Share News

సీబీఎస్‌ఈ 10వ తరగతి సెకండ్ బోర్డు పరీక్షా ఫలితాలు విడుదల

ABN , Publish Date - Jul 18 , 2026 | 09:50 PM

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి బోర్డు పరీక్షా ఫలితాలను శనివారం విడుదల చేసింది.

సీబీఎస్‌ఈ 10వ తరగతి సెకండ్ బోర్డు పరీక్షా ఫలితాలు విడుదల
CBSE Class 10 Results 2026

న్యూఢిల్లీ, జులై 18: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి బోర్డు పరీక్షా ఫలితాలను శనివారం విడుదల చేసింది. జాతీయ విద్యా విధానం (NEP)-2020 మార్గదర్శకాల ప్రకారం.. సీబీఎస్‌ఈ ఈ ఏడాది (2026) నుంచే ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే సరికొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ నూతన విధానంలో భాగంగా నిర్వహించిన మొదటి ప్రధాన పరీక్ష, సెకండ్ బోర్డు పరీక్షల ఫలితాలను కలిపి ఓవరాల్‌గా 96.78 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు బోర్డు వెల్లడించింది. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక 'డిజీలాకర్ ఫలితాల పోర్టల్' (DigiLocker Results Portal) ద్వారా తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది.


ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు ప్రధాన బోర్డు పరీక్షలు జరగ్గా.. రెండో బోర్డు పరీక్షలను మే 15 నుంచి మే 21 వరకు నిర్వహించారు. రెగ్యులర్ విద్యార్థులు రాసిన ఈ రెండు పరీక్షల్లో ఏ పరీక్షలో అత్యుత్తమ మార్కులు వస్తే, వాటినే తుది ఫలితంగా బోర్డు పరిగణించింది. సెకండ్ బోర్డు పరీక్ష కోసం మొత్తం 6,64,027 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వారిలో 6,63,777 మంది హాజరయ్యారు.


ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల కంటే మెరుగైన స్కోరు సాధించడం కోసం 5,13,955 మంది పరీక్ష రాయగా.. వారిలో 3,08,095 మంది (59.95%) తమ మార్కులను పెంచుకోవడం విశేషం. ఇక కంపార్ట్‌మెంట్ విభాగంలో 1,49,822 మంది పది పరీక్షలు రాయగా.. 78,503 మంది (52.40%) ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది నమోదైన 48.68 శాతంతో పోలిస్తే ఈసారి కంపార్ట్‌మెంట్ ఫలితాలు మెరుగ్గా ఉండటం గమనార్హం.


పాఠశాలల లాగిన్‌లతో పాటు విదేశాల్లో చదువుతున్న సీబీఎస్‌ఈ విద్యార్థులకు కూడా డిజీలాకర్ ద్వారా డిజిటల్ మార్కుల పత్రాలను అందుబాటులో ఉంచినట్లు బోర్డు తెలిపింది. ఫలితాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, కేవలం బోర్డు అధికారిక ప్రకటనలనే ప్రామాణికంగా తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సీబీఎస్‌ఈ సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి

అనుమానిత ఉగ్రవాదుల కేసులో ఏటీఎస్ సంచలన విషయాలు వెల్లడి..

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి.. సిరా లాంటి ద్రవం చల్లిన మహిళ..

Updated Date - Jul 18 , 2026 | 09:50 PM