Share News

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ సరస్వతీ దేవాలయాలు.. ఎక్కడున్నాయంటే?

ABN , Publish Date - Jan 23 , 2026 | 01:11 PM

వసంత పంచమి వేళ.. తెలుగు రాష్ట్రాల్లోని సరస్వతీ దేవి ఆలయాలకు భక్తులు భారీగా పోటెత్తారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సరస్వతీ దేవి దేవాలయాల గురించి ఓసారి పరిశీలిస్తే...

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ సరస్వతీ దేవాలయాలు.. ఎక్కడున్నాయంటే?

హైదరాబాద్/ అమరావతి, జనవరి 23: చదువుల తల్లి సరస్వతీ దేవి పుట్టిన రోజు వసంత పంచమి ఈ రోజు. దీనినే శ్రీపంచమి అని కూడా అంటారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని సరస్వతీ దేవి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ వసంత పంచమి వేళ.. సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. జమ్ము కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సరస్వతీ దేవికి అనేక ఆలయాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో.. తెలంగాణలో నాలుగు ప్రముఖ సరస్వతీ దేవి ఆలయాలుండగా.. ఏపీలోని కర్నూలు జిల్లాలో కొలను భారతీ ఆలయం ఒకటుంది.


బాసర..

Basara-1.jpg

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దక్షిణ భారతదేశంలో బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలో కొలువు దీరిన జ్ఞాన సరస్వతీ దేవిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తారు. గోదావరి నదీ ఒడ్డున ఉన్న ఈ క్షేత్రంలో వసంత పంచమి ఉత్సవాలు పెద్దఎత్తున జరుగుతాయి. హైదరాబాద్ నుంచి బాసరకు నేరుగా బస్సు, రైలు సౌకర్యం ఉంది. రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే అమ్మవారి ఆలయం ఉంటుంది.


వర్గల్..

Vargal.jpg

సిద్దిపేట జిల్లా వర్గల్‌లో విద్యా సరస్వతీ దేవాలయం ఉంది. ఈ ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. కొండపై ఉన్న ఈ ఆలయం.. బాసర తర్వాత తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన సరస్వతీ దేవాలయం. ఈ ఆలయాన్ని శ్రీ విద్యా సరస్వతీ దేవాలయమని కూడా పిలుస్తారు. హైదరాబాద్ నుంచి మేడ్చల్, తూప్రాన్ మీదుగా వర్గల్‌కు చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.


అనంతసాగర్..

anatha-sagar.jpg

సిద్దిపేట జిల్లాలోనే మరో సరస్వతీ దేవి ఆలయం ఉంది. చిన్నకోడూరు మండలం అనంతసాగర్ క్షేత్రంలో సరస్వతీ అమ్మవారు కొలువయ్యారు. సాధారణంగా సరస్వతీ దేవి కమలంపై ప్రశాంతంగా కూర్చుని దర్శనమిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం నిల్చున్న వీణాపాణిగా కొలువై ఉంటారు అమ్మవారు. ఈ ఆలయానికి వెళ్లాలంటే.. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు వెళ్లే దారిలో శనిగరం వద్ద దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతసాగర్ ఆలయానికి చేరుకోవచ్చు. సిద్ధిపేట జిల్లా కేంద్రం నుంచి బస్సు, ఆటో సౌకర్యం ఉంటుంది.


ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్..

OU-Campus.jpg

హైదరాబాద్ మహానగరం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ సమీపంలో శృంగేరి పీఠం ఆధ్వర్యంలో సరస్వతీ దేవి ఆలయం ఉంది. దేవాలయంలోని అమ్మవారిని దర్శించుకునేందుకు నగరం నలుమూలల నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి భక్తులు తరలివస్తారు. ఉస్మానియా యూనివర్సిటీకి రవాణా సదుపాయం కలదు.


కొలను భారతీలో..

Kolanu-Bharathi.jpg

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కొలను భారతీ(సరస్వతీ) దేవాలయం ఉంది. ఇది ఆత్మకూరుకు 20 కిలోమీటర్లు, కర్నూలుకు 130 కిలోమీటర్లు, నంద్యాలకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు.. భక్తులంతా బాసరకు వెళ్లి తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేవారు. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత పలువురు కొలను భారతికి వెళ్తున్నారు.


ఇక కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం(బందరు)లోని హిందూ కాలేజీలోని హైస్కూల్ ప్రాంగణంలో సరస్వతీ దేవాలయం ఉంది. వసంత పంచమి రోజు.. ఈ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వసంత పంచమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి.?

ఈ రోజే వసంత పంచమి.. ఈ విషయాలు తెలుసా?

For More AP News And TG News

Updated Date - Jan 23 , 2026 | 01:54 PM