Share News

ఈ రోజే వసంత పంచమి.. ఈ విషయాలు తెలుసా?

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:15 AM

పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉండాలంటే.. వారికి మంచి విద్యా బుద్ధులుండాలి. అందుకోసం చిన్నారులను వసంత పంచమి వేళ వారి తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఈ రోజు అక్షరాభ్యాసం చేసిన చిన్నారుల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..

ఈ రోజే వసంత పంచమి.. ఈ విషయాలు తెలుసా?
Vasanta Panchami

ఇంటర్నెట్ డెస్క్: మాఘ శుద్ధ పంచమి రోజు చదువుల తల్లి సరస్వతీ దేవి పుట్టింది. అందుకే ఈ రోజును వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని పిలుస్తారు. విద్య, వాక్కు, కళలకు అధిష్ఠాన దేవతే కాకుండా జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి ఆమె. అందుకే పిల్లలకు ఈ రోజు అక్షరాభ్యాసం చేయిస్తారు. నేడు చేసే కార్యాలకు పంచాంగ దోషాలు ఉండవని పెద్దలు చెబుతారు. చాలా విద్యాలయాల్లో ప్రత్యేకంగా సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నేడు అక్షరాభ్యాసం చేయిస్తే సరస్వతీ దేవి అనుగ్రహంతో పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటారని.. వారికి చక్కటి జ్ఞానం, సుబుద్ధి, మంచి వాక్కు లభిస్తాయని నమ్ముతారు.


పలకలు, పుస్తకాలు..

చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి.. పలకలు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు చిన్న పిల్లలకు పంచుతారు. అలా చేయడం వల్ల వారిపై అమ్మవారి అనుగ్రహం తప్పక ఉంటుందని విశ్వాసం.

అక్షరాభ్యాసం ఎలా చేయించాలి?

ముందుగా సరస్వతీ దేవి పూజ చేయించాలి. అందుకు పసుపు వస్త్రాలు, బియ్యం, అక్షతలు వినియోగిస్తారు.


బియ్యంపై ఇలా రాయిస్తే..

బియ్యం లేదా పలకపై పిల్లల చేత తల్లిదండ్రులు అక్షరాలు రాయిస్తారు. ఓంకారం లేదా ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ: అని రాసి దిద్దిస్తారు. ఇలా రాయించడం వల్ల వారిపై సరస్వతీ దేవి అనుగ్రహం తప్పక ఉంటుందని విశ్వసిస్తారు.


వసంత పంచమి పూజ..

నేడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఆ తర్వాత అమ్మవారిని భక్తితో పూజించాలి. ఈ రోజు ఉదయం 4:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు అక్షరాభ్యాసం చేయించడానికి శుభ ముహూర్తమని పండితులు చెబుతున్నారు. ఈ వసంత పంచమి రోజున ఏ పని ప్రారంభించినా.. అది ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుందని నమ్మకం. అమ్మవారికి ఈ రోజు.. చక్కెర పొంగలి, పాయసం, పసుపు రంగు మిఠాయి నైవేద్యంగా సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. సరస్వతీ దేవికి సంబంధించిన స్తోత్రాలు చదవడంతో పాటు పిల్లలతో పలికిస్తే.. వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని వివరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వసంత పంచమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి.?

మాఘమాసం ఎప్పుడు.. ఈ మాసంలో ఏం చేయాలి..

For More Devotional News And Telugu News

Updated Date - Jan 23 , 2026 | 11:46 AM