JNTU: జేఎన్‌టీయూలో.. ప్రమోషన్లు అందని ద్రాక్షేనా..?
ABN , Publish Date - Jan 17 , 2026 | 08:12 AM
నగరంలోగల జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలోగల ఆచార్యులకు పదోన్నతులు అందని ద్రాక్షగానే మరిందన్న విమర్శలొస్తున్నాయి. ఏళ్ల తరబడి పదోన్నతులు లేకపోవడంతో వారిలో నిరాశ ఎదురవుతోంది.
జేఎన్‌టీయూలో ఆచార్యుల ఎదురుచూపులు
సీఏఎస్ ఇంటర్వ్యూలు పూర్తయినా కొలిక్కిరాని ప్రక్రియ
హైదరాబాద్ సిటీ: జేఎన్‌టీయూ(JNTU)లో పనిచేస్తున్న ఆచార్యులకు పదోన్నతులు అందని ద్రాక్షగా మారింది. నాలుగేళ్ల క్రితం సుమారు 54మంది అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు పదోన్నతులకు అర్హతలు కలిగి ఉన్నప్పటికీ, వర్సిటీ యాజమాన్యం కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్(సీఏఎస్) కింద ఇంటర్వ్యూలు నిర్వహించడంలో తీవ్ర జాప్యం చేసింది. తాజాగా గత డిసెంబరు 16నుంచి 18వరకు ఇంటర్వ్యూల ప్రక్రియను ముగించిన ఉన్నతాధికారులు, నెలరోజులు అవుతున్నప్పటికీ ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలమయ్యారు. కనీసం ఈ నెలలో అయినా ప్రమోషన్ లెటర్లు అందుతాయో, లేదోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారుల మోకాలడ్డు ?
కిందిస్థాయి ఉద్యోగులు, ఆచార్యుల సంక్షేమాన్ని కాంక్షించాల్సిన ఉన్నతాధికారులే వారికి ప్రమోషన్లు రాకుండా అడ్డుకుంటున్నారా అంటే.. కొంతమంది ఆచార్యులు, ఉద్యోగుల నుంచి అవుననే జవాబే వస్తోంది. కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ కింద ఇంటర్వ్యూలకు హాజరైన వారి వివరాలతో ఫైల్ ను పాలకమండలి ముందుంచితే ఎప్పుడో క్లియరెన్స్ వచ్చేదని వారంటున్నారు. కొంద రు ఉన్నతాధికారులు అలా చేయకుండా, అర్హతలు లేనివారికి కూడా పదోన్నతులు, సర్వీసు పొడిగింపు ప్రయోజనాలు కల్పించేందుకు ప్రయత్నించడంతో పాలకమండలిలో సభ్యులైన ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఏఎస్ ఇంటర్వ్యూలకు హాజరైన వారికి పదోన్నతులు కల్పించేందుకు పాలకమండలికి ఎటువంటి ఆభ్యంతరాలు లేకున్నా, 2016లోనే ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన ఆచార్యుల్లో కొందరు తమ సర్వీసును ముందుకు జరిపి 2013 నుంచి కొనసాగించాలని కోరడాన్ని ఆక్షేపిస్తున్నట్లు తెలుస్తోంది.

అలా చేస్తే యూనివర్సిటీకి రూ.150కోట్లు నష్టమని..
అర్హతలేని వారికి పదోన్నతులు కల్పిస్తే యూనివర్సిటీపైరూ.150కోట్లకు పైగా భారం పడుతుందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సర్వీసు పొడిగింపు అనేది ఆర్ధిక పరమైన అంశం కాబట్టి పాలకమండలి సభ్యులు ఆ ఫైలును పక్కన పెట్టాలని ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. అలాగని అభ్యంతరాలు లేని సీఏఎస్ పదోన్నతులను కూడా నిలిపేయడం ఎంతవరకు సమంజసమని ఆశావహలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పదోన్నతులు, సీనియారిటీ పొడిగింపు అంశాలను వేర్వేరుగా చూడాలని, అన్ని అర్హతలున్న వారికి వెంటనే ప్రమోషన్ లెటర్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆచార్యులు కోరుతున్నారు. ఈ నెల 19న పాలకమండలి మరోమారు సమావేశమై పదోన్నతుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించే అవకాశం ఉందని ఉద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
అవును.. శ్రీరాముడికి బీజేపీ సభ్యత్వం ఉంది
Read Latest Telangana News and National News