Share News

శివరాత్రి రోజున చేయకూడని తప్పులు ఏంటో తెలుసా?

ABN , Publish Date - Feb 14 , 2026 | 08:42 PM

దేశ వ్యాప్తంగా హిందువులంతా ఆదివారం రోజున మహా శివరాత్రి పండుగను జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజు ఎవరైతే పరమశివుడుని భక్తితో ఆరాధిస్తారో వారి కోర్కెలు నెరవేరతాయని అంటారు. ఈ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని కొన్ని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

శివరాత్రి రోజున చేయకూడని తప్పులు ఏంటో తెలుసా?
Maha Shivaratri 2026

ఇంటర్నెట్ డెస్క్: హిందువులు ఆచరించే ముఖ్యమైన పండగల్లో మహా శివరాత్రి ఒకటి. పరమ శివుడికి అత్యంత ఇష్టమైన రోజు. ఈ రోజున భక్తులు ఉపవాసం, జాగరణలతో స్వామివారిని కొలుస్తారు. అయితే తెలీక చేసే కొన్ని పొరపాట్ల వల్ల పూజా ఫలం దక్కదని వేద పండితులు అంటున్నారు.. అవేంటో చూద్దాం.


1.పూజలో ఈ వస్తువులు వాడకండి:

పురాణాల ప్రకారం శివుడు మొగలి పువ్వును శపించాడు. అందుకే శివరాత్రి రోజు పూజలో ఈ పూలను వాడకూడదు. అలాగే శివలింగానికి తులసి ఆకులతో పూజ చేయకూడదు. శివుడికి కేవలం మారేడు దళాలు(బిల్వ పత్రాలు) అంటేనే ఇష్టం. లింగానికి పసుపు, కుంకుమలు అద్దకూడదు. కేవలం విభూతి మాత్రమే రాయాలి.

2. అభిషేకం చేసేటప్పుడు జాగ్రత్తలు:

విష్ణువు పూజలో శంఖం ముఖ్యం. కానీ, శివుడికి శంఖంతో అభిషేకం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. పాలు లేదా పెరుగుతో అభిషేకం చేసేటప్పుడు రాగి పాత్రను వాడకూడదు. రాగి పాత్రలో పాలు పోస్తే అవి విషతుల్యమవుతాయని అంటారు.

3. ఆహార నియమాలు (ఉపవాసం)

శివరాత్రి రోజున మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. పొరపాటున కూడా మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలను సేవించకూడదు.

4. ప్రదక్షిణలు చేసే విధానం:

శివలింగానికి పూర్తి ప్రదక్షిణలు చేయకూడదు. అభిషేకం తీర్థం బయటకు వెళ్లే దారిని (సోమసూత్రం) దాటకూడదు. అక్కడ వరకు వెల్లి మళ్లీ వెనక్కి తిరిగి ప్రదక్షణ పూర్తి చేయాలి. దీనినే ‘చండీ ప్రదక్షిణ’ అంటారు.

5. జాగరణ:

జాగరణ అంటే రాత్రంతా టీవీలు చూడటం, కబుర్లు చెప్పుకోవడం కాదు. మనసును శివుడిపై లగ్నం చేసి ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని స్మరించాలి. శివరాత్రి పవిత్రమైన రోజు. ఎవరినీ దూషించకూడదు, ఇంట్లో గొడవలు పడకూడదు. ప్రశాంతంగా శివ ధ్యానంలో ఉంటే ఎంతో పుణ్యం. మహా శివరాత్రి పర్వదినాన భక్తి శ్రద్ధలతో నియమాలు పాటిస్తూ శివుడి అనుగ్రహం పొందండి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!

అధిక బరువు సమస్యకు ఈ ఆహారంతో చెక్ పెట్టండి!

For More Latest News

Updated Date - Feb 14 , 2026 | 09:58 PM