అంతా 4 సెకన్లలోనే..
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:48 AM
అది చిత్తూరు నగరంలోని ఇరువారం సర్కిల్. కంటైనరు లారీకి అడ్డంగా శుక్రవారం ఉదయం 8.13.51 గంటలకు ద్విచక్ర వాహనం వచ్చింది. అప్పట్నుంచి నాలుగు సెకన్ల వ్యవధిలోనే ప్రమాదం జరిగిపోయింది.
ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పిన కంటైనరు లారీ
కారుపై పడటంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
ఇరువారం క్రాస్ వద్ద ఘోర ప్రమాదం
చిత్తూరు: అది చిత్తూరు నగరంలోని ఇరువారం సర్కిల్. కంటైనరు లారీకి అడ్డంగా శుక్రవారం ఉదయం 8.13.51 గంటలకు ద్విచక్ర వాహనం వచ్చింది. అప్పట్నుంచి నాలుగు సెకన్ల వ్యవధిలోనే ప్రమాదం జరిగిపోయింది. ఈ ఘటనలో బెంగళూరు(Bangalore) విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న గుడిపాల మండలం రామాపురానికి చెందిన దయానందం కుమారుడు అనుదీపక్(33) మృతిచెందారు.
బెంగళూరు నుంచి శుక్రవారం ఉదయం 5.30 గంటలకు సొంతూరుకు బయలుదేరిన ఈయన ఇల్లు చేరకుండానే అసువులు బాశారు. ఇరువారం వద్ద వేగంగా వస్తున్న కంటైనరు లారీ.. ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి కుడివైపు కారుపై పడింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. స్థానికుల సమాచారంతో ట్రాఫిక్ సీఐ నిత్యబాబు, రెండో పట్టణ సీఐ నెట్టికంఠయ్య, యాదమరి ఎస్‌ఐ ఈశ్వరయ్య తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
జేసీబీ సాయంతో కంటైనర్‌ను పక్కకు తొలగించి కారులోనే నలిగిపోయిన అనుదీప్ కోసం తీవ్రంగా ప్రయత్నించి బయటకు తీశారు. అప్పటికే ఆయన మృతిచెందారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కంటైనర్ లారీ డ్రైవర్.. హైవేలో కంటైనర్ లారీని గుర్తించకుండా నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారణమైన చంద్రన్‌పైనా ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద స్థలాన్ని డీటీసీ తదితరులు పరిశీలించారు.
పెద్ద శబ్దంతో భయాందోళన
ప్రమాద సమయంలో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొద్ది క్షణాల వరకు అక్కడేం జరిగిందో ఎవరికీ అర్థంకాలేదు. ఆ తర్వాత వచ్చిన పోలీసులు అరగంటలో ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కాగా, మూడు నెలల క్రితం బెంగళూరు నుంచి వేగంగా వచ్చిన లారీ ఎదురుగా వాహనాన్ని తప్పించపోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోగా... 60 అడుగుల విద్యుత్ స్తంభం నేలకొరిగింది.
ఫ్లై ఓవర్ నిర్మిస్తేనే..
చిత్తూరు, పలమనేరు, చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల నుంచీ యాదమరి మీదుగా పరదరామి, గుడియాత్తం మీదుగా వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. చిత్తూరులోని స్కూల్స్, కాలేజీలకు పదుల సంఖ్యలో వ్యాన్లు వచ్చి వెళుతుంటాయి. ఇక్కడి వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఫ్లైఓవర్‌ను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక, ఈ హైవేపై నాలుగు రోడ్లను సూచించే సూచికబోర్డులు లేవు. హైవేపై గ్రామాలున్న చోట్ల రంబుల్ స్టిక్స్ అనే రబ్బరుతో కూడిన స్పీడు బ్రేకర్లను రోడ్డుపై అమర్చుతారు. ఇవి వాహనాల వేగాన్ని కొంత వరకు తగ్గిస్తాయి. ఇలాంటి ప్రమాద నివారణ పనులను హైవే అధికారులు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగు
అల్లు వారి.. పెళ్లి పనులు షురూ
Read Latest Telangana News and National News