Ananthapuram News: గురువుగారి పాడు పని... విద్యార్థిని ఇంటికే వెళ్లి అఘాయిత్యం
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:41 AM
విద్యాబుద్దులు నేర్పి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదాద్దాల్సిన గురువులే పెడదోవ పడుతున్నారు. ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని ఇంటికే వెళ్లి అఘాయిత్యానికి పాల్పడబోయాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- స్థానికులకు అడ్డంగా దొరకడంతో దేహశుద్ధి
- పెద్దపప్పూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన
అనంతపురం: ఓ గురువుగారి అనుచిత వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. నాలుగు రోజుల కిందట ఓ విద్యార్థిని ఇంటికి వెళ్లి అఘాయిత్యం చేయబోయాడు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అధికార యంత్రాంగానికి తెలిసినా, ఫిర్యాదురాలేదని మిన్నకుండిపోయింది. ఈ పాడు పని ఆనోటా, ఈనోటా అందరికి తెలిసింది. పెద్దపప్పూరు మండలంలోని ఓ జడ్పీ ఉన్నతపాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు ఆ పాఠశాల విద్యార్థినిపై కన్నేశాడు. మాయ మాటలతో విద్యార్థినిని ట్రాప్ చేశాడు. బాలిక ఇంట్లో ఎవరెవరు ఏ సమయంలో ఉంటారో ఆమె ద్వారా ఆరా తీశాడు.
తల్లిదండ్రులు ఉదయమే పనులకు వెళ్తారని, ఇంట్లో ఎవరూ ఉండరని బాలిక ద్వారా తెలుసుకున్నాడు. దీంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం నాలుగు రోజుల కిందట విద్యార్థిని ఇంటికి ఉదయం 8 గంటలలోపే వెళ్లాడు. బాలికతో అనుచితంగా ప్రవర్తిస్తుండగా, పనికి వెళ్లిన విద్యార్థిని తండ్రి ఇంట్లోకి వచ్చాడు. అక్కడి దృశ్యాన్ని చూసి గట్టిగా కేకలు వేశాడు. గురువుగారు పారిపోతుండగా.. చుట్టు పక్కలు వారు వచ్చి పట్టుకొని దేహశుద్ధి చేశారు.

దుప్పటి పంచాయితీ?
కీచక టీచర్ తాను చేసిన పాడు పని బయటకు పొక్కకుండా పెద్దమనుషులను రంగంలోకి దించినట్లు సమాచారం. వారు వెంటనే రంగంలోకి దిగి ‘ఆడపిల్లకు ఇలాంటివి బయట పెడితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి’ అని భయపెట్టి కేసుల వరకు లేకుండా వెళ్లకుండా చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో దాదాపు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు చేతులు మారాయనే చర్చ సాగుతోంది.
ఘటన వాస్తవమే..
పెద్దపప్పూరు మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న గణితం ఉపాధ్యాయుడి పాడు పని వాస్తవమే. ఘటన జరిగిన రోజే ఎవరో మాకు ఫోన్ చేసి విద్యార్థినితో ఉండగా పట్టుకొని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసినట్లు తెలిపారు. నేను వెంటనే ఆ మండలం ఎంఈవోకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకొని వాస్తవ నివేదిక ఇవ్వాలని కోరగా, ఆయన జరిగిన విషయం చెప్పారు. అయితే ఎవరూ అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. కేసు నమోదు కాలేదు. అయినా అలాంటి పని చేయడం దుర్మార్గం. ఎంఈఓ నివేదిక వచ్చిన వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
- ప్రసాద్‌బాబు, డీఈవో
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రతి ఏటా పోలీస్ రిక్రూట్‌మెంట్
Read Latest Telangana News and National News