కర్తరి ప్రారంభం.. ఈ సమయంలో ఏం చేయాలి.. ఏం చేయకూడదు?
ABN , Publish Date - May 11 , 2026 | 12:26 PM
హిందూ సంప్రదాయం ప్రకారం ఏదైనా శుభకార్యం చేయాలంటే ముందుగా మంచి ముహూర్తం చూసుకుంటారు. అంటే.. తిథి, వారంలో వచ్చే నక్షత్రాలను చూసుకుని ప్రారంభిస్తారు.
హిందూ సంప్రదాయం ప్రకారం ఏదైనా శుభకార్యం చేయాలంటే ముందుగా మంచి ముహూర్తం చూసుకుంటారు. అంటే.. తిథి, వారంలో వచ్చే నక్షత్రాలను చూసుకుని ప్రారంభిస్తారు. నేడు (సోమవారం, 11-5-2026) కర్తరి ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో కొన్ని రకాలైన శుభకార్యాలు నిషిద్ధమని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. అందులో డొల్లు కర్తరి, నిజ కర్తరి అని ఉంటాయి. అసలు డొల్లు కర్తరి, నిజ కర్తరి అంటే ఏమిటి? ఈ సమయంలో ఏం చేయవచ్చు? ఏం చేయకూడదనే విషయాన్ని పండితులు వివరిస్తున్నారు.
పంచాంగం ప్రకారం మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో భరణి, రోహిణి నక్షత్రాలు అగ్ని సంబంధించినవని చెబుతారు. నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. ఆయన భరణీ నక్షత్రం మూడో పాదంలోకి ప్రవేశించడంతో కర్తరి ప్రారంభమవుతుంది. ఇది వృషభ రాశిలో రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు ఉన్న కాలాన్ని కర్తరిగా వ్యవహరిస్తారు.
సూర్యుడు.. భరణీ నక్షత్రంలోని మూడు, నాలుగు పాదాలు, కృత్తిక నక్షత్రంలో 1,2,3,4 పాదాలు, రోహిణి నక్షత్రం 1వ పాదంలో సంచరించే కాలాన్ని కర్తరిగా పిలుస్తారు. సూర్యుడు భరణీ నక్షత్రం మూడో పాదంలోకి ప్రవేశించిన రోజుతో డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. దీనిని చిన్న కర్తరి అని కూడా అంటారు.
నేటి నుంచి నిజ కర్తరి.. ఎప్పటి వరకంటే..?
శ్రీ పరాభవ నామ సంవత్సరం మే 11వ తేదీ సోమవారం నుంచి నిజ కర్తరి ప్రారంభమైంది. ఇది మే29వ తేదీ శుక్రవారంతో ముగుస్తుంది. మొత్తం 26 రోజుల పాటు (11-05-2026 నుంచి 29-05-2026) ఈ నిజ కర్తరి ఉంటుంది. డొల్లు కర్తరి మే 4న ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 11వ తేదీతో ఇది పూర్తవుతుంది.
కర్తరిలో ఈ పనులు చేయకూడదు..
భూ సంబంధిత పనులు అంటే.. భూమి తవ్వడం, చెట్టు నాటడం, బావులు, చెరువులు తవ్వడం వంటివి చేయకూడదు. అలాగే ఇంటికి కప్పు వేయడం, గుమ్మాలు పెట్టడం, ఇల్లు, ఫ్యాక్టరీల నిర్మాణాలకు శంకుస్థాపన, భూమి పూజ చేయడం, గృహప్రవేశం, నూతన వ్యాపారాలు, ప్రాజెక్టులు ప్రారంభించడం చేయరాదు. కొత్త వాహనాలు కొనుగోలు చేయడం వంటివి కూడా చేయకూడదు. అలాగే తీర్థ యాత్రలు కూడా ప్రారంభించ రాదు. అత్యవసరం కాకుంటే.. మేజర్ ఆపరేషన్లు కూడా వాయిదా వేయాలని జోతిష్య శాస్త్ర పండితులు సూచిస్తున్నారు.
కర్తరిలో ఇవి చేయవచ్చు..
చిన్న పిల్లలకు నామకరణ, బారసాల, అన్నప్రాశన, నక్షత్ర హోమం వంటివి చేయవచ్చని సూచిస్తున్నారు. అగ్ని స్వభావం అధికంగా ఉండే నక్షత్రాల్లో ఈ కర్తరి ఏర్పడుంది. ఈ సమయంలో వేసవి వేడి, ఉష్ణ తాపం అధికంగా ఉంటుంది. ఈ సమయంలో వేడి తగ్గించమని సూర్య భగవానుడిని ప్రార్థించాలి. అలాగే ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. సూర్యాష్టకం చదవాలి. సూర్య భగవానుడి ద్వాదశ నామాలు ప్రతి నిత్యం పఠించడం మంచిదని పేర్కొంటున్నారు. ఉదయం వేళ సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
ముఖ్య గమనిక.. పైన తెలిపిన వివరాలు పలువురు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి. వీటికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఎటువంటి సంబంధం లేదని గమనించాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
శుభలేఖ పంపితే...ఇంటికే ‘శ్రీవారి అక్షింతలు’
ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా ఈ నెల 18న విడుదల
For More Devotional News And Telugu News