వసంత పంచమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి.?
ABN , Publish Date - Jan 21 , 2026 | 09:47 AM
మాఘమాసం పర్వదినాల మాసం. ఈ పర్వదినాలు.. వసంత పంచమితో ప్రారంభమవుతాయి. ఈ వసంత పంచమిని శ్రీపంచమి అని కూడా అంటారు. ఇంతకీ శ్రీ పంచమి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలో ఓసారి తెలుసుకుందాం..
మాఘ మాసం అంటేనే పర్వదినాల మాసం. ఈ మాసంలో వచ్చే వసంత పంచమితో ఈ పర్వదినాలు ప్రారంభమవుతాయి. ఈ వసంత పంచమిని శ్రీపంచమి అని కూడా అంటారు. ఈ ఏడాది జనవరి 23న వసంత పంచమి వచ్చింది. సాక్షాత్తూ చదువుల తల్లి సరస్వతీ దేవి ఈ రోజే జన్మించిందని చెబుతారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ దేవాలయాలు.. బాసర, వర్గిల్, విజయవాడలోని కనక దుర్గమ్మ దేవాలయాలకు భక్తులు పోటెత్తనున్నారు. ఈ రోజు చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే.. వారికి విద్యాబుద్ధులు వికసించి.. భవిషత్తులో ఉన్నత స్థానాలకు చేరతారంటారు. అందుకే ఈ రోజు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపుతారు.
తిథి ముహూర్తం..
పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది పంచమి తిథి జనవరి 23 శుక్రవారం తెల్లవారుజామున 2.28 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు అనగా.. జనవరి 24 శనివారం తెల్లవారుజామున 1.46 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయం తిథిని ప్రామాణికంగా తీసుకుంటారు కనుక.. జనవరి 23న వసంత పంచమి జరుపుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఆ రోజు ఉదయం 7:15 నుంచి మధ్యాహ్నం 12:33 గంటలలోపు సరస్వతీ పూజకు మంచి సమయమని భక్తులకు సూచిస్తున్నారు.
పురాణాల ప్రకారం.. బ్రహ్మదేవుడు యావత్ సృష్టికి వాక్కును అందించడానికి సరస్వతీ దేవిని ఈ రోజే.. వసంత పంచమి వేళ సృష్టించారని చెబుతారు. అందుకే ఈ మాఘ శుద్ధ పంచమి సరస్వతీ దేవి జన్మదినంగా పరిగణిస్తారు. విద్యార్థినీ విద్యార్థులతోపాటు సంగీత, సాహిత్య కళాకారులకు ఈ శ్రీ పంచమి గొప్ప పర్వదినమని అభివర్ణిస్తారు. ఆ క్రమంలోనే తమ చిన్నారులతో అమ్మవారి దేవాలయాలకు తల్లిదండ్రులు తరలివెళ్తారు.
ఈ వసంత పంచమి వేళ జరిపే పూజల్లో పసుపు వర్ణానికి అధిక ప్రాధాన్యమిస్తారు. పసుపు రంగు.. వసంతకాలం రాకకు సంకేతంగా భావిస్తారు. అలాగే మనలోని జ్ఞానానికి పసుపు వర్ణం సంకేతం. అందుకే ఈ రోజు సరస్వతీ దేవిని దర్శించుకునే భక్తులంతా పసుపు రంగు దుస్తులు ధరిస్తారు. అంతేకాకుండా ఈ రోజు పలు శుభకార్యాలకు అనుకూలమైన తిథి అని పండితులు వివరిస్తారు.
అమ్మవారికి నైవేద్యంగా..
అమ్మవారికి.. పసుపు రంగులో ఉండే కేసరి, పులిహోర, పసుపు రంగు స్వీట్స్ నైవేద్యంగా నివేదిస్తారు.
శుభ ఫలితాలు..
వసంత పంచమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం, స్తుతించడం వల్ల పలు శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయంటారు పండితులు. సరస్వతీ అమ్మవారిని పూజించే వారికి ఆ దేవీ ఆశీస్సులు మెండుగా లభిస్తాయట. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగి చదువులపై మనస్సు లగ్నం చేయగలుగుతారని పెద్దలు వివరిస్తారు.
దానం..
ఈ రోజు విద్యార్థులు.. పెన్నులు, పుస్తకాలు, పెన్సిళ్లు వంటివి తోటి విద్యార్థులకు కానుకగా ఇస్తారు. ఇలా చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుందని విశ్వసిస్తారు.
బాసరలో..
శ్రీ పంచమి సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాసరలో జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇవి మూడు రోజుల పాటు జరగనున్నాయి. వసంత పంచమి వేళ.. ఈ దేవాలయానికి తెలుగు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచీ భక్తులు భారీగా తరలి రానున్నారు. ఇందుకోసం ఆలయ ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సిద్ధిపేట జిల్లాలోని వర్గల్‌లో సరస్వతీ దేవి దేవాలయానికి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశముంది.
విజయవాడలో..
ఇందకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గమ్మ వారు ఈ వసంత పంచమి వేళ.. సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే విద్యార్థులకు అమ్మవారి ఉచిత దర్శనం ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు.
ఈ వార్తలు కూడా చదవండి..
అట్టహాసంగా నాగోబా జాతర ప్రారంభం..
మాఘమాసం ఎప్పుడు.. ఈ మాసంలో ఏం చేయాలి..
For More Devotional News And Telugu News