నా గొంతు నొక్కేందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:41 AM
అసెంబ్లీలో తన గొంతు నొక్కేందుకే ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇవ్వడంలేదని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు.
అసెంబ్లీలో మాట్లాడే చాన్స్ లేనందునే మీడియాతో మాట్లాడుతున్నా: జగన్
‘కల్తీ నెయ్యి’తో వైసీపీకి సంబంధం లేదంటూ అవే అబద్ధాలు
అమరావతి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో తన గొంతు నొక్కేందుకే ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇవ్వడంలేదని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. సభలో ఏకైక ప్రతిపక్ష పార్టీ వైసీపీ అయినా ప్రభుత్వం గుర్తించడంలేదన్నారు. గురువారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబుతో సమానంగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశపూర్వకంగా తనకు హోదా ఇవ్వడం లేదని అన్నారు. బడ్జెట్‌పై అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాగొంతుకై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకూడదనే వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించలేదని ఆరోపించారు. అసెంబ్లీలో వైసీపీకి బలం తక్కువని, పార్టీ గొంతు వినపడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. శాసనసభలో గొంతెత్తి మాట్లాడే అవకాశం లేనందునే మీడియాతో బయట మాట్లాడుతున్నామని అన్నారు. శాసనమండలిలో బలం ఉన్నందున అక్కడ ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుదామని, ఎమ్మెల్సీలు సభలో గట్టిగా మాట్లాడాలని సూచించారు. కల్తీ నెయ్యి సరఫరాతో వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదని, తమ ప్రభుత్వ హయాంలో జరగలేదని, సీబీఐ చార్జిషీట్‌లోనూ ఇదే ఉందన్నారు. సీబీఐ చార్జిషీట్‌కు చంద్రబాబు సమాధానం చెప్పాలని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడులు, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర రెడ్డిపై దాడులు చేశారన్నారు. కాకాణి గోవర్ధనరెడ్డిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ఇవన్నీ చంద్రబాబు చేయించినవేనని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం స్కామ్‌ల మయమన్నారు.