Share News

రారండోయ్‌.. వేడుక చూద్దాం..!

ABN , Publish Date - Feb 13 , 2026 | 10:22 AM

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మండలంలోని గూటిబైలు గ్రామం వద్ద తిమ్మమ్మ మర్రిమాను ఉంది. చెట్టు వద్దగల తిమ్మమాంబ ఘాట్‌లో ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు.

రారండోయ్‌.. వేడుక చూద్దాం..!

  • తిమ్మమ్మ మర్రిమాను వద్ద శివరాత్రి ఉత్సవాలు

  • ఈషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు

  • భక్తుల కోసం భారీగా ఏర్పాట్లు

నంబులపూలకుంట(అనందపురం): ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మండలంలోని గూటిబైలు గ్రామం వద్ద తిమ్మమ్మ మర్రిమాను ఉంది. చెట్టు వద్దగల తిమ్మమాంబ ఘాట్‌లో ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ఆధ్వర్యంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాతోపాటు కర్ణాటక, తమిళనాడు(Karnataka, Tamilnadu) నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.


pandu2.jpgమహాశివరాత్రి రోజున తిమ్మమాంబ సన్నిధిలో జాగరణ చేస్తే మేలు చేకూరుతుందని భక్తుల నమ్మకం. ఈనెల 14న రథోత్సవంతో అమ్మవారి ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజున ఈషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రథోత్సవం అంగరంగ వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 15న మహాశివరాత్రి సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. సాయంత్రం నుంచి తిమ్మమాంబ జీవిత చరిత్ర బుర్రకథ రూపంలో వినిపిస్తారు. శివనామ స్మరణ చేసేలా ఈషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. పలు నాటకాలు కూడా ప్రదర్శిస్తారు. శివతాండవం నాట్య ప్రదర్శన ఏర్పాటు చేస్తారు.


pandu2.3.jpgతిమ్మమాంబ జీవిత చరిత్ర

బుక్కపట్నం మండలంలోని చెన్నక్కగారి వెంకటరాయులు, మంగమాంబ దంపతుల కుమార్తె తిమ్మమాంబ. 1315లో జన్మించారు. ఆమెను నంబులపూలకుంట మండలంలోని గూటిబైలు గ్రామానికి చెందిన గంగరాజులవారి లక్ష్మమ్మ, రామయ్య దంపతుల కుమారుడు బాలవీరయ్యకు ఇచ్చి 1335లో వివాహం చేశారు. అనంతరం బాలవీరయ్యకు కుష్ఠు వ్యాధి సోకడంతో అతడిని గ్రామం నుంచి వెలివేశారు. గ్రామానికి దూరంగా ఉన్న చెరువువద్ద తిమ్మమాంబ.. భర్తకు సపర్యలు చేస్తూ ఐదేళ్లు జీవనం సాగించింది. బాలవీరయ్య 1355లో మృతిచెందారు.


తిమ్మమాంబ సతీసహగమనం చేయడానికి అప్పటి తనకల్లు మండలంలోని కొక్కంటి పాలెగాళ్లు తిరస్కరించారు. భర్త లేనిదే తాను జీవించలేననీ, సతీసహగమనం చేస్తానని పట్టుబట్టడంతో పాలెగాళ్లు ఒప్పుకున్నారు. ఆ సమయంలో చితికి నాలుగువైపులా ఎండు మర్రి కర్రలను నాటి, అగ్నిగుండంలోకి దిగి తిమ్మమాంబ సతీసహగమనం చేసింది. ఆమె నాటిన ఎండుమర్రి కర్ర నేడు మహావృక్షమైంది. తిమ్మమ్మ మర్రిమానుగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం తిమ్మమ్మ మర్రిమాను 8.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. సూర్యచంద్రులు ఉన్నంతకాలం తిమ్మమ్మ మర్రిమానుగా పూజలు అందుకుంటానని సతీసహగమన సమయలో తిమ్మమాంబ ప్రకటించినట్లు సమాచారం.


pandu2.4.jpgమర్రిమానును 1990లో అటవీశాఖకు అప్పగించారు. వృక్షం దినదినాభివృద్ధి చెందుతోంది. నిత్యం పర్యాటకులు వస్తున్నారు. మర్రికొమ్మ నాటిన ప్రాంతంలో తిమ్మమాంబ, బాలవీరయ్యకు ఆలయం నిర్మించి, పూజలు చేస్తున్నారు. వృక్షానికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. 2011లో కర్ణాటకకు చెందిన కైవారం ట్రస్టు చైర్మన్‌ ఎంఎస్‌ జయరాం సహకారంతో తిమ్మమాంబ ఆలయం నిర్మించారు. సంతానంకానివారు అమ్మవారికి ముడుపులు కట్టి, మొక్కులు చెల్లించుకుంటారు.


పర్యాటక ప్రదేశాలు

తిమ్మమాంబ, బాలవీరయ్య దర్శనానంతరం తిమ్మమాంబ సతీసహగనం చేసిన ప్రదేశంలో తిమ్మమ్మ ఘాట్‌, తిమ్మమ్మ కోట, శివప్రాజెక్టు, ఓబులదేవర గుట్టలో వెలసిన గణపతి, లక్ష్మీనరసింహస్వామి, కనకదుర్గమ్మ, కైవారం తాత, అయ్యప్పస్వామి, వెంకటేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి.


ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉత్సవాలు

తిమ్మమాంబ ఉత్సవాలను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఆలయంలో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మర్రిమాను ఉత్సవాలు ప్రపంచానికి చాటి చెప్పేలా నిర్వహించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారు. లక్షమందికిపైగా ఉత్సవాలకు హాజరవుతారని అంచనా. వారికి అన్ని వసతులు కల్పించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

632 మంది మీసేవా ఆపరేటర్లపై వేటు

నా గొంతు నొక్కేందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 13 , 2026 | 10:40 AM