ఇవి మామూలు పంచ్‌లు కావుగా.. ట్రంప్‌ను టార్గెట్ చేసిన మస్క్
ABN , Publish Date - Jan 23 , 2026 | 10:21 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని శాంతిమండలిపై ఎలాన్ మస్క్ సెటైర్లు పేల్చారు. బోర్డ్ ఆప్ పీస్‌లో పీస్ అంటే శాంతి కాదని.. వివిధ దేశాల ముక్కలని తాను అనుకున్నట్టు వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై ఎలాన్ మస్క్ సెటైర్లు పేల్చారు. గురువారం దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరైన టెక్ ఆంత్రప్రెన్యూర్ మస్క్.. ట్రంప్‌పై సెటైర్లతో అక్కడి వారికి నవ్వు తెప్పించారు. గాజాలో శాంతిస్థాపన కోసం ట్రంప్ సారథ్యంలో ప్రారంభమైన శాంతిమండలి (బోర్డ్ ఆఫ్ పీస్) గురించి మస్క్ ప్రస్తావించారు. ‘ఈ మధ్య నేను బోర్డ్ ఆఫ్ పీస్ (శాంతి) గురించి విన్నాను. ఇక్కడ పీస్ (Peace) అంటే ముక్క (Piece) ఏమో. అంటే గ్రీన్ లాండ్‌లో కొంత ముక్క, వెనెజువెలాలో కొంత ముక్క.. ఇలా అన్నింట్లో కొంత ముక్క మాకు కావాలనే అర్థం ఉండొచ్చు’ అంటూ మస్క్ సెటైర్లు పేల్చడంతో అక్కడ జనాలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు.
ఈ సదర్భంగా మస్క్.. టెక్నాలజీ మొదలు భౌగోళిక రాజకీయాల వరకూ అనేక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. వాణిజ్య అడ్డంకులు తొలగిపోతే అమెరికాలో విద్యుత్ అవసరాలు మొత్తం సౌర విద్యుత్‌తో తీరిపోతాయని అన్నారు. సుంకాలే ఇందుకు ప్రధాన అడ్డంకి మారాయని చెప్పారు. టారిఫ్‌ల కారణంగానే సోలార్ ప్యానళ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయని, ఫలితంగా వీటి వినియోగం ఆశించిన మేర పెరగట్లేదని చెప్పుకొచ్చారు.
డ్రైవర్లకు సాయపడే టెస్లా కార్ల స్వయం చాలిత వ్యవస్థకు ఐరోపా, చైనాల్లో త్వరలో అనుమతి లభిస్తుందని తెలిపారు. మనుషుల తీరులో ఉండే రోబోల వినియోగం భవిష్యత్తులో విపరీతంగా పెరుగుతుందని, చివరకు సంఖ్యాపరంగా ఇవి మనుషులను మించిపోయి భారీ ఆర్థిక మార్పులకు దారి తీస్తాయని చెప్పారు. ప్రపంచంలో పేదరికాన్ని రూపుమాపి, అందరికీ ఉన్నతస్థాయి జీవన ప్రమాణాలు కల్పించేందుకు ఏఐ, రోబోటిక్స్ మాత్రమే మార్గాలని కూడా మస్క్ అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి:
అమెరికా వలసల శాఖ అధికారుల అదుపులో 5 ఏళ్ల చిన్నారి.. దేశవ్యాప్తంగా కలకలం
అమెజాన్‌లో 16వేల ఉద్యోగాల కోత?