Share News

అలర్జీలకు ఏ డైట్‌ మంచిది?

ABN , Publish Date - Feb 15 , 2026 | 11:57 AM

నాకు కొన్ని వాసనలు పడవు. ఒక్కోసారి రంగులు కూడా. వెంటనే తుమ్ములూ దగ్గుతో పాటు తలనొప్పి వస్తుంది. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్లు ఆహారపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

అలర్జీలకు ఏ డైట్‌ మంచిది?

నాకు కొన్ని వాసనలు పడవు. ఒక్కోసారి రంగులు కూడా. వెంటనే తుమ్ములూ దగ్గుతో పాటు తలనొప్పి వస్తుంది. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్లు ఆహారపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- సుచిత్ర, సికింద్రాబాద్‌

అలర్జీలకు ప్రత్యేకంగా పాటించాల్సిన ఒక నిర్దిష్ట డైట్‌ అనేది లేదు. ప్రతి వ్యక్తికి అలర్జీ కలిగించే కారణాలు, ఆహారాలు భిన్నంగా ఉంటాయి. కొందరికి కొన్ని ఆహార పదార్థాలు పడకపోవడం వల్ల ముక్కు నుంచి నీరు రావడం, ముక్కు దిబ్బడ, తలనొప్పి లేదా మైగ్రేన్ర్‌ లాంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో ఏ ఆహారం తీసుకున్న తర్వాత లక్షణాలు పెరుగుతున్నాయో గమనించి, దాన్ని డైట్‌ నుంచి తొలగించడమే చక్కని పరిష్కారం. అలాగే అలర్జీలు కేవలం ఆహారం వల్లే కాకుండా దుమ్ము, ధూళి, పూల పరాగాలు, వాతావరణ మార్పులు వల్లా రావచ్చు.


కాబట్టి ఆహారాన్ని మాత్రమే కాదు, పరిసరాల ప్రభావాన్ని కూడా గుర్తించడం అవసరం. వైరస్‌ కార ణంగా జలుబు వచ్చినప్పుడు వేడి సూపులు, వేడి ఆహా రం ఉపశమనాన్ని ఇస్తాయి; కానీ అలర్జీ కారణంగా వస్తే, ట్రిగ్గర్‌ను గుర్తించి దూరంగా ఉండడం మాత్రమే దీర్ఘకాలి కంగా ఉపయోగపడే మార్గం. అందువల్ల, అలర్జీల విషయంలో ‘‘ఏ డైట్‌ ఫాలో అవ్వాలి’’ అనే దానికి, మీకు పడని ఆహారాలు ఏవో తెలుసుకుని వాటిని మానేయడమే మంచిది.


కొన్ని సార్లు కొంతకాలం పాటు పడని ఆహారం ఆపేసిన తరు వాత పరిమిత మోతాదుల్లో దానిని తిరిగి తీసుకున్నప్పుడు ఇబ్బంది వస్తోందేమో గమనించి, ఇబ్బంది లేని పక్షంలో క్రమంగా పరిమాణాన్ని పెంచుకోవచ్చు. దీన్నే ఎలిమినేషన్‌ డైట్‌ అంటారు. సొంతంగా చేసుకోగలిగినప్పటికీ, నిపుణుల పర్య వేక్షణలో ఈ ఎలిమినేషన్‌ డైట్‌ చేయడం ద్వారా ఆహార పరమైన అలర్జీలు ఉంటే తెలుసుకుని, ఆ ఆహారాన్ని మానేయడం వల్ల పోషక లోపాలు రాకుండా ప్రత్యామ్నాయాలు తెలుసుకోవడం సులువవుతుంది.


నాకు 30 ఏళ్ళు. ఇటీవల నా జుట్టు పొడిబారినట్టు అనిపిస్తోంది. ఎన్ని నూనెలు వాడినా ప్రయోజనం ఉండడం లేదు. ఆహారంలో ఏవైనా మార్పులు చేసుకోవాలా?

- నయనిక, ఒంగోలు

book6.3.jpgవయసుతో వచ్చే మార్పులు, ఒత్తిడిల కారణంగా ఏర్పడే మార్పుల వల్ల కూడా జుట్టు బిరుసుగా, పొడిగా అయ్యే అవకాశం ఉంటుంది. పైపైన వాడే నూనెలు, షాంపూలు, సీరం లాంటి వాటితో పాటు లోపలికి తీసుకొనే పోషకాల పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మీ ఆహారంలో ప్రొటీన్లు అధికంగా ఉండేలా చికెన్‌, చేప, గుడ్లు లాంటివి తప్పకుండా తీసుకోండి. అలాగే, మాంసాహారంతో పాటుగా పాలు, పెరుగు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు ఎంతో అవసరం. వీటన్నింటిలో ఉన్న ఐరన్‌, జింక్‌, సెలీనియం మొదలైన ఖనిజాలు జుట్టు రాలకుండా ఉండడానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి అత్యవసరం. అంతే కాకుండా బాదం, ఆక్రోట్‌, నువ్వులు, అవిసె గింజలు మొదలైన వాటిల్లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కూడా మీ సమస్య నివారణకు కొంతవరకు ఉపయోగపడ తాయి. ఆహార జాగ్రత్తలతో పాటు, మీ జీవన విధానంలో స్ట్రెస్‌ లేదా ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేస్తే మంచిది.


ఒమేగా-3 లోపిస్తే ఏర్పడే అనారోగ్య సూచనలేవి? ఒమేగా- 3 లభ్యమయ్యే పండ్లు, కూరగాయలు ఇతర ఆహారపదార్థాల గురించి తెలియజేయగలరు?

- శివన్న, మైదుకూరు

book6.2.jpgగుండె, మెదడు, కీళ్లు, రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు చాలా అవసరం. శరీరంలో ఒమేగా-3 లోపిస్తే చర్మం పొడిగా మారడం, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు, శరీరంలో వాపు పెరగడం, తరచూ అలసట, దృష్టి కేంద్రీకరణ లోపించడం, మానసిక ఒత్తిడి లాంటి లక్షణాలు కనిపించవచ్చు. కొందరిలో గుండె ఆరోగ్యం బలహీనపడటం, రక్తపోటు నియంత్ర ణలో ఇబ్బంది కలగడం కూడా గమనించవచ్చు. ఒమేగా-3 సహజంగా అనేక ఆహారాలలో లభిస్తుంది. పండ్లు, కూరగాయల్లో నేరుగా ఉండకపోయినా, వివిధ రకాల నూనె గింజలు, అవకాడో లాంటి వాటిలో కొద్దిపాటి ఒమేగా-3 ఉంటుంది.


ప్రధానంగా ఆవిసె గింజలు, చియా గింజలు, వాల్‌నట్స్‌ (అక్రోట్‌)లాంటి గింజల నుంచి ఒమేగా-3 లభిస్తుంది. నాన్‌-వెజ్‌ తీసుకునేవారికి సాల్మన్‌, సార్డిన్‌, మాక్రెల్‌ లాంటి కొవ్వు చేపలు అత్యుత్తమ ఒమేగా-3 వనరులు. ఆహారం ద్వారా సరిపడా ఒమేగా-3 లభించని సందర్భాల్లో ఒమేగా-3 సప్లిమెంట్స్‌ గుండె ఆరోగ్యం మెరుగుపరచడం, రక్తపోటు తగ్గించడం, మెదడు పనితీరు, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, శరీరం లోని ఇన్‌ఫ్లమేషన్‌, కీళ్ల నొప్పులను తగ్గిం చడంలో సహాయపడతాయి. గర్భిణులలో పిండం మెదడు అభివృద్ధికి కూడా ఇవి ఉపయోగపడతాయి. అయితే సప్లిమెం ట్స్‌ను వైద్యుల సూచన మేరకు మాత్రమే తీసుకోవాలి.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)


ఈ వార్తలు కూడా చదవండి:

‘నేనే రాజు.. నేనే మంత్రి..’ అదే నిజమా..!

గుమ్మడి నర్సయ్యకు గౌరవ డాక్టరేట్‌

Read Latest Telangana News and National News

Updated Date - Feb 15 , 2026 | 11:57 AM