టీడీపీ కార్యకర్త దారుణ హత్య.. పరారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు
ABN , Publish Date - Jul 18 , 2026 | 01:37 PM
నెల్లూరు జిల్లా కావలి మండలం తాగేటివారిపాలెంలో టీడీపీ కార్యకర్త చాట్ల వాసు హత్య రాజకీయంగా కలకలం రేపింది. ఇటీవల జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
నెల్లూరు జిల్లా: కావలి మండలం తాగేటివారిపాలెంలో టీడీపీ కార్యకర్త చాట్ల వాసు హత్య కలకలం రేపింది. ఇటీవల జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన వాసు, నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఘర్షణ సమయంలో నిందితులు వాసుపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వైసీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ మందా మధును ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఆయన వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్నట్లు సమాచారం. మధుతో పాటు మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో నిందితుడు రవిచంద్రను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. చికిత్స పొందుతూ చాట్ల వాసు మృతి చెందడంతో ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి (జీజీహెచ్) తరలించారు. ఈ ఘటనతో తాగేటివారిపాలెంలో విషాద వాతావరణం నెలకొంది. కేసును రూరల్ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read:
గాజువాకలో దారుణం.. కుమార్తెపై తండ్రి అఘాయిత్యం
ఉప్పల్ భగాయత్ ఫేజ్-2లో బైక్ రేసర్ల వీరంగం