింపు
హైదరాబాద్ సిటీ: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పునర్విభజన(Cyberabad Police Commissionerate) ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కొత్త కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ఎం.రమేష్ జోనల్ డీసీపీలతో క్షేత్రస్థాయిలో కలిసి అధ్యయనం చేశారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధులను నిర్ణయించడంలో నిమగ్నమయ్యారు. సైబరాబాద్ కమిషనర్ కూడా పది రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ను మూడు కార్పొరేషన్లుగా మారిస్తే, దానికి అనుగుణంగానే కొత్త పోలీస్ కమిషనరేట్లు ఉండేలా యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్‌లతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిని నిర్ణయించారు. పాత పోలీస్ స్టేషన్ల పరిధులన్నీ వేర్వేరుగా ఉండడంతో వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత సరిహద్దులను మార్చి మూడు జోన్‌ల పరిధిలోనే ఉండేలా చర్యలు చేపట్టారు.
పూర్తయిన డీసీపీల నియామకం
కొత్తగా ఏర్పడిన జోన్‌లకు అనుగుణంగా డీసీపీల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. శేరిలింగంపల్లి జోన్ డీసీపీగా సీహెచ్.శ్రీనివాస్, కూకట్‌పల్లి జోన్ డీసీపీగా రితిరాజ్, కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీగా ఎన్.కోటిరెడ్డిలను నియమించింది. ముగ్గురూ పాత సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేసిన వారే కావడంతో త్వరితగతిన పునర్విభజన పక్రియను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మూడు జోన్‌ల పరిధిలో 7 ఏసీపీ డివిజన్లు, 22 పోలీస్ స్టేషన్‌లను ఏర్పాటు చేయనున్నారు. పునర్విభజనకు ముందు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5 జోన్లు, 11 డివిజన్లు, 44 పోలీస్‌స్టేషన్లు ఉండేవి. ప్రస్తుతం సైబరాబాద్ పోలిస్ కమిషనరేట్ పరిధి నార్సింగి నుంచి మొదలై శేరిలింగంపల్లి, పటాన్‌చెరువు, దుండిగల్, మేడ్చల్ మీదుగా శామీర్‌పేట జినోమ్ వ్యాలీ వరకు ఉండనుంది.

పునర్విభజన తర్వాత...
శేరిలింగంపల్లి జోన్: ఆర్‌సీ పురం డివిజన్.. పోలీస్ స్టేషన్లు.. చందానగర్, ఆర్.సీ.పురం, పటాచ్‌చెరు, అమీన్‌పూర్.
నార్సింగి డివిజన్‌లో పోలీస్ స్టేషన్లు.. నార్సింగి, గచ్చిబౌలి, కొల్లూరు.
కూకట్‌పల్లి జోన్: కేపీహెచ్‌బీ డివిజన్.. పోలీస్ స్టేషన్లు.. కేపీహెచ్‌బీ, మియాపూర్.
బాలానగర్ డివిజన్.. పోలీస్ స్టేషన్లు.. బాలానగర్, కూకట్‌పల్లి, అల్లాపూర్
మాదాపూర్ డివిజన్.. పోలీస్ స్టేషన్లు.. మాదాపూర్, రాయదుర్గం.
కుత్బుల్లాపూర్ జోన్: మేడ్చల్ డివిజన్.. పోలీస్ స్టేషన్లు.. మేడ్చల్, దుండిగల్, పేట్ బషీరాబాద్, జినోమ్ వ్యాలీ.
కుత్బుల్లాపూర్ డివిజన్.. పోలీస్ స్టేషన్లు. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, సూరారం, బాచుపల్లి.
ఈ వార్తలు కూడా చదవండి.
ఇక షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్
శాప్‌కు 60.76 కోట్లు.. కేంద్ర క్రీడా శాఖ కేటాయింపు
Read Latest Telangana News and National News