రూ.2 వేలకుపైగా యూపీఐ పేమెంట్స్‌కు ఛార్జీలు?.. వారికి మినహాయింపు!
ABN , Publish Date - Jul 18 , 2026 | 10:57 AM
దేశంలో డిజిటల్ చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రూ.2 వేలకుపైగా జరిగే యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ను అమలుచేసే దిశగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో డిజిటల్ చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రూ.2 వేలకుపైగా జరిగే యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు(MDR)ను మళ్లీ అమలు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది ఆమోదం పొందితే.. అర్హత ఉన్న లావాదేవీలపై వ్యాపారులు గరిష్ఠంగా 0.5 శాతం వరకు ఎండీఆర్ చెల్లించాల్సి రావచ్చు. దీనిపై వచ్చే నెలలో తుది నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి.
అయితే.. చిరు వ్యాపారులకు ఈ ప్రతిపాదనలో ఊరట కలిగించే అవకాశముంది. ఆన్యువల్ టర్నోవర్ రూ.1.5 కోట్ల వరకు ఉన్న వ్యాపారస్థులకు లావాదేవీల విలువ ఎంత ఉన్ననూ ఎండీఆర్ నుంచి మినహాయింపునివ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన ప్రధానంగా పెద్ద వ్యాపార సంస్థలపైనే ఈ భారం పడే అవకాశముంది.
అసలేమిటీ ఎండీఆర్?
డిజిటల్ చెల్లింపులను స్వీకరించేందుకు వ్యాపారస్థులు బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలకు చెల్లించే రుసుమే ఎండీఆర్. ప్రతి డిజిటల్ లావాదేవీలో కొంత శాతాన్ని ఇలా వసూలు చేస్తారు. చెల్లింపుల ప్రాసెసింగ్, సెటిల్‌మెంట్, సాంకేతిక నిర్వహణ, భద్రత వంటి ఖర్చులను భర్తీ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే.. యూజర్ల నుంచి నేరుగా ఈ రుసుమును వసూలు చేయరు. కొన్ని సందర్భాల్లో ఈ సొమ్మును వస్తువుల ధరల్లోనే పరోక్షంగా వసూలు చేస్తుంటారు.
ఎవరిపై ప్రభావం?
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. చాలా వరకు యూపీఐ చెల్లింపులు కొత్త నిబంధనల పరిధిలోకి రావు. వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే లావాదేవీల వివరాలను ఓసారి పరిశీలిస్తే..
86 శాతం లావాదేవీలు రూ.500 లోపు
10 శాతం లావాదేవీలు రూ.501 నుంచి రూ.2 వేల మధ్య
4 శాతం లావాదేవీలు మాత్రం రూ.2 వేలకుపైగా
దీంతో కొత్త ప్రతిపాదన అమల్లోకి వచ్చినా.. మొత్తం యూపీఐ లావాదేవీల్లో కేవలం 4 శాతమే ఎండీఆర్ పరిధిలోకి వచ్చే అవకాశముంది.
నాడు ఎందుకు రద్దు చేశారు?
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 జనవరిలో యూపీఐ, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై ఎండీఆర్‌ను రద్దు చేసింది. అంతకుముందు వ్యాపారులు ఒక శాతంలోపే ఎండీఆర్ చెల్లించేవారు. ఆ నిర్ణయం తర్వాత యూపీఐ వినియోగం భారీగా పెరిగింది. అయితే.. ఎండీఆర్ రద్దు కారణంగా బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలపై ఆర్థిక భారం పెరిగిందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రూ.2 వేలలోపు యూపీఐ లావాదేవీలపై ప్రభుత్వం 0.15 శాతం ప్రోత్సాహకం అందిస్తున్నప్పటికీ, నిర్వహణ వ్యయాలను భర్తీచేసేందుకు అది సరిపోవట్లేదని చెల్లింపు సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ వ్యయంలో ప్రభుత్వ ప్రోత్సాహకం సుమారు 11 శాతం మాత్రమేనని, గతంలో లభించిన ఎండీఆర్ ఆదాయంలో 14 శాతం వరకే భర్తీ అవుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
యూపీఐ జోరు!
దేశంలో కొన్నేళ్లుగా యూపీఐ డిజిటల్ చెల్లింపుల ప్రధాన వేదికగా మారింది. స్మార్ట్‌ఫోన్ వినియోగం, ఇంటర్నెట్ విస్తరణతో యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
2016-17 ఆర్థిక ఏడాదిలో సుమారు 2 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి.
2025-26 నాటికి ఈ సంఖ్య 24 బిలియన్లకు పెరిగింది.
ఈ లావాదేవీల మొత్తం విలువ రూ.7 వేల కోట్ల నుంచి దాదాపు రూ.314 లక్షల కోట్లకు ఎగబాకింది.
ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉండగా.. దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. పెద్ద మొత్తాల యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ అమల్లోకి రావచ్చు. అలాగే చిన్న వ్యాపారులకు మినహాయింపు ఇవ్వడం ద్వారా వారిపై అదనపు భారం పడకపోవచ్చు.
ఇవీ చదవండి:
‘బాస్ స్కామ్’పై జర జాగ్రత్త: సెబీ