Share News

జేఎన్‌టీయూలో జిరాక్స్‌ కుంభకోణం

ABN , Publish Date - Feb 06 , 2026 | 08:02 AM

నగరంలోని కూకట్‏పల్లోగల జవహర్‏లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో జిరాక్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 3కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్లు సమాచారం. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.

జేఎన్‌టీయూలో జిరాక్స్‌ కుంభకోణం

  • 18ఏళ్లుగా అనధికార వ్యక్తుల ఇష్టారాజ్యం

  • ఉన్నతాధికారుల కళ్లుగప్పి రూ.3కోట్ల వ్యాపారం

  • విచారణకు ఆదేశించిన వైస్‌ చాన్స్‌లర్‌

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూ లైబ్రరీలో ‘జిరాక్స్‌’ కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీ(University) ఉన్నతాధికారుల కళ్లుగప్పి అనధికార వ్యక్తులు 18ఏళ్లుగా సుమారు రూ.3కోట్ల వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణం వెనుక ప్రధాన సూత్రధారి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి కావడం ఉన్నతాధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదంతా జరుగుతున్నప్పటికీ, అటు లైబ్రేరియన్లు గానీ, ఇటు అందులో పనిచేస్తున్న ఉద్యోగులు గానీ వైస్‌చాన్స్‌లర్‌, రిజిస్ట్రార్లకు ఫిర్యాదు చేయకపోవడంపైనా అనుమానాలు రేకెత్తుతున్నాయి. లైబ్రరీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువ మంది అధికారులకు బంధువులు కావడంతోనే ఈ వ్యవహారం బయటకు పొక్కలేదని విద్యార్థులు చెబుతున్నారు.


పేరు ఒకరిది.. వ్యాపారం వేరొకరిది..

యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు సౌలభ్యంగా ఉండేందుకని 2008లో జిరాక్సు సెంటర్‌ కోసం తాత్కాలికంగా సబితా ఎంటర్‌ప్రెజె్‌సకు అనుమతి ఇచ్చారు. ప్రారంభంలో ఆశించిన ఆదాయం రాకపోవడంతో సదరు సంస్థ యజమాని దానినుంచి వైదొలిగారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరకపోవడంతో అదే సంస్థ పేరుతో అనధికార వ్యక్తులు జిరాక్సు సెంటర్‌ను ఇన్నేళ్లుగా నడిపిస్తున్నారు. వర్సిటీ విద్యార్థుల కోసం పెట్టిన ఈ జిరాక్సు సెంటర్‌లోనే..


బయట నుంచి ఆర్డర్లు తీసుకొని అనధికార వ్యక్తులు వ్యాపారం కొనసాగించారు. యూనివర్సిటీలో అద్దె నామమాత్రంగా ఉండడం, ఉచితంగా కరెంటు లభిస్తుండడంతో అక్రమార్కుల పంటపండింది. ప్రస్తుత నెలకు రూ.లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు వ్యాపారం జరుగుతోందని అంచనా. ఇటీవల సదరు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి తనకు రూ.4లక్షలు ఇస్తేనే వ్యాపారం జరగనిస్తానని డిమాండ్‌ చేయడంతో, అనధికార వ్యక్తులు ఒక మంత్రిగారితో రిజిస్ట్రార్‌కు ఫోన్‌ చేయించారు.


city3.2.jpgదీంతో అక్రమాలు బయటపడ్డాయి. వైస్‌చాన్స్‌లర్‌ ఆదేశాల మేరకు జిరాక్స్‌ సెంటర్‌ను అధికారులు సీజ్‌ చేశారు. సమగ్ర విచారణ జరిపించేందుకు వర్సిటీ రెక్టార్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. జిరాక్సు ప్రతులకు యూనివర్సిటీ నిర్దేశించిన ధర కాకుండా విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో సొమ్మును అనధికార వ్యక్తులు వసూలు చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

సినిమాలు తక్కువ.. గాసిప్స్‌ ఎక్కువ

భాస్కరా అవార్డులాగా కేసీఆర్‌కు జాతిపితనా..!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 06 , 2026 | 11:01 AM