Share News

అడవి దారిలో మృగం.. కనిపిస్తే దోపిడీ, అత్యాచారం

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:05 PM

అడవి దారిలో క్రూర మృగాలు ఉంటాయి. వాటికి ఆపద కలిగించినా, ఆకలి వేసినా దాడి చేస్తాయి. కానీ ఆ అడవి మార్గంలో మృగానికి మించిన క్రూరత్వం ఉన్న మనిషి సంచరిస్తుంటాడు. ఎవరు కనిపించినా అటకాయించి దోచుకుంటాడు.

అడవి దారిలో మృగం.. కనిపిస్తే దోపిడీ, అత్యాచారం

  • చోరీలకు వెళ్లినప్పుడూ అఘాయిత్యాలు

  • ‘పురం’ దండుపాళ్యం బ్యాచ్‌కు నాయకుడు

  • చిన్నప్పటి నుంచే కావాడి నాగేంద్ర నేరాల బాట

హిందూపురం(అనంతపురం): అడవి దారిలో క్రూర మృగాలు ఉంటాయి. వాటికి ఆపద కలిగించినా, ఆకలి వేసినా దాడి చేస్తాయి. కానీ ఆ అడవి మార్గంలో మృగానికి మించిన క్రూరత్వం ఉన్న మనిషి సంచరిస్తుంటాడు. ఎవరు కనిపించినా అటకాయించి దోచుకుంటాడు. వారిలో మహిళలు ఉంటే లాక్కెళ్లి అత్యాచారం చేస్తాడు. ఏకాంతం కోసం వెళ్లిన ప్రేమ జంటలను టార్గెట్‌ చేస్తాడు. యువతులపై అత్యాచారం చేసి, వీడియోలు తీస్తాడు. బయటకు చెబితే చంపేస్తానని బెదిరిస్తాడు. కరుడుగట్టిన నేరస్థుడిగా పోలీసు రికార్డుల్లో ఉన్నాడు. ఏపీ, కర్ణాటకలో పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. అతడి పేరు ఎరుకుల కావాడి నాగేంద్ర. రోబో, నాగ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. ఈ మృగానికి అడ్డా.. చిలమత్తూరు మండలంలోని ఎర్రకొండ అటవీ ప్రాంతం. ఇక్కడి పూజారి గుట్ట వద్ద తిష్టవేసి.. మనుషులను వేటాడుతుంటాడు.


zzz.jfif

సీఐ, కానిస్టేబుల్‌కు కత్తిపోట్లు

చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లి సమీపంలో వాచ్‌మన్‌ కుటుంబంపై దాడి చేసి, అత్తాకోడళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కావాడి నాగేంద్ర ప్రధాన నిందితుడు. బెయిల్‌పై బయటకు వచ్చాక కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. పట్టుకునేందుకు వెళ్లిన హిందూపురం అప్‌గ్రేడ్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్‌ రవిని శుక్రవారం కత్తితో పొడిచాడు. సీఐ కాల్పులు జరిపి నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు.


pandu1.3.jfifదుర్గా బంధువు

దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు చేస్తూ ప్రజలను హడలెత్తిస్తున్న కావాడి నాగేంద్ర.. దక్షిణాది రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటెడ్‌గా పోలీస్‌ రికార్డులకు ఎక్కిన ఎరికల దుర్గాప్రసాద్‌ అలియాస్‌ దుర్గాకు సమీప బంధువు. దుర్గా తరహాలోనే చిన్నప్పటి నుంచి నేరాలకు పాల్పడుతున్నాడు. ఉమ్మడి జిల్లాతో పాటు కర్ణాటకలో దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలకు పాల్పడ్డాడు. నాగేంద్రపై 38 ఏళ్ల వయసుకే 70కి పైగా కేసులు ఉన్నాయి. పోలీసులపై శుక్రవారం తిరగబడ్డ ప్రాంతం ఇతని అడ్డా. ఆ దారిలో వెళుతున్న దంపతులను అడ్డగించి, భర్తల ముందే భార్యలపై అత్యాచారాలకు ఒడిగట్టాడు. బయట చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఒంటరిగా వెళుతున్న మహిళల వద్ద బంగారం ఆభరణాలను లాక్కుని, అత్యాచారానికి పాల్పడ్డాడు.


ప్రేమ జంటలే టార్గెట్‌

హిందూపురం, గోరంట్ల, మడకశిర ప్రాంతాల్లో ప్రేమ జంటలను కావాడి నాగేంద్ర టార్గెట్‌ చేశాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో వెళ్లి, ప్రియుడి ముందే ప్రియురాలిని అత్యాచారం చేశాడు. ఇవన్నీ పోలీసుల విచారణలో గతంలో వెల్లడయ్యాయి. మహిళలను లాక్కెల్లి అఘాయిత్యాలకు పాల్పడిన సమయంలో, అతనితో ఉన్నవా రు వీడియోలు తీస్తూ పై శాచిక ఆనందం పొందేవారు. ఎవరికైనా చెబితే వీడియోలు బయటపెడతామని, ఇళ్లకే వచ్చి అంతమొందిస్తామని బెదిరించేవాడు. ముఠాతో ఇళ్లలో చోరీలకు వెళ్లినప్పు డు కూడా మహిళలపై అ ఘాయిత్యాలకు పాల్పడేవాడు. గంజాయి మత్తులో ఉన్నప్పుడు వయసుతో సంబంధం లేకుండా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం నాగేంద్ర, అతని గ్యాంగ్‌కి అలవాటు.


pandu1.2.jpgపోలీసులపై దాడులు

మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ ఎరుకల దుర్గా.. హిందూపురం ప్రాంతం, చిత్తూరు జిల్లాలో తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసుల కళ్లలో కారం కొట్టి, కత్తులతో దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. దుర్గా బాటలోనే నాగేంద్ర కూడా వెళుతున్నాడు. సీఐ, కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేయడం దీనికి నిదర్శనం. హిందూపురంలో ఉన్న ‘దండుపాళ్యం’ బ్యాచ్‌కు కావాడి నాగేంద్ర లీడర్‌ అని పోలీసులు అంటున్నారు. ఇతనికి వావి వరుసలు ఉండవని, దొరికింది దోచుకోవడం, అడ్డం వస్తే దాడిచేయడం, అత్యాచారం చేయడం పరిపాటిగా మారిపోయిందని అంటున్నారు. ఈజీ మనీ కోసం మొదట దొంగతనాలు, ఆ తరువాత దోపిడీలు చేయడం ప్రారంభించాడని, వయసుకి వచ్చాక అత్యాచారాలు చేయడం కూడా అలవాటైందని పోలీసులు అంటున్నారు.


ఆత్మరక్షణ కోసమే కాల్పులు:

- ఎస్పీ సతీష్‌ కుమార్‌

‘మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ కావాడి నాగేంద్రను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడి చేశాడు. ఆత్మరక్షణ కోసం సీఐ కాల్పులు జరిపారు’ అని ఎస్పీ సతీష్‌ కుమార్‌ అన్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్‌ రవిని ఆయన పరామర్శించారు. నాగేంద్రపై రెండు రాష్ట్రాల్లో 70కి పైగా కేసులు ఉన్నాయని తెలిపారు. గ్యాంగ్‌ రేప్‌ కేసులో కోర్టు వాయిదాలకు వెళ్లకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని అన్నారు. హిందూపురం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గంజాయి కేసులో కూడా పరారీలో ఉన్నాడని, అందుకే నిఘా వేసి ఉంచామని తెలిపారు. అతనిని పట్టుకునేందుకు శుక్రవారం ఉదయం వెళ్లిన కానిస్టేబుల్‌ రవిపై కత్తితో దాడి చేసి పారిపోయాడని, అడవిలో గాలిస్తున్న సమయంలో సీఐ ఆంజనేయులపై కత్తితో దాడి చేశాడని తెలిపారు. అందుకే కాల్పులు జరిపి అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. చట్టాన్ని అతిక్రమించి, పోలీసులపై తిరగబడిన నాగేంద్రకు కఠిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

కేంద్రంపై పిచ్చి ప్రేలాపనలు మానుకో.. సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి వార్నింగ్

ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజల కలకలం

Read Latest Telangana News and National News

Updated Date - Feb 07 , 2026 | 12:05 PM