అనుమానిత ఉగ్రవాదుల కేసులో ఏటీఎస్ సంచలన విషయాలు వెల్లడి..
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:57 PM
గుజరాత్‌లో నిన్న (శుక్రవారం) జైషే మహ్మద్‌కు చెందిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏటీఎస్ తాజాగా సంచలన విషయాలను వెల్లడించింది.
అహ్మదాబాద్: గుజరాత్‌లో నిన్న (శుక్రవారం) జైషే మహ్మద్‌కు చెందిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏటీఎస్ తాజాగా సంచలన విషయాలను వెల్లడించింది. దేశంలో భారీ దాడులకు నిందితులు పథకం రచించినట్లు తెలుపుతూ.. కేసు దర్యాప్తునకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించింది.
అరెస్టయిన నిందితుల్లో ఇద్దరు జమ్మూకశ్మీర్‌కు వెళ్లి శిక్షణ తీసుకున్నట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. ఏకే-47 అసాల్ట్ రైఫిల్ వినియోగం, పేలుడు పదార్థాలు, విషవాయువుల తయారీ సహా మొత్తం 40 రకాల ఉగ్ర నైపుణ్యాల్లో శిక్షణ తీసుకున్నట్లు వెల్లడించారు. వీటిల్లో ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన బాంబుల తయారీతో పాటు, సాధారణ సేంద్రియ పదార్థాలను ఉపయోగించి ప్రాణాంతక కార్బన్ మోనాక్సైడ్ వాయువును తయారు చేసే విధానాలనూ వీరు నేర్చుకున్నట్లు తెలిపారు. విదేశాల్లో ఉన్న అబ్దుల్లా అనే హ్యాండ్లర్ ఆదేశాల మేరకు ఈ ఉగ్ర మాడ్యూల్ కార్యకలాపాలు సాగినట్లు గుర్తించామన్నారు. స్థానికంగా తమ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు నిందితులు వడోదరకు వెళ్లి ఓ కశ్మీరీ యువకుడిని సంప్రదించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్ ఉగ్రకార్యకలాపాలకు అవసరమైన లాజిస్టిక్ ఏర్పాట్లలో భాగంగానే ఈ సమావేశం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
మరోవైపు, ఈ ఉగ్ర ముఠా ఇప్పటికే ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షల అనంతరం సోడియం ఫాస్ఫేట్, వైర్లు తదితర కీలక సామగ్రిని చెత్తకుండీల్లో పడేసినట్లు గుర్తించామన్నారు. ఫోరెన్సిక్ బృందాలు వాటిని స్వాధీనం చేసుకుని శాస్త్రీయ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, విదేశీ హ్యాండ్లర్ నుంచి రూ.3 లక్షల నిధులు అందుకున్న నిందితులు.. ఓ కారు, ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేసి రెక్కీ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్‌లోని గార్డెన్ తరహా హోటల్‌ను ప్రధాన లక్ష్యంగా ఎంచుకుని పేలుళ్లు జరిపేందుకు ప్రణాళిక వేసినట్లు వివరించారు. ఈ మేరకు నిందితులు హోటల్‌ను పరిశీలిస్తున్న సమయంలోనే ఏటీఎస్ వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
నిందితుల స్థావరాలపై నిర్వహించిన సోదాల్లో 43 జిహాదీ పుస్తకాలు, డిజిటల్ మాన్యువల్‌లను స్వాధీనం చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఖడియాసన్‌లోని ఓ మదర్సాలో ప్రధాన నిందితుడైన అమీన్ షేరా.. యువతను తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షించేందుకు వీటిని ఉపయోగిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో విదేశీ ఉగ్ర సంస్థలతో ఉన్న సంబంధాలు, నిధుల లావాదేవీలు, స్థానికంగా సహకరించిన వ్యక్తుల పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. వివరాలు వెల్లడించిన అనంతరం నిందితులను మెహసానా జిల్లాలోని కడి కోర్టులో ఏటీఎస్ అధికారులు హాజరుపరిచారు.
ఈ వార్తలు కూడా చదవండి
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి.. సిరా లాంటి ద్రవం చల్లిన మహిళ..
పాము సాయంతో భర్తను హత్య చేసిన భార్య..