మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Feb 15 , 2026 | 07:01 AM
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: మహా శివరాత్రిని పురస్కరించుకుని ఇరు తెలుగు రాష్ట్రాలలతో పాటు దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. నేడు తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, శివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవాలయాలు 'ఓం నమః శివాయ' నామస్మరణతో మార్మోగుతున్నాయి.
శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం నిమిత్తం పెద్దఎత్తున తరలివచ్చారు భక్తులు. ఈ తెల్లవారుజామున 2:30 నుంచే స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు క్యూకట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో కోలాహలంగా కనిపించింది. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా.. నేడు సాయంత్రం 5:00 గంటలకు శ్రీస్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. ఆ తర్వాత 7:00 గంటలకు జగద్గురు పీఠాధిపతి.. మల్లన్నకు అభిషేకం చేయనున్నారు. ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు నంది వాహనసేవ కార్యక్రమం జరగనుంది. రాత్రి 10:00 నుంచి 12:00 వరకు స్వామివారి ఆలయానికి పాగాలంకరణ చేయనున్నారు. ఈ సమయంలో విశేష అభిషేక కార్యక్రమాలు చేయనున్నారు అర్చకులు. దీంతో పాటు ఏకాదశ రుద్రాభిషేకాన్నీ నిర్వహించనున్నారు. అనంతరం అర్ధరాత్రి 12:00 గంటలకు స్వామి అమ్మవార్లకు వైభవంగా బ్రహ్మోత్సవ కల్యాణం జరపనున్నారు. మహా శివరాత్రిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న ప్రతి భక్తునికి 50 గ్రాముల లడ్డూ ప్రసాదం ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శైవ క్షేత్రాల్లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహానంది, యాగంటి, కాల్వబుగ్గ, ఓంకారం వంటి ప్రసిద్ధ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగిపోయింది. మహానంది, యాగంటి, కాల్వబుగ్గ కోనేర్లలో భక్తులు పున్య స్నానాలాచరించి తెల్లవారుజాము నుంచే దైవదర్శనం చేసుకుంటున్నారు. ఇక.. తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోనూ భక్తుల రద్దీ అమాంతం పెరిగిపోయింది. వేకువజాము నుంచే క్యూలైన్లలో భక్తులు బారులుతీరారు. ఈ సందర్భంగా.. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలతో సహా ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు అక్కడి ఆలయ అధికారులు.
వేములవాడలోనూ..
ఇక తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోనూ మహా శివరాత్రి వేడుకలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. దైవ దర్శనం కోసం సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనావేసిన ఆలయ అధికారులు.. అందుకు తగినట్టుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మరో ప్రముఖ శైవక్షేత్రమైన వరంగల్ వేయిస్తంభాల ఆలయంలోనూ భక్తుల కోలాహలం నెలకొంది. హనుమకొండ సిద్ధేశ్వరాలయం, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం, రామప్ప దేవాలయం, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కురవి వీరభద్రస్వామి ఆలయాల్లోనూ భక్తులు పోటెత్తారు. పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధికి ఉపాలయమైన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది.
పంచారామ క్షేత్రాలైన భీమవరం శ్రీ సోమేశ్వరస్వామి, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి, అమరావతి అమరేశ్వర స్వామి, సామర్లకోట(కాకినాడ)లోని కుమార భీమేశ్వర ఆలయం, ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాల్లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా పంచారామ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. కోటప్పకొండలోని త్రీకోటేశ్వరుని సన్నిధిలోనూ భక్తుల రద్దీ పెరిగిపోయింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగిపోయింది. దుర్గామల్లేశ్వరస్వామి దర్శనానికి పెద్దఎత్తున తరలివచ్చారు భక్తజనులు.
మహా శివరాత్రి సందర్భంగా.. రాజమండ్రి పుష్కర్ ఘాట్, కోటిలింగాల ఘాట్‌లో గోదావరి పుణ్య స్నానాల కోసం భక్తులు పోటెత్తారు. గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ధవలేశ్వరం నుంచి కాతేరు వరకు 11 స్నాన ఘట్టాలను ఏర్పాటుచేశారు అధికారులు. 2027 జూన్-జులైలో జరగనున్న గోదావరి పుష్కరాలకు ట్రయల్ రన్‌గా భావిస్తూ ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. సీసీటీవీ కెమరాల కమాండ్‌తో కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు.
ఇవీ చదవండి: