Share News

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి.. సిరా లాంటి ద్రవం చల్లిన మహిళ..

ABN , Publish Date - Jul 18 , 2026 | 03:30 PM

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై సిరా లాంటి ద్రవంతో ఓ మహిళ దాడి చేసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీప్కే తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించి ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది.

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి.. సిరా లాంటి ద్రవం చల్లిన మహిళ..
Attack on Abhijeet Deepke

ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై సిరా లాంటి ద్రవంతో ఓ మహిళ దాడి చేసింది. జంతర్ మంతర్ వద్ద దీప్కే తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించి ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. గుర్తుతెలియని మహిళ వారి సమావేశంలోకి ప్రవేశించి అతనిపై దాడికి పాల్పడింది. దీంతో దీప్కే మద్దతుదారులు మహిళ వైపు ఒక్కసారిగా దూసుకెళ్లడంతో జంతర్ మంతర్ వద్ద కాసేపు గందరగోళం నెలకొంది. అయితే, మహిళ ఎవరు? దాడి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సోనమ్ వాంగ్ చుక్ దీక్ష భగ్నం తర్వాత తాను కూడా నిరశనకు దిగుతానని దీప్కే ప్రకటించిన కాసేపటికే అతనిపై ఈ దాడి జరిగింది. ఘటన అనంతరం ఎక్స్ వేదికగా దీప్కే స్పందించారు. దాడికి సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ 'నీలం నా రంగు... జై భీమ్!' అని ఆయన పేర్కొన్నారు.


కాగా, ఈ రోజు (శనివారం) సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. 21వ రోజుకు చేరుకున్న నిరశన దీక్షను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ప్రశ్నపత్రాల లీక్ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ ఆధ్వర్యంలో వాంగ్‌చుక్ నిరసనకు దిగిన విషయం తెలిసిందే. జూన్ 28 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టడంతో ఆయన దాదాపు 9.5 కిలోల బరువు తగ్గారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి దీక్షను భగ్నం చేశారు. ఈ ఘటన అనంతరం గంటల వ్యవధిలోనే అభిజీత్ దీప్కేపై మహిళ దాడి చేసింది.


ఇవి కూడా చదవండి

టీడీపీ కార్యకర్త దారుణ హత్య.. పరారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు

గాజువాకలో దారుణం.. కుమార్తెపై తండ్రి అఘాయిత్యం

Updated Date - Jul 18 , 2026 | 04:51 PM