పబ్‌ల్లో డ్రగ్స్..! మరోసారి వార్తల్లోకి..
ABN , Publish Date - Apr 04 , 2026 | 10:39 AM
రాష్ట్రంతోపాటు హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ నగరంగా తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (ఈగల్) విభాగాన్ని ఏర్పాటు చేసింది.
ఒకే పబ్‌లో ఐదు నెలల్లో 16 మందికి డ్రగ్స్ పాజిటివ్
అటకెక్కిన పోలీసుల స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్ సిటీ: రాష్ట్రంతోపాటు హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ నగరంగా తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (ఈగల్) విభాగాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్‌తోపాటు సిటీలో హెచ్ న్యూ, ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగి డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ స్మగ్లర్స్‌ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెడుతున్నారు. అయినా మాదక ద్రవ్యాల సరఫరాకు అడ్డుకట్ట పడటంలేదు.
పార్టీలు, ఈవెంట్ల పేరుతో పబ్‌లు, ఫామ్‌హౌజ్‌లు, ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ సమకూర్చుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కొండాపూర్‌లోని క్వాక్ ఎరీనా పబ్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో డ్రగ్స్ వినియోగించినట్లు సమాచారం అందడంతో ఈగల్ అధికారులు, గచ్చిబౌలి పోలీసులు దాడి చేశారు. 64 మందిని అదుపులోకి తీసుకొని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు.
డ్రగ్స్ తీసుకున్న వారిలో ఏపీ క్యాడర్‌కు చెందిన ఒక మహిళా ఐఏఎస్ కొడుకు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతేడాది డిసెంబర్‌లోనూ ఇదే పబ్‌పై దాడులు చేసిన ఈగల్ పోలీసులు 14 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్ వచ్చింది. 5 నెలల వ్యవధిలోనే ఒకే పబ్‌పై రెండుసార్లు పోలీసులు దాడి చేయడం, ప్రతిసారి 8 మంది చొప్పున డ్రగ్స్ వినియోగించినట్లు పరీక్షల్లో తేలడం చర్చనీయాంశంగా మారింది.
అందమైన యువతులతో..
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా నిర్వహించాల్సిన పబ్‌లు.. పాశ్చాత్య కల్చర్ మోజులో పడి గబ్బులేపుతున్నాయి. కొంతమంది నిర్వాహకులు అడ్డదారిలో డబ్బు సంపాదించడానికి వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన అందమైన యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు.
మూణ్నాళ్ల ముచ్చటగా వీకెండ్ స్పెషల్ డ్రైవ్
డ్రగ్స్ నియంత్రణలో భాగంగా పబ్‌లు, క్లబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లలో వారంతాల్లో టీన్యాబ్, టాస్క్‌ఫోర్స్, హెచ్ న్యూ, ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేక టీమ్‌లుగా ఏర్పడి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. కొద్దిరోజుల క్రితం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి హల్‌చల్ చేశారు. ఆ తర్వాత కిమ్మనడకుండా ఉన్నారు. అధికారులు మామూళ్లకు అలవాటు పడడంతోనే ఈ స్పెషల్ డ్రైవ్ మూణ్నాళ్ల ముచ్చటగానే మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో కొందరు పబ్ నిర్వాహకులు అక్రమ దందాకు తెరలేపారు. వారంలో ఐదు రోజులు అర్ధరాత్రి 12 గంటల వరకు, వీకెండ్‌లో అర్ధరాత్రి 1 గంట వరకు పబ్‌లు నడుపుకునేలా నిబంధనలు ఉన్నాయి. కానీ చాలా ప్రాంతాల్లో వీటిని తుంగలో తొక్కినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
కేబీఆర్ పార్కు చుట్టూ వన్‌వే..
Read Latest Telangana News and National News