బీటెక్ పూర్తి చేశారా? లెఫ్టినెంట్‌గా చేరే అవకాశం
ABN , Publish Date - Jul 17 , 2026 | 01:57 PM
బీటెక్ పూర్తి చేసిన యువతకు ఇండియన్ ఆర్మీలో అధికారి అయ్యే సువర్ణావకాశం వచ్చింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC-Tech) కింద 350 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంజినీరింగ్ పూర్తి చేసిన యువతకు ఇండియన్ ఆర్మీ శుభవార్త చెప్పింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC-Tech) ద్వారా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ప్రత్యేకత ఏమిటంటే.. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. బీటెక్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, అనంతరం సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (SSB) ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాలో నియామకం లభిస్తుంది. జీతభత్యాలు, అలవెన్సులతో కలిపి నెలకు సుమారు రూ.1.5 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
మొత్తం ఖాళీలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా పోస్టులు:
సివిల్ – 75
కంప్యూటర్ సైన్స్ – 60
ఎలక్ట్రికల్ – 33
ఎలక్ట్రానిక్స్ – 64
మెకానికల్ – 101
ఇతర ఇంజినీరింగ్ విభాగాలు – 17
ఎంపిక విధానం
ఆన్‌లైన్ దరఖాస్తుల పరిశీలన
బీటెక్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్
SSB ఇంటర్వ్యూ
వైద్య పరీక్ష
తుది ఎంపిక
SSB ఇంటర్వ్యూ మొత్తం ఐదు రోజులపాటు రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో అర్హత సాధించినవారే రెండో దశకు వెళ్తారు. ఇందులో సైకాలజికల్ పరీక్షలు, గ్రూప్ టాస్కులు, వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
శిక్షణ ఎక్కడ?
తుది ఎంపికైన అభ్యర్థులకు 2027 ఏప్రిల్ నుంచి గయలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లో 49 వారాల శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో ప్రతి నెల రూ.56,100 స్టైపెండ్ అందిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ కూడా ప్రదానం చేస్తారు.
జీతం ఎంత?
శిక్షణ పూర్తయ్యాక లెఫ్టినెంట్ హోదాలో నియమిస్తారు.
బేసిక్ పే – రూ.56,100
డీఏ
హెచ్‌ఆర్‌ఏ
మిలిటరీ సర్వీస్ పే
ఇతర అలవెన్సులు
ఇవన్నీ కలిపి నెలకు సుమారు రూ.1.5 లక్షల వరకు వేతనం పొందే అవకాశం ఉంటుంది.
సర్వీస్, ప్రమోషన్లు
ప్రారంభంలో 10 సంవత్సరాల సేవ ఉంటుంది. అవసరమైతే మరో నాలుగు సంవత్సరాల పొడిగింపు అవకాశం ఉంటుంది. ప్రతిభ, ఖాళీల ఆధారంగా శాశ్వత కమిషన్ పొందే అవకాశం కూడా ఉంది.
ప్రమోషన్లు:
2 సంవత్సరాల తర్వాత – కెప్టెన్
6 సంవత్సరాల తర్వాత – మేజర్
13 సంవత్సరాల తర్వాత – లెఫ్టినెంట్ కల్నల్
అర్హతలు
సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
కంప్యూటర్ సైన్స్ పోస్టులకు బీటెక్ (ఐటీ), ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
2000 ఏప్రిల్ 1 నుంచి 2007 మార్చి 31 మధ్య జన్మించిన వారు అర్హులు.
మహిళలకు కూడా అవకాశం.
అవివాహిత మహిళల కోసం కూడా ప్రత్యేక నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టులు:
మెకానికల్ – 9
సివిల్ – 7
ఎలక్ట్రానిక్స్ – 6
కంప్యూటర్ సైన్స్ – 4
ఎలక్ట్రికల్ – 3
అదనంగా డిఫెన్స్ విడోల కోసం 2 పోస్టులు కేటాయించారు. మహిళల ఎంపిక ప్రక్రియ కూడా పురుషుల మాదిరిగానే ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
పురుష అభ్యర్థుల దరఖాస్తుల చివరి తేదీ: ఆగస్టు 7, 2026 (మధ్యాహ్నం 3 గంటల వరకు)
మహిళల దరఖాస్తుల చివరి తేదీ: ఆగస్టు 6, 2026 (మధ్యాహ్నం 3 గంటల వరకు)
SSB ఇంటర్వ్యూలు: అక్టోబర్ – డిసెంబర్ 2026
శిక్షణ ప్రారంభం: ఏప్రిల్ 2027
ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.