పండుగ రోజు యజమానికి షాక్.. ఎగిరిపోయిన రూ.80వేల చిలుక
ABN , Publish Date - Jan 23 , 2026 | 10:44 AM
ఆఫ్రికన్ గ్రే ప్యారట్స్ చాలా తెలివైనవి. చాలా చక్కగా మనుషుల్ని అనుకరించి మాట్లాడతాయి. వందల కొద్దీ పదాలను గుర్తు పెట్టుకోగల సామర్థ్యం వాటి సొంతం. అలాంటి ఓ పెంపుడు చిలుక ఇటీవల యజమానిని వదిలేసి ఎగిరిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: సంక్రాంతి పండుగ రోజున ఓ యజమానికి ఊహించని షాక్ తగిలింది. అతడు ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు చిలుక ఎగిరిపోయింది. 10 రోజులు గడుస్తున్నా అది ఇంటికి రాకపోవడంతో యజమాని బాధకు అంతులేకుండా పోయింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
కాట్రేనికోనలోని కొత్తపాలేనికి చెందిన బండారు దొరబాబు అనే యువకుడికి మూగజీవాలంటే ఎంతో ఇష్టం. అందుకే మూడేళ్ల క్రితం 80 వేల రూపాయలు పెట్టి హైదరాబాద్‌లో మాట్లాడే ఓ చిలుకను కొన్నాడు. దానికి 'చార్లీ' అని పేరు పెట్టి అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు. అది మనుషుల మాటలను అనుకరిస్తూ బాగా అల్లరి చేసేది. దొరబాబు దానితో సరదాగా గడిపేవాడు. సంక్రాంతి రోజున ఆ చిలుక పంజరం నుంచి బయటకు వెళ్లిపోయింది. మళ్లీ తిరిగి రాలేదు. దానికోసం ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో దొరబాబు పోలీస్ స్టేషన్‌లో చార్లీ మిస్సింగ్‌పై ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నాడు.
ఈ చిలుకలు చాలా తెలివైనవి..
బండారు దొరబాబు పెంచుకుంటున్న చిలుక ‘ఆఫ్రికన్ గ్రే ప్యారట్’ జాతికి చెందినది. ఈ జాతికి చెందిన చిలుకలు బాగా తెలివైనవి. చాలా చక్కగా మనుషుల్ని అనుకరించి మాట్లాడతాయి. వందల కొద్దీ పదాలను గుర్తు పెట్టుకోగల సామర్థ్యం వీటి సొంతం. ఏం మాట్లాడుతున్నాయో వాటికి అర్థంకాకపోయినా.. కొన్నిసార్లు అచ్చం మనుషుల్లా సంభాషించుకుంటాయి. బహిరంగ మార్కెట్‌లో వీటి ధర రూ.80 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు ఉంటుంది. డిమాండ్, మార్కెట్ ప్లేస్‌ను బట్టి ధరల్లో మార్పులుంటాయి.
ఇవి కూడా చదవండి
ఇవి మామూలు పంచ్‌లు కావుగా.. ట్రంప్‌ను టార్గెట్ చేసిన మస్క్