విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగు
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:07 AM
రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగులు తీస్తోందని బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు అన్నారు.
వైసీపీ డెమోక్రసీని డీగ్రేడ్ చేసింది
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన విష్ణుకుమార్ రాజు
రాష్ట్రంలో బూతుల నివారణకు ప్రత్యేక చట్టం తేవాలి: సోమిరెడ్డి
అమరావతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగులు తీస్తోందని బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు అన్నారు. శుక్రవారం అసెంబ్లీల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపైౖ ఆయన మాట్లాడారు. ‘జగన్ పాలనలో అసెంబ్లీలో బూతులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని డీగ్రేడ్ చేశారు. గత పాలకుల అరాచకాలకు, బెదిరింపులకు పరిశ్రమలు వెళ్లిపొయాయి. వికృత రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని అత్యంత అద్భతమైన విధానంతో అభివృద్ధి పథంలోకి సీఎం చంద్రబాబు తీసుకువెళ్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు ప్రధాని మోదీని ఒప్పించి నిధులు తెస్తూ ఏపీ పురోభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు. గవర్నర్‌ను, సభలోని సభ్యుల్ని, ఏపీ ప్రజల్ని వైసీపీ అగౌరవపరిచింది. వైసీపీ విధానాన్ని బీజేపీ తరఫున ఖండిస్తున్నా. లిక్కర్‌తో పాటు శ్రీవారి లడ్డూనూ కల్తీ చేశారు. ఆలయాల్ని ధ్వంసం చేశారు. ఇలాంటి పరిస్థితి నుంచి సూపర్ ఫాస్ట్‌గా సూపర్ సిక్స్ అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ రూ.43 కోట్ల విలువైన ఫ్రీ బస్సు సౌకర్యాన్ని మహిళలు ఉపయోగించుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా విశాఖలో అభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గవర్నర్ తన ప్రసంగం ద్వారా సుస్పష్టంగా తెలియజేశారు. గవర్నర్‌కు మా పార్టీ తరఫున ధన్యవాదాలు’ అని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ... ‘అధికారంలో ఉన్నప్పుడు పాలన ఎలా చేయకూడదో చూపించిన వైసీపీ... ఇప్పుడు ప్రతిపక్షం ఎలా ఉండకూడదో చూపిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు బూతులు, తల్లిదండ్రులను కించపరిచేలా మాట్లాడుతున్నారు. అలాంటి వారిని కట్టడి చేయడానికి ప్రస్తుత పరిస్థితిలో ప్రత్యేక చట్టం అవసరం. ఆ చట్టం కింద కేసు నమోదైతే బెయిల్ రాకుండా ఉండేలా నిబంధనలను పొందుపరచాలని స్పీకర్‌ను కోరుతున్నా’ అని అన్నారు.
సభలోకి మూడు బిల్లులు
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో మంత్రులు మూడు బిల్లులు ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టానికి రెండు సవరణలను ప్రతిపాదిస్తూ రెండు బిల్లులను మంత్రి నారాయణ స్థానంలో పరిశ్రమల మంత్రి టీజీ భరత్ సభలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లును మంత్రి గొట్టిపాటి రవి ప్రవేశపెట్టారు.