తిరుమల బ్రహ్మోత్సవాలు.. స్వామివారిని దర్శించుకున్న 6.46 లక్షల మంది భక్తులు
ABN , Publish Date - Oct 20 , 2026 | 01:45 PM
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని, ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీపై కొందరు దుష్ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు.
తిరుపతి: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని, ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీపై కొందరు దుష్ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. చాలా మంది భయభ్రాంతులకు గురి కావడంతో ఆశించిన స్థాయిలో భక్తులు రాలేదన్నారు. అందుకే భక్తుల రద్దీ, హుండీ ఆదాయం తగ్గిందన్నారు.
బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులందరూ టీటీడీ చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారని బీఆర్ నాయుడు చెప్పుకొచ్చారు. వర్షాల వల్ల భక్తులకు కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయితే, వర్షాన్ని లెక్కచేయకుండా భక్తులు వాహన సేవలను దర్శించుకున్నారని తెలిపారు. మరోవైపు, విద్యుత్ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుందని పేర్కొన్నారు. తిరుపతి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి తిరుపతికి 10 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణించారని వెల్లడించారు. కళా ప్రదర్శనలకు భక్తుల నుంచి విశేష స్పందన లభించిందని ఆయన చెప్పారు.
త్వరలో ఎస్వీ మ్యూజియాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ చైర్మన్ వెల్లడించారు. మాడ వీధుల్లో జర్మన్ షెడ్లు వేసే అవకాశం లేదని, 60 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 5 లక్షల కట్ ఫ్లవర్స్‌తో విశేష అలంకరణలు చేశామని తెలిపారు. ఉత్సవాల 8 రోజుల్లో 6.46 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని ఆయన వెల్లడించారు. హుండీ ద్వారా రూ.25.79 కోట్ల ఆదాయం లభించిందని, 22.60 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశామని తెలిపారు. 2.44 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని, 34.34 లక్షల లడ్డూలు విక్రయించామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఢిల్లీలో రావణుడితో పాటు 30 అడుగుల కాక్రోచ్ దిష్టిబొమ్మ దహనం