Share News

శ్రావణమాసంలో రుద్రాభిషేకం.. ఏ రోజు మంచిదంటే.?

ABN , Publish Date - Aug 04 , 2026 | 09:24 PM

మరో వారం రోజుల్లో ఆషాఢం మాసం ముగిసిపోయి శ్రావణమాసం రానుంది. ఈ మాసంలో రుద్రాభిషేకానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. మరి ఏయే రోజులు ఈ అభిషేకానికి అనుకూలం? ఏ రోజున ఈ పూజ నిర్వహిస్తే ఎలాంటి ఫలితం పొందవచ్చనే విషయాలను తెలుసుకుందాం.

శ్రావణమాసంలో రుద్రాభిషేకం.. ఏ రోజు మంచిదంటే.?

ఇంటర్నెట్ డెస్క్: సనాతన ధర్మంలో పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన పూజల్లో రుద్రాభిషేకం ఒకటి. ఈ పూజను కొందరు భక్తులు ఆలయాల్లో, మరి ఇంట్లో నిర్వహిస్తుంటారు. రుద్రాభిషేకం చేయడం వల్ల జీవితంలోని ఆటంకాలు తొలగిపోయి, అనుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ముఖ్యంగా శివారాధనకు అంకితమైన శ్రావణ మాసంలో రుద్రాభిషేకానికి మరింత విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు.


శ్రావణ మాసంలో ప్రతి రోజూ రుద్రాభిషేకానికి శుభప్రదమేనని పండితులు తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని ప్రత్యేక తిథుల్లో ఈ పూజ చేయడం మరింత పుణ్యఫలాలను పొందవచ్చంటున్నారు.

శ్రావణ శివరాత్రి అత్యంత శుభప్రదం

ఈ ఏడాది ఆగస్టు 11న వచ్చే శ్రావణ శివరాత్రిని రుద్రాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజు పరమశివునికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తే విశేష అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.

ప్రదోష వ్రతాలకూ ప్రత్యేకత

శ్రావణ మాసంలో వచ్చే ప్రదోష వ్రతం(త్రయోదశి) రోజులు కూడా రుద్రాభిషేకానికి అత్యంత శుభప్రదమైనవిగా పరిగణిస్తారు. ఈ ఏడాది తొలి శ్రావణ ప్రదోషం ఆగస్టు 10న, రెండో ప్రదోషం ఆగస్టు 25న వస్తోంది.

శ్రావణ సోమవారాల విశిష్టత

పరమశివునికి అత్యంత ఇష్టమైన రోజుగా భావించే సోమవారం రోజున రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. 2026లో శ్రావణ సోమవారాలు ఆగస్టు 10, 17, 24 తేదీల్లో రానున్నాయి.

నాగపంచమి రోజున కూడా శుభమే

శ్రావణమాసం శుక్ల పంచమి తిథిన నిర్వహించుకునే నాగపంచమి కూడా రుద్రాభిషేకానికి అనుకూలమైన రోజుగా పండితులు సూచిస్తున్నారు. ఈ ఏడాది నాగపంచమి ఆగస్టు 17న రానుంది.

మొత్తమ్మీద శివుడు కైలాసంలో నందిపై పార్వతీదేవితో కలిసి ఉన్న కాలాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే శ్రావణ మాసమంతా శివారాధనకు అంకితమైన పవిత్ర కాలం కావడంతో.. ఈ నెలలో రుద్రాభిషేకం చేయడానికి ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరమేమీ లేదని పండితులు సూచిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో శ్రావణ మాసంలో ఏ రోజున రుద్రాభిషేకం నిర్వహించినా పరమశివుని అనుగ్రహం లభిస్తుందని పేర్కొంటున్నారు.


ఇవీ చదవండి:

పూజ గది శుభ్రం చేసే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు

Updated Date - Aug 04 , 2026 | 09:24 PM