Share News

632 మంది మీసేవా ఆపరేటర్లపై వేటు

ABN , Publish Date - Feb 13 , 2026 | 06:02 AM

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో ఇటీవల వెలుగులోకి వచ్చిన చలానాల కుంభకోణం నేపథ్యంలో దీనిపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించిన ప్రభుత్వం.. లోతైన విచారణ చేపట్టింది.

632 మంది మీసేవా ఆపరేటర్లపై వేటు

  • చలానా కుంభకోణంలో విచారణ వేగవంతం

  • ధరణిలో ఆడిటింగ్‌ లేకపోవడం వల్లే ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు సీసీఎల్‌ఏ గుర్తింపు

  • జిల్లాస్థాయి ఆడిట్‌ బృందాల ఏర్పాటు.. రోజువారీ ఆడిట్‌ చేయాలని కలెక్టర్లకు ఆదేశం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్ర జ్యోతి): వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో ఇటీవల వెలుగులోకి వచ్చిన చలానాల కుంభకోణం నేపథ్యంలో దీనిపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించిన ప్రభుత్వం.. లోతైన విచారణ చేపట్టింది. ధరణి, భూభారతి పోర్టళ్లలో చలానా అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించి ఇప్పటికే సంబంధిత వ్యక్తులపై 37 కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌ కార్యాలయాల్లో పని చేస్తున్న మీసేవా ఆపరేటర్లపై వేటు వేయాలని సీసీఎల్‌ఏ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ల కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు పద్ధతుల్లో పనిచేస్తున్న 632 మంది మీసేవా ఆపరేటర్లను తొలగించాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) డీఎస్‌ లోకేశ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు దశాబ్దాల క్రితం నియమించిన 302 మందితో పాటు రెండేళ్ల క్రితం నియమించిన మరో 330 మందితో కలిపి మొత్తం 632 మంది ఆపరేటర్లను విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) నుంచి జూనియర్‌ సహాయకుల నియామకం జరిగినందున వీరి సేవలు ఉపసంహరించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలగించిన వారి స్థానంలో జూనియర్‌ సహాయకుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. తహసీల్దార్ల కార్యాలయాల్లో టైపిస్టులుగా, కులధ్రువీకరణ పత్రాలు, ఇతర ధ్రువీకరణ పత్రాల నమోదు, జారీలో కాంట్రాక్టు ఉద్యోగులు కీలకంగా వ్యవహరించేవారు. దీర్ఘకాలం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఆపరేటర్లను ఉన్న ఫలంగా తొలగించడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ధరణి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆడిట్‌ లేకపోవడం వల్లే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని గుర్తించిన భూపరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) డీఎస్‌ లోకేశ్‌ కుమార్‌ జిల్లాస్థాయి ఆడిట్‌ బృందాలను ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌ కేంద్రంగా ఈ బృందాలు పని చేస్తాయి. ఆయా జిల్లాల పరిధిలో అన్ని తహసీల్దార్ల కార్యాలయాల్లో రోజువారీ జరిగే రిజిస్ట్రేషన్లను ఈ బృందాలు ఆడిట్‌ చేస్తాయి. ఎక్కడైనా లోపాలు జరిగినట్లు గుర్తిస్తే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి.. సంబంధిత తహసీల్దార్‌ను అప్రమత్తం చేస్తాయి. తహసీల్దార్లు సాయంత్రం వరకు జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పత్రాలను రోజువారీగా ఆడిట్‌ బృందాలకు పంపాల్సి ఉంటుంది. అలా పంపని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని సీసీఎల్‌ఏ హెచ్చరించారు. ఈ ఆడిట్‌ బృందాలను జిల్లాల అడిషనల్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు పర్యవేక్షిస్తారు. చలానాలు సక్రమంగా చెల్లించారా, సేల్‌డీడ్స్‌ చట్ట ప్రకారం చేశారా లేదా అని ఆడిట్‌ బృందాలు ప్రతిరోజూ తనిఖీ చేయాల్సి ఉంటుంది. అలాగే రోజువారీ కన్సాలిడేట్‌ నివేదికను సీసీఎల్‌ఏకు, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీకి పంపాల్సి ఉంటుంది. ఆడిట్‌ రిజిస్టర్‌ నిర్వహించి, అందులో రోజువారీ ఏ తరహా రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగాయి, వాటి వివరాలను నమోదు చేయాలని కూడా సీసీఎల్‌ఏ ఆదేశించారు.

Updated Date - Feb 13 , 2026 | 06:02 AM