విజయ్ నిర్ణయానికి కారణం అదేనా?
ABN , Publish Date - Mar 31 , 2026 | 01:42 PM
అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్ పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలను ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలు వినిపిస్తున్నాయి.
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్ పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలను ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలు వినిపిస్తున్నాయి. రెండు నియోజకవర్గాలలో క్రైస్తవులు అధికంగా ఉండటం ప్రధాన కారణమైనప్పటికీ మరిన్ని అంశాలు కూడా అతడి విజయానికి సానుకూలంగా ఉండటం విశేషం. ద్రావిడ పార్టీలన్నీ తిరుచ్చి నగరంలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా పెద్ద మలుపు అందిస్తుందని తమిళంలో ‘తిరుప్పమ్ తరుమ్ తిరుచ్చి’ అని చెబుతుంటారు. టీవీకే నేత విజయ్ తన ప్రధాన ప్రచార కార్యక్రమాన్ని ఆ నగరం నుంచే ప్రారంభించారు.
యువ ఓటర్లే అధికం...
తిరుచ్చి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నగరం నడిబొడ్డున ఉండగా ప్రస్తుతం క్రిస్టియన్ గుడ్‌విల్ మూవ్‌మెంట్ నాయకుడు ఇనికో ఇరుదయరాజ్ డీఎంకే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మరోమారు ఆయన పోటీకి దిగుతున్నారు. ప్రస్తుతం టీవీకే నేత విజయ్ తిరుచ్చి తూర్పు నియోజకవర్గంలో పోటీకి దిగుతుండటంతో ఆ నియోజకవర్గం వార్తల్లో ప్రధానాంశంగా మారింది. ఈ నియోజకవర్గంలో పోటీకి దిగితే ఎక్కువగా ఖర్చు పెట్టక్కర్లేదని కూడా చెబుతారు. ఈ కారణాల వల్లే విజయ్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.
ఈ నియోజకవర్గంలో కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి. యువ ఓటర్ల సంఖ్య కూడా అత్యధికం. యువత విజయ్ పార్టీ పట్ల ఆకర్షితులై ఓటు వేయడం ఖాయమని విజయ్ భావిస్తున్నారు. అంతా సరే ఈ నియోజకవర్గంలో డీఎంకే తరఫున మళ్ళీ పోటీకి దిగుతున్న ఇనికో ఇరుదయరాజ్ ఆర్థిక బలం, అంగబలం కలిగిన నేత. ఆయనతో పోటీ పడటం ఆషామాషీ వ్యవహారం కాదని డీఎంకే కూటమి పార్టీల నేతలు చెబుతున్నారు. అయితే తిరుచ్చి ఈస్ట్‌లో టీవీకే సానుకూల పవనాలే వీస్తున్నాయని ఆ పార్టీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
పెరంబూరు ఎంపికకు కారణమిదే...
రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే రెండు మూడు ప్రైవేటు సంస్థల ద్వారా, పార్టీ నాయకుల ద్వారా ఆరుమాసాల పాటు నిర్వహించిన సర్వేఫలితాల్లో విజయ్ పోటీకి రాజధాని నగరం పరిధిలోని పెరుంబూరు అన్నివిధాలా సానుకూలమైన నియోజకవర్గమని తేల్చాయి. ఇక సిట్టింగ్ డీఎంకే ఎమ్మెల్యే ఆర్డీ శేఖర్‌పై నియోజకవర్గం ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కూడా ఆ సర్వే ఫలితాలు రావడంతో విజయ్ ఈ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు.
వీటన్నింటికీ తోడు పెరంబూరు నియోజకవర్గంలో క్రైస్తవులు అధికంగా ఉండటంతో వారి ఓట్లంతా సులువుగా తనకు పడతాయని విజయ్ ఆశిస్తున్నారు. పార్టీ పరంగా ఈ నియోజకవర్గంలోనే సభ్యులు అత్యధికంగా ఉండటం ప్లస్ పాయింట్ అని ఆయన భావిస్తున్నారు. టీవీకే జిల్లా కార్యదర్శి శివా ఆధ్వర్యంలో సభ్యత్వ ముమ్మర కార్యక్రమాలు జరిగాయి. ఆ సందర్భంగా 2.22 లక్షల పైచిలుకు ఓటర్లలో 44 వేల మంది టీవీకే సభ్యత్వం స్వీకరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి..
రేపటి నుంచే మార్పులు.. మీ పాకెట్ పై ప్రభావం చూపించే అంశాలు!
Read Latest Telangana News and National News